శ్రీలంక క్రికెట్ జట్టు ఇటీవలి కాలంలో ఘోరమైన ఓటములను ఎదుర్కొంటూ ఉంది. ప్రత్యర్థులకు సరైన పోటీ ఇవ్వలేకపోతోంది. శ్రీలంక క్రికెట్ జట్టు ఇటీవలే ఇంగ్లాండ్‌తో జరిగిన టి 20 సిరీస్‌ను కోల్పోయింది. కొంతమంది సభ్యులు COVID-19 ఆంక్షలను ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీనివల్ల అసంతృప్తి చెందిన అభిమానులు క్రికెటర్లకు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో పలు పోస్టులు పెట్టారు. వారిని అన్ ఫాలో చేయాలంటూ సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభించారు.
ఇక శ్రీలంక క్రికెట్ జట్టు కెప్టెన్ కుసాల్ జనిత్ పెరెరా యొక్క ఫోటో సోషల్ మీడియాలో ప్రసారం చేయడం మొదలు పెట్టారు. అభిమానుల విమర్శలకు ప్రతిస్పందనగా ఇటీవల విలేకరుల సమావేశంలో అభిమానులపై శ్రీలంక జట్టు కెప్టెన్ ఆగ్రహం వ్యక్తం చేశాడనే వార్తలు కూడా వైరల్ అయ్యాయి.
"సోషల్ మీడియాలో మమ్మల్ని దిగజార్చడం విజయాలు సాధించడంలో సహాయపడదు. అది మమ్మల్ని మానసికంగా నలిపివేస్తుంది, మరింత పరాజయాలకు దారితీస్తుంది. మీరు విమర్శలను ఆపలేకపోతే మ్యాచ్‌లు చూడటం మానేయండి." అంటూ కుసాల్ జనిత్ పెరెరా చెప్పినట్లుగా పోస్టులను పెడుతూ ఉన్నారు.
నిజమెంత:
వైరల్ అవుతున్న వార్తల్లో 'ఎటువంటి నిజం లేదు'.
28 జూన్ 2021 న విలేకరుల సమావేశంలో పెరెరా అలాంటి వ్యాఖ్యలు చేయలేదు.
న్యూస్‌మీటర్ యూట్యూబ్‌లో విలేకరుల సమావేశం యొక్క వీడియోను చూసింది. అందులో పెరెరా అభిమానులపై ఎక్కడా ఆగ్రహించలేదని తెలుస్తోంది. సోషల్ మీడియాలో క్రికెటర్లను అభిమానులు కించపరచడం లేదా క్రికెటర్లను మానసికంగా నలిపివేయడం గురించి ఆయన ఎటువంటి వ్యాఖ్య చేయలేదు. విమర్శలను ఆపలేకపోతే మ్యాచ్‌లు చూడటం మానేయమని పెరెరా వ్యాఖ్యలు చేయలేదు.
అతను ఇంగ్లాండ్‌పై ఓడిపోయినందుకు మరియు COVID- 19 నిబంధనలను ఉల్లంఘించినందుకు జట్టు తరపున అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. "నేను కెప్టెన్‌గా క్షమాపణలు కోరుతున్నాను, మా అభిమానులు ఇంకా మాతోనే ఉన్నారని మేము భావిస్తున్నాను. భవిష్యత్తులో కూడా ఎలాంటి పరిస్థితుల్లో అయినా మాకు మద్దతు ఇవ్వడం కొనసాగించాలని నేను కోరుతున్నాను. మా తప్పులు సరిదిద్దుకుని వీలైనంత త్వరగా గెలుపు బాట పడుతామని అన్నారు"
శ్రీలంక వార్తా సంస్థ న్యూస్‌వైర్ కూడా పెరెరా క్షమాపణ వీడియోను పోస్టు చేసింది. విలేకరుల సమావేశం యొక్క పూర్తి వీడియోను కూడా ఉంది.
విలేకరుల సమావేశంలో శ్రీలంక క్రికెట్ కెప్టెన్ అభిమానులపై విరుచుకుపడలేదని స్పష్టమైంది. అందువల్ల వైరల్ అవుతున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు.