భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుని వచ్చిన రైతు బిల్లులకు వ్యతిరేకంగా పలు పార్టీలు ఇప్పటికే నిరసనలను తెలియజేస్తున్న సంగతి తెలిసిందే..! రైతులు కూడా తమ నిరసనలను ఆపడం లేదు. ప్రభుత్వంతో చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి.
రైతు చట్టాలకు వ్యతిరేకంగా భజరంగ్ దళ్ సభ్యులు కూడా నిరసనలు తెలియజేస్తూ ఉన్నారంటూ ఓ వీడియో క్లిప్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది. భారత ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉండడం ఈ వీడియోలో చూడొచ్చు.
భారతీయ జనతా పార్టీకి మద్దతుగా నిలిచే భజరంగ్ దళ్ రైతులకు మద్దతుగా నిలిచిందని పలువురు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన మీడియా ప్యానెలిస్ట్ సురేంద్ర రాజ్ పుత్ కూడా ఈ వీడియో గురించి ట్వీట్ చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీకి చెందిన భజరంగ్ దళ్ కూడా రైతులకు మద్దతుగా నిలిచింది అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.
నిజ నిర్ధారణ :
వైరల్ అవుతున్న వీడియోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా NEWS TODAY 24 అనే మీడియా సంస్థకు సంబంధించిన వీడియో చూడొచ్చు. వైరల్ అవుతున్న వీడియో కంటే ఇక్కడ అప్లోడ్ చేసిన వీడియో నిడివి కూడా ఎక్కువే ఉంది. అయితే ఈ వీడియోలో నిరసనలు తెలియజేస్తోంది భజరంగ్ దళ్ నేతలు కాదు..! శివ సేన నేతలు.
వీడియోను అప్లోడ్ చేయడం కూడా శివసేన నేతలు చేస్తున్న నిరసనలు అనే ఉంది. దేశంలో పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా ఎద్దులబండితో నిరసన తెలియజేశారు. హింగోళి ప్రాంతంలో శివ సేన డిస్ట్రిక్ట్ చీఫ్ సంతోష్ బంగర్ నేతృత్వంలో ఈ ర్యాలీని నిర్వహించారు.
శివ సేన పార్టీ చేస్తున్న నిరసన ప్రదర్శన అంటూ పలు మీడియా సంస్థలు ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాయి.. యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేశాయి.
"Outlook" కథనం ప్రకారం శివ సేన మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో పెరుగుతున్న పెట్రోల్-డీజిల్ ధరల కారణంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలను నిర్వహించింది.
భజరంగ్ దళ్ కార్యకర్తలు రైతుల ఉద్యమానికి మద్దతు తెలుపుతూ రోడ్ల మీదకు వచ్చారంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు. ఈ వీడియోలో ఉన్నది శివసేన పార్టీకి చెందిన వారు. మహారాష్ట్రలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.