FactCheck : భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేయలేదు

భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ‘ఏవియేటర్’ అనే బెట్టింగ్ యాప్‌ను ఎండార్స్ చేస్తున్న పలు వీడియోలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  16 April 2024 11:00 AM GMT
FactCheck : భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేయలేదు

భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ‘ఏవియేటర్’ అనే బెట్టింగ్ యాప్‌ను ఎండార్స్ చేస్తున్న పలు వీడియోలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి.

ప్రముఖ టీవీ జర్నలిస్టులు ఏవియేటర్‌ను ప్రచారం చేయడంపై వైరల్ ప్రకటనలు మొదలవుతాయి. ఆ తర్వాత విరాట్ కోహ్లీ క్లిప్‌ కనిపిస్తుంది. అందులో బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేస్తున్నారని స్పష్టం చేస్తోంది.

వీడియోలలో.. విరాట్ కోహ్లీ తక్కువ పెట్టుబడితో భారీ ఆదాయం వస్తుందని వాగ్దానం చేస్తూ ప్రజలను ఆకర్షించడం చూడవచ్చు.

నిజ నిర్ధారణ :

విరాట్ కోహ్లీ వీడియోలు డీప్‌ఫేక్‌ వీడియోలని న్యూస్‌మీటర్ గుర్తించింది. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని గుర్తించింది.

విరాట్ కోహ్లీ ఏదైనా బెట్టింగ్ యాప్‌ ను ప్రమోట్ చేస్తున్నట్లు సంబంధిత మీడియా నివేదికల ద్వారా కీవర్డ్ సెర్చ్ ను అమలు చేశాం. మా పరిశోధనలో అలాంటిది ఏదీ కనుగొనలేకపోయాము. బెట్టింగ్ యాప్‌ను విరాట్ కోహ్లీ ప్రమోట్ చేసినట్లయితే ప్రధాన స్రవంతి మీడియా తప్పకుండా కథనాలను ప్రచురించి ఉండేది.

వైరల్ వీడియోను నిశితంగా విశ్లేషించినప్పుడు.. మేము పెదవుల కదలికలను కూడా గుర్తించాం. చెబుతున్నది ఒకటి.. పెదాలు కదులుతున్నది మరొకటి లాగా స్పష్టంగా తెలుస్తూ ఉంది. నాణ్యత లేని విజువల్స్ కూడా వీడియో మీద అనుమానాలను పెంచాయి. వీడియో ఒరిజినల్ కాదని గుర్తించాం.

వైరల్ వీడియోల మూలాన్ని తెలుసుకోడానికి ప్రయత్నించాం.

ఓ గేమ్‌ను డౌన్‌లోడ్ చేయమని విరాట్ కోహ్లీ కోరారు. ఆ వీడియోకు ట్యాగ్ చేసిన లింక్‌ను కూడా మేము కనుగొన్నాము. లింక్ మమ్మల్ని Google Play Storeలో ‘101F’ అనే క్యాసినో గేమ్‌కి దారి మళ్లించింది.

వైరల్ వీడియో నుండి కీఫ్రేమ్‌లను తీసుకుని మేము రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసాము. Redditలో ఖచ్చితమైన వీడియోను కనుగొన్నాము. వీడియో ఒరిజినల్ వెర్షన్‌లో, విరాట్ కోహ్లీ ‘ట్రోలింగ్‌ను ఎలా అధిగమించాలి’ లాంటి విషయాలను గురించి మాట్లాడటం చూడవచ్చు. ఈ వీడియో 2017లో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ తర్వాత మీడియా సెషన్‌కు విరాట్ కోహ్లీ హాజరైనప్పటిది.

మేము Cricket.com.au కు సంబంధించిన YouTube ఛానెల్‌లో 'Kohli credits Aussie fight but says friendships over’ అనే టైటిల్ తో వీడియోను అప్లోడ్ చేసినట్లు కూడా మేము కనుగొన్నాము.


వీడియో డిస్క్రిప్షన్ లో “India captain Virat Kohli hit out at critics for his below-par performance and said he was impressed with Australia’s determination before claiming the series had ruined friendships.” అని ఉంది. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ప్రదర్శన విషయంలో వస్తున్న విమర్శలపై స్పందించాడు.

మా శోధనలో, అనంత్ అంబానీ, అక్షయ్ కుమార్, సచిన్ టెండూల్కర్ వంటి ప్రముఖులకు ఆపాదించిన పలు నకిలీ వీడియోలను మేము కనుగొన్నాము. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ని ఉపయోగించి స్కామ్ లకు పాల్పడుతూ ఉన్నారు. ఆన్‌లైన్ వ్యాపారాలను ప్రోత్సహించడానికి డీప్‌ఫేక్‌లను ఉపయోగిస్తూ ఉన్నారు.

ప్రముఖుల అనుమతులు లేకుండా డీప్ ఫేక్ వీడియోలను సృష్టిస్తూ ఉన్నారు. లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఈ నకిలీ వీడియోలపై స్పందించారు. “ఈ వీడియోలు నకిలీవి. టెక్నాలజీని విచ్చలవిడిగా దుర్వినియోగం చేయడం ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి వీడియోలు, ప్రకటనలు, యాప్‌లను పెద్ద సంఖ్యలో రిపోర్టు చేయాలి. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో చాలా అప్రమత్తంగా ఉండాలి. తప్పుడు సమాచారం, డీప్‌ఫేక్‌ల వ్యాప్తిని అడ్డుకోవాలి. లేదంటే చాలా నష్టం జరిగే అవకాశం ఉంది" అని హెచ్చరించారు. పలువురు ప్రముఖులకు సంబంధించిన డీప్ ఫేక్ వీడియోల ద్వారా ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు.

కాబట్టి, వైరల్ వీడియో డీప్‌ఫేక్ అని స్పష్టంగా తెలుస్తోంది. విరాట్ కోహ్లీ బెట్టింగ్ యాప్ ‘ఏవియేటర్’ని ప్రమోట్ చేయలేదు.

Credits : Sunanda Naik

Next Story