నిజమెంత: కోల్‌కతా అత్యాచార నిందితుడితో కేక్ కటింగ్ చేయించారా?

ఆర్‌జి కర్ కాలేజ్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ కార్యాలయంలో ఒక వ్యక్తి కేక్ కట్ చేస్తున్న దృశ్యం వైరల్ అవుతూ ఉంది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  3 Sept 2024 2:00 PM IST
నిజమెంత: కోల్‌కతా అత్యాచార నిందితుడితో కేక్ కటింగ్ చేయించారా?

ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ కార్యాలయంలో ఒక వ్యక్తి కేక్ కట్ చేస్తున్న దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఈ చిత్రంలో ఉన్న వ్యక్తి మహిళా వైద్యురాలిపై అత్యాచారం, హత్య కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ అని పోస్టుల్లో చెబుతున్నారు.

ఒక X వినియోగదారు ఈ చిత్రాన్ని షేర్ చేసి.. "కోల్‌కతా అత్యాచార ఘటనలో నిందితుడు తన పుట్టినరోజును మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ కార్యాలయంలో జరుపుకున్నాడు" అని పోస్టుల్లో తెలిపారు. (ఆర్కైవ్)

రిపబ్లిక్ వరల్డ్ కూడా అదే వాదనతో చిత్రాన్ని నివేదించింది.

నిజ నిర్ధారణ:

ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి కలకత్తా నేషనల్ మెడికల్ కాలేజ్ & హాస్పిటల్ (CNMC & H)లో డేటా ఆపరేటర్, సందీప్ ఘోష్‌కి వ్యక్తిగత సహాయకుడు అయిన ప్రసూన్ ఛటర్జీ అని న్యూస్‌మీటర్ కనుగొంది.

కాబట్టి, వైరల్ అవుతున్న పోస్టులో ఎలాంటి నిజం లేదు.

రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ను నిర్వహించగా.. ఆగస్ట్ 28న ఇన్‌స్టాగ్రామ్ ఖాతా CNMCH RDA (కలకత్తా నేషనల్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్) ద్వారా షేర్ చేసిన ఫోటోలను మేము కనుగొన్నాము. అందులో కేక్ కట్ చేస్తున్న వ్యక్తికి సంబంధించిన వైరల్ ఫోటో ఉంది. ప్రసూన్ ఛటర్జీ అనే వ్యక్తి CNMC & Hలో ఉద్యోగి.

ఆగస్ట్ 30న ప్రచురించిన టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదికను కూడా మేము కనుగొన్నాము, ‘ఫేక్ న్యూస్‌పై కోల్‌కతా పోలీసులు నోటీసులు జారీ చేశారు. అత్యాచారం, హత్య కేసులో నిందితుడైన సంజయ్ రాయ్‌తో ఘోష్ ఉన్నట్లు వైరల్ ఫోటో చూపించలేదని నివేదిక స్పష్టం చేసింది. నివేదికలో ఫోటోలో ఉన్న వ్యక్తి ఘోష్ వ్యక్తిగత డేటా ఆపరేటర్ అని నిర్ధారించారు.

వైరల్ ఫోటోలో ఘోష్ పక్కన నిలబడి కేక్ కట్ చేస్తున్న వ్యక్తి కలకత్తా నేషనల్ మెడికల్ కాలేజ్ & హాస్పిటల్ (CNMC & H) డేటా ఆపరేటర్ ప్రసూన్ ఛటర్జీ అని తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధికార ప్రతినిధి రిజు దత్తా X పోస్ట్‌లో స్పష్టం చేశారు.

మహిళా డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసులో ప్రధాన నిందితుడైన సంజయ్ రాయ్ తన పుట్టినరోజును RG కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌తో కలిసి జరుపుకున్నట్లు చిత్రంలో చూపించలేదని మేము నిర్ధారించాము.

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.

Next Story