మహిళల రక్షణ కోసం తెలంగాణ పోలీసులు ఓ హెల్ప్ లైన్ నెంబర్ ను ఏర్పాటు చేశారంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులను వైరల్ చేస్తూ ఉన్నారు. విమెన్ సేఫ్టీ హెల్ప్ లైన్ నెంబర్ అంటూ 9969777888 ఈ నెంబర్ ను వైరల్ చేస్తూ ఉన్నారు.
మహిళలు ప్రయాణించే ఏ వాహనం యినా కార్, క్యాబ్, ఆటో.. నెంబర్ ను 9969777888 నెంబర్ కు మెసేజీ చేయగానే.. పోలీసులు ఆ వాహనాన్ని జీపీఆర్ఎస్ ద్వారా ట్రాక్ చేస్తారు అంటూ ఆ మెసేజీని వైరల్ చేస్తూ ఉన్నారు. మీకు తెలిసిన ఇతర ఆడవారికి కూడా ఈ విషయాన్ని తెలియజేయండి అంటూ పోస్టులు పెడుతూ ఉన్నారు. వీలైనంత మందికి దీన్ని ఫార్వర్డ్ చేయండి అని మెసేజీలలో కోరారు.
నిజ నిర్ధారణ:
ఈ వైరల్ నెంబర్ ను న్యూస్ మీటర్ చెక్ చేయగా.. ఇది ఒక ఫేక్ అని తేలింది. తెలంగాణ పోలీసులు ఇలా ఏ నెంబర్ ను కూడా ఇవ్వలేదు.
ఈ నెంబర్ గురించి ఆన్ లైన్ లో సెర్చ్ చేయగా హైదరాబాద్ సిటీ పోలీసులు ఈ నెంబర్ గురించి క్లారిటీ ఇవ్వడం కూడా జరిగింది. హైదరాబాద్ సిటీ పోలీసులు తమ ట్విట్టర్ ఖాతాలో 9969777888 నెంబర్ ఫేక్ అని తేల్చేశారు.
ఇక ఇదే నెంబర్ బెంగళూరు పోలీసులు కూడా ఇచ్చారు అంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడం జరిగింది. బెంగళూరు పోలీసులు కూడా 9969777888 నెంబర్ కు మెసేజ్ చేస్తే ట్రాక్ చేస్తారంటూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేయగా.. అందులో ఎటువంటి నిజం లేదని తేల్చేశారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కూడా డిసెంబర్ లో ఈ నెంబర్ కు బెంగళూరు పోలీసులకు సంబంధం లేదని చెప్పారు. 2017 సంవత్సరం లో ముంబై స్పెసిఫిక్ సర్వీస్ ఈ నెంబర్ ను ఉపయోగించిందని.. ఆ తర్వాత డిస్కంటిన్యూ చేశారని స్పష్టం చేశారు. కాబట్టి 9969777888 నెంబర్ కు మెసేజీ పెట్టినా ఎటువంటి ప్రయోజనం లేదు. ఈ వైరల్ మెసేజీలను నమ్మకండి.
'9969777888' అన్నది మహిళల కోసం తెలంగాణ పోలీసులు ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నెంబర్ అంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.