జీడిపప్పును కృత్రిమంగా తయారు చేసి ప్రజలను మోసం చేయవచ్చంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
చిరుతిళ్ల తయారీ యూనిట్‌లో నకిలీ జీడిపప్పు తయారు చేస్తున్నట్లు సోషల్‌మీడియాలో ఓ వీడియో చక్కర్లు కొడుతోంది.
కాజూలను పోలి ఉన్నవి తయారు చేస్తూ ఉన్నారని.. కొనుగోలు చేసే ముందు జీడిపప్పును తనిఖీ చేయాలని వీడియోలో ప్రజలను హెచ్చరిస్తున్నట్లు గమనించవచ్చు.
“నా స్నేహితుడు ఈ వీడియోను పంపాడు. ఇప్పుడు మనకు మరో సమస్య వచ్చింది. దయచేసి కొనుగోలు చేసే ముందు జీడిపప్పును తనిఖీ చేయండి.”అని వైరల్ ట్వీట్ లో ఉంది.
నిజ నిర్ధారణ :
వైరల్ అవుతున్న పోస్టులో ఎటువంటి నిజం లేదు.
ఈ వీడియో కాజు బిస్కెట్ తయారీ యూనిట్‌కి చెందినది. ఆ వైరల్ వీడియోలో చేసిన ఆరోపణల్లో నిజం లేదని NewsMeter కనుగొంది.
మేము పోస్ట్‌ను విశ్లేషించాము. తప్పుడు సమాచారాన్ని పోస్టు చేసారంటూ నెటిజన్లు వైరల్ వీడియో కింద కామెంట్లు చేసినట్లు కనుగొన్నాం. ఇవి నకిలీ జీడిపప్పులు కావని, జీడిపప్పు ఆకారంలో ఉండే బిస్కెట్లని తెలిపారు. పిండిని జీడిపప్పు ఆకారంలో కట్ చేస్తారు. ఇవి జీడిపప్పు ఆకారంలో ఉండే బిస్కెట్లు అని స్పష్టంగా తెలుస్తోంది.
దీన్ని ఒక క్లూగా తీసుకుని, మేము కీవర్డ్ సెర్చ్ ను నిర్వహించాము. YouTubeలో కాజు బిస్కెట్ తయారీ ప్లాంట్‌లకు సంబంధించి అనేక వీడియోలను కనుగొన్నాము. కాజు ఆకారపు కుకీలు మార్కెట్‌లో అమ్ముతూ వస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఇళ్లలో కూడా తయారు చేస్తూ వస్తున్నారు.
ఈ కాజు బిస్కెట్లను ఆన్‌లైన్‌లో కూడా విక్రయిస్తున్నారు.
వైరల్ వీడియోలో ఉన్నవి జీడిపప్పు ఆకారంలో ఉన్న బిస్కెట్లు. నకిలీ జీడిపప్పులు కాదని మేము నిర్ధారించాము.
Credits : Sunanda Naik