స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా, భారతీయ జెండాను ప్రదర్శించడానికి ముస్లిం దుకాణదారుడు నిరాకరించిన వీడియో వైరల్‌గా మారింది.
ఒక X వినియోగదారు ఈ వీడియోను, “ఈ దేశద్రోహులను ఏమి చేయాలి? ఇంతకుముందు కాషాయ జెండాతో ఇబ్బందులు ఎదుర్కొన్నామని చెప్పారు.. ఇప్పుడు త్రివర్ణ పతాకం విషయంలో కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెబుతున్నారు. కొంతమంది హిందూ సోదరులు దేశద్రోహుల దుకాణంలో త్రివర్ణ పతాకాన్ని ఉంచడానికి ప్రయత్నించారు, కాని అందుకు ఈ దేశద్రోహి నిరాకరించాడు" (హిందీ నుండి అనువాదం) అంటూ పోస్టులు పెట్టారు.
ఓ వ్యక్తి తన షాపులో చిన్న చిన్న జెండాలను ఉంచడానికి కొందరు వ్యక్తులను అడ్డుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
పలు సోషల్ మీడియా ఖాతాలలో కూడా ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు.
నిజ నిర్ధారణ:
న్యూస్‌మీటర్ వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని కనుగొంది.
రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఆగస్ట్ 14, 2023న రితిక్ కటారియా అనే వ్యక్తికి సంబంధించిన YouTube ఛానెల్‌లో ఒరిజినల్ వీడియోను అప్‌లోడ్ చేశారని మేము గుర్తించాం.
ఈ వీడియో కొత్తది కాదని తెలుస్తోంది. దీన్ని స్క్రిప్ట్ ద్వారా తయారు చేశారు. తన దుకాణం పైన అప్పటికే జాతీయ జెండా ఉందని ముస్లిం దుకాణదారు వెల్లడించడంతో వీడియో ముగిసింది. మత సామరస్యం ప్రాముఖ్యతను నొక్కిచెప్పిన ఒక పోలీసు అధికారిని కూడా వీడియోలో చూడొచ్చు. వీడియో వివరణలో #motivationalstory, #trending, #viral వంటి హ్యాష్‌ట్యాగ్‌లు ఉండడమే కాకుండా.. ఈ వీడియో స్క్రిప్ట్ చేశారని తెలిపారు.
ఛానెల్ బయోలో “మేము మిమ్మల్ని ప్రోత్సహించడానికి, మంచి కోసం ఇక్కడ ఉన్నాము. నేను రితిక్ కటారియాను, అమర్ కటారియా కుమారుడు" అని కూడా ఉంది. ముస్లిం దుకాణదారుడి పాత్ర పోషించిన వ్యక్తి ఛానెల్ యజమాని "రితిక్ కటారియా". ఆయన తండ్రి అమర్ కటారియా. పోలీసు ఉద్యోగంలో ఉన్నప్పటికీ ఆయనకు నటన అంటే చాలా ఇష్టం అని చెబుతూ ఉంటారు. అదే నటీనటులను కలిగి ఉన్న ఇతర వీడియోలను కూడా ఛానెల్ పోస్ట్ చేసింది.
మే 20న, అమర్ కటారియా పుట్టినరోజును పురస్కరించుకుని ఛానెల్ ఒక వీడియోను అప్‌లోడ్ చేసింది
వీడియోలో, రితిక్ కటారియా అమర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. అతన్ని తన తండ్రి అని తెలిపారు. అమర్ కూడా రితిక్‌ని తన కొడుకు అని సంబోధిస్తారు.
అంతేకాకుండా, రితిక్ కటారియా అకౌంట్ ను ఇన్‌స్టాగ్రామ్‌లో కనుగొన్నాము. అతని బయోలో అతను తాను నటుడని చెప్పుకొచ్చాడు.
అందువల్ల, ఒక ముస్లిం దుకాణదారుడు భారత జెండాను షాప్ పై ఉంచడానికి నిరాకరించాడనే వాదన తప్పు. వీడియోలో ఉన్నది నటీనటులు. జెండాను ఎక్కడ పడితే అక్కడ కట్టకూడదని.. తాను అప్పటికే షాప్ పైన ఎత్తులో కట్టేశానని ఆ వ్యక్తి చెప్పడంతో వీడియో ముగుస్తుంది.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.