కొత్త రేషన్‌కార్డుల జారీకి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇస్తోందంటూ ఓ పోస్టర్, అలాగే ఓ ఫారం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 21 నుంచి రాష్ట్రంలో కొత్త రేషన్‌కార్డులను ఇవ్వడానికి సిద్ధమైందని ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు, మంత్రి కెటి రామారావు చిత్రాలతో పాటు, ఒక ఫారమ్, అవసరమైన పత్రాల జాబితాతో ఉన్న ‘నోటిఫికేషన్’ ను సోషల్ మీడియా యూజర్లు షేర్ చేస్తున్నారు.
నిజ నిర్ధారణ :
వైరల్ అవుతున్న వాదనల్లో ఎటువంటి నిజం లేదు.
మేము ఆన్‌లైన్‌లో కీవర్డ్ సెర్చ్ చేయడం ద్వారా మా దర్యాప్తు ప్రారంభించాము. తెలంగాణ ప్రభుత్వం అటువంటి నోటిఫికేషన్ విడుదల చేయలేదని ఆగస్టు 17న మున్సిఫ్ డైలీలో నివేదికను కనుగొన్నాము.
“కొత్త రేషన్ కార్డుల జారీపై సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న సమాచారం నిరాధారమని తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. రేషన్ కార్డు జారీ ప్రక్రియకు సంబంధించి కొందరు వ్యక్తులు నిరాధారమైన వాదనలను ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు." అంటూ మీడియా నివేదిక తెలిపింది.
ప్రభుత్వ పథకాలను ట్రాక్ చేసే వెబ్‌సైట్ ప్రకారం.. కొత్త రేషన్ కార్డు జారీకి సంబంధించిన వాదనలలో వాస్తవం లేదని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఈ వార్తలను ఆయన ఖండించారు. ఈ నివేదికలు తప్పుడు ప్రచారంలో భాగమని.. ఇలాంటి తప్పుదోవ పట్టించే సమాచారాన్ని ప్రజలు నమ్మవద్దని ఆయన కోరారు. రాష్ట్రంలో కొత్త రేషన్‌కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభించలేదని, తప్పుడు పోస్టులను పంచుకోవద్దని సూచించారు. ప్రజలను గందరగోళపరిచే లక్ష్యంతో మోసపూరిత కంటెంట్‌ను వ్యాప్తి చేసే వారిపై చర్యలు తీసుకుంటామని గంగుల కమలాకర్ హెచ్చరించారు."
న్యూస్‌మీటర్‌తో తెలంగాణ ప్రభుత్వ అధికారి ఒకరు మాట్లాడుతూ, “ప్రస్తుతం, తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ చేస్తోందంటూ సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం ప్రచారంలో ఉంది. ఈ వార్తలు నిరాధారమైనవి. రేషన్ కార్డు జారీ ప్రక్రియకు సంబంధించి కొంతమంది వ్యక్తులు అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. విశ్వసనీయ వెబ్‌సైట్‌లు, వ్యక్తుల ద్వారా వచ్చే వార్తలనే నమ్మాలని.. వైరల్ అయ్యే వార్తలపై ఫ్యాక్ట్ చెక్ చేయాలని కోరుతున్నాను" అని అన్నారు.
“సోషల్ మీడియా, వాట్సాప్ లు సమాచారాన్ని, కంటెంట్‌ను ప్రచారం చేయడానికి సాధనాలుగా సహాయపడుతున్నాయి. కానీ వాటిని తప్పుడు పద్ధతిలో ఉపయోగిస్తే నష్టం కూడా కలుగుతుంది. లైక్‌లు, కామెంట్‌ల కోసం ఉద్దేశపూర్వకంగా నకిలీ వార్తలను కొందరు వ్యాప్తి చేస్తూ ఉంటారు. దీంతో ప్రజలు తప్పుడు వార్తలను కూడా నమ్మేస్తూ ఉంటారు ”అని అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్‌కార్డులు ఇస్తోందన్న వాదనలో ఎటువంటి నిజం లేదు. వైరల్ పోస్టులు ఒక బూటకం.
Credits : Sunanda Naik