FactCheck : ఆలయ ప్రాంగణంలో చికెన్ షాపు.. వాయనాడ్ కు చెందిన వీడియో అంటూ జరుగుతున్న ప్రచారం నిజం కాదు

ఓ ఆలయ ప్రాంగణంలో చికెన్ షాపు ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  2 May 2024 4:08 AM GMT
FactCheck : ఆలయ ప్రాంగణంలో చికెన్ షాపు.. వాయనాడ్ కు చెందిన వీడియో అంటూ జరుగుతున్న ప్రచారం నిజం కాదు

ఓ ఆలయ ప్రాంగణంలో చికెన్ షాపు ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.

ప్రస్తుతం వాయనాడ్ పార్లమెంటు సభ్యుడిగా ఉన్న కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, అతని సోదరి ప్రియాంక గాంధీ ఆలయాన్ని ముస్లింలు స్వాధీనం చేసుకోవడానికి సహాయం చేశారనే వాదనతో వీడియోను షేర్ చేస్తున్నారు. ఆలయం లోపల ఉన్న చికెన్ దుకాణాన్ని చూపించే వీడియో సోషల్ మీడియాలో పలు ఖాతాలలో పోస్టులు చేస్తున్నారు.

చికెన్ షాప్ సీతా-రామ మందిరం లోపల ఉందని వీడియోలోని వాయిస్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. “కేరళలోని వాయనాడ్‌లో, రాహుల్ గాంధీ మరియు ప్రియాంక వాద్రాలు భారీ హిందూ దేవాలయం శ్రీ సీతారామ్ మందిర్‌ను స్వాధీనం చేసుకున్నారు. దానిని నాలుగు సంవత్సరాల క్రితం ముస్లింల కోసం ఇచ్చేసారు. ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్న బ్రాహ్మణులు, క్షత్రియులు సంతోషించాలి. ప్రతి ఒక్కరూ బీజేపీకి మాత్రమే ఓటు వేయాలి, ” అని వీడియోను షేర్ చేసిన X వినియోగదారు రాశారు.


నిజ నిర్ధారణ :

వైరల్ అవుతున్న వీడియో పాకిస్థాన్‌కు చెందినది. వాయనాడ్ కు చెందినది కాదని న్యూస్‌మీటర్ కనుగొంది.

వీడియో కీఫ్రేమ్స్ ను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ చేయగా.. మేము డిసెంబర్ 17, 2023 నాటి పంజాబ్ కేసరి మీడియా సంస్థ నివేదికను కనుగొన్నాము. అందులో వైరల్ వీడియోకు సంబంధించిన స్క్రీన్‌గ్రాబ్‌లను చూడొచ్చు. నివేదిక ప్రకారం, పాకిస్తాన్‌లోని అహ్మద్‌పూర్ సియాల్‌లోని చారిత్రాత్మకమైన సీతా-రామ హిందూ దేవాలయాన్ని అపవిత్రం చేసి చికెన్ షాప్‌గా మార్చారు. ఈ ఆలయం అపారమైన చారిత్రక , సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉందని.. ఒక శతాబ్దం క్రితం నిర్మించారని కూడా పేర్కొంది.

డిసెంబరు 18, 2023న రిపబ్లిక్ వరల్డ్ ఇచ్చిన నివేదికలో కూడా పాకిస్థాన్ లోని ఆలయమేనని తెలిపారు. చారిత్రాత్మకమైన సీతా-రామ మందిరం చికెన్ షాప్‌గా మార్చారనే శీర్షికతో.. ఆలయం విజువల్స్‌ను చూపించే మరొక వీడియోను కూడా మేము కనుగొన్నాము. పాకిస్థాన్‌లోని అహ్మద్‌పూర్ సియాల్‌లో ఈ ఆలయం ఉంది. ఈ వీడియోలో ఉన్న ఓ వ్యక్తి ఆ ప్రదేశంలో హిందువుల జనాభా ఎక్కువగా లేదని చెబుతున్నాడు. ఆ బిల్డింగ్‌పై ‘ఓం’ అని రాసి ఉండడాన్ని గమనించవచ్చు. అక్కడ నిర్వహిస్తున్న చికెన్ షాపును చూడవచ్చు.

ఈ ఆధారాలతో, మేము Google మ్యాప్స్‌లో ఆలయం కోసం వెతికాము. ఒకే విధమైన విజువల్స్‌తో చిత్రాలను కనుగొన్నాము. వైరల్ వీడియో స్క్రీన్‌గ్రాబ్, అదే నిర్మాణాన్ని చూపుతున్న Google మ్యాప్స్‌లోని చిత్రాలలో కూడా చూడొచ్చు. ఆలయం పోలిక ఇక్కడ ఉంది.


న్యూస్‌మీటర్‌తో కేరళ బీజేపీ మీడియా సెల్ కన్వీనర్ సువర్ణ ప్రసాద్ మాట్లాడారు. ఆలయాన్ని స్వాధీనం చేసుకున్నారనే ఆరోపణలను ఆయన ఖండించారు. "వయనాడ్‌లో అలాంటి సంఘటనేమీ జరగలేదు. వాయనాడ్‌లో సీతాదేవికి అంకితం చేసిన ఏకైక ప్రసిద్ధ ఆలయం సీతాదేవి లవకుశ అని, అందులో రాముడి విగ్రహం లేదు. అయితే, ఆలయంపై ఎలాంటి గొడవ జరిగినట్లు నివేదికలు లేవు" అని ఆయన అన్నారు.

వాయనాడ్‌లోని పుల్‌పల్లిలోని సీతాదేవి లవకుశ ఆలయ కార్యనిర్వహణాధికారి సి.విజేష్‌ను న్యూస్‌మీటర్ సంప్రదించింది.. ఆయన కూడా ఆలయాన్ని స్వాధీనం చేసుకున్నారనే ఆరోపణలను కొట్టిపారేశారు.

వైరల్ క్లెయిమ్ ఫేక్ అని కొట్టిపారేసిన ఆయన.. “ఈ ప్రత్యేకమైన ఆలయం సీతాదేవి, లవకుశలకు మాత్రమే అంకితం చేశారు. దక్షిణ భారతదేశంలో ఇలాంటి ఆలయం ఇది ఒక్కటే. వైరల్ అవుతున్న వాదనలు నిరాధారమైనవి. మాకు ఇక్కడ అలాంటి మతపరమైన వివాదాలు లేవు. ఆలయానికి అన్ని వర్గాల ప్రజలకు స్వాగతం పలుకుతాము" అని ఆయన ఉద్ఘాటించారు.

అందువల్ల, వాయనాడ్‌లోని సీతారాముడి ఆలయాన్ని స్వాధీనం చేసుకునేందుకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ముస్లింలకు సహాయం చేశారనే వాదనలు అవాస్తవమని మేము నిర్ధారించాము.

Credits : Md Mahfooz Alam

Claim Review:ఆలయ ప్రాంగణంలో చికెన్ షాపు.. వాయనాడ్ కు చెందిన వీడియో అంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు.
Claimed By:X Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:X
Claim Fact Check:False
Next Story