రాజస్థాన్ లో ముఖ్యమంత్రి పదవికి సంబంధించి భారతీయ జనతా పార్టీ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. రాజస్థాన్ ముఖ్యమంత్రిగా భజన్ లాల్ శర్మను ప్రకటించారు. ఎంతో మంది బడా నాయకులు.. రెండు పర్యాయాలు ముఖ్యమంత్రి అయిన వసుంధర రాజేను పక్కన పెట్టారు. మధ్యప్రదేశ్‌లో 18 ఏళ్ల పాటు సీఎంగా ఉన్న శివరాజ్‌సింగ్ చౌహాన్ ను కాదని బీజేపీ మోహన్ యాదవ్‌ను ఎంపిక చేసింది.
ఇలాంటి సమయంలో వసుంధర రాజే ప్రమాదవశాత్తు జారి కింద పడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డిసెంబర్ 12న పార్టీ శాసనసభా సమావేశానికి ఆమె బరువెక్కిన హృదయంతో వెళుతుండగా ఈ ఘటన జరిగిందని వినియోగదారులు పేర్కొంటున్నారు.
బరువెక్కిన హృదయంతో నేడు శాసనసభా పక్ష సమావేశానికి వెళ్తున్నారు. జాట్‌ల కోడలు, రాజపుత్రుల కుమార్తె.. గుర్జర్ల మద్దతు ఉన్న ఆమె ఎంతో బాధపడుతూ ఉన్నారని తెలిపారు. ఈ రోజు వేరొకరి కల నెరవేరుతోంది.. మరొకరి కల కలగానే మిగిలిపోయింది అంటూ పలువురు సోషల్ మీడియా వినియోగదారులు ఈ వీడియోను షేర్ చేస్తున్నారు.
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న వీడియో ఏకంగా 7 సంవత్సరాల పాతదని న్యూస్ మీటర్ కనుగొంది. బీజేపీ శాసనసభ సమావేశానికి ముందు ఈ ఘటన జరిగిందన్న వాదన అవాస్తవం.
వీడియో కీఫ్రేమ్స్ ను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. జూలై 9, 2017న వెరిఫైడ్ యూట్యూబ్ ఛానెల్ VTV గుజరాతీ న్యూస్ అండ్ బియాండ్ లో మేము రాజే కింద పడిపోతున్న వీడియో గురించి రిపోర్ట్ చేయడాన్ని మేము చూశాము. “CM వసుంధర రాజే స్లిప్ అండ్ ఫాల్ డౌన్,” అనే టైటిల్ తో వీడియోను పోస్టు చేశారు.
“Vasundhara Raje fell while walking.” అనే టైటిల్ తో మరో వీడియోను అప్లోడ్ చేయడాన్ని కూడా మేము కనుగొన్నాం. జులై 8, 2017న ఈ వీడియోను అప్లోడ్ చేశారు.
2016 నుండి వచ్చిన ఒక వార్తా కథనం ప్రకారం.. రాజే ధోలాపూర్‌లో దీపావళి జరుపుకోవడానికి వెళ్ళినప్పుడు ఈ సంఘటన జరిగింది. ఆమె హెలిప్యాడ్ దగ్గర నడుచుకుంటూ వెళుతున్న సమయంలో చీరలో కాలు ఇరుక్కుపోవడంతో కిందపడిపోయారు.
కాబట్టి, వైరల్ వీడియో పాతది. వసుంధర రాజేను ఇటీవల ముఖ్యమంత్రి పదవి నుండి పక్కన పెట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుందంటూ వైరల్ అవుతుందన్న పోస్టుల్లో ఎలాంటి నిజం లేదు. కొత్త రాజస్థాన్ ముఖ్యమంత్రి ప్రకటనతో తప్పుగా లింక్ చేశారని మేము నిర్ధారించాము.