రతన్ టాటా.. ఎంతో గొప్ప మనసున్న వ్యక్తి..! తన ఆదాయంలో చాలా భాగాన్ని ఆయన దానధర్మాలకు వాడుతూ ఉంటారు. కరోనా మహమ్మారితో భారతదేశం ఓ వైపు పోరాడుతూ ఉండగా.. ఆయన కూడా తన చేతనైనంత సహాయం అందిస్తూ ఉన్నారు.
తాజాగా ఆయన తన ఆస్థినంతా దేశానికి ఇచ్చేస్తానని చెప్పారంటూ ఓ పోస్టు వైరల్ అవుతూ ఉంది. 'నా ఆస్థి నంతా ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్నాను.. భారత్ కరోనా నుండి విముక్తి చెందితే చాలు' అన్నట్లుగా ఓ పోస్టు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ ఉంది.
నిజ నిర్ధారణ:
కరోనాతో పోరాడడానికి తన ఆస్థి మొత్తాన్ని ఇచ్చేస్తానని రతన్ టాటా చెప్పినట్లుగా ఎటువంటి వార్తా కథనం కూడా ప్రచురించబడలేదు. నా ఆస్థి నంతా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను.. భారత్ కరోనా నుండి విముక్తి చెందితే చాలని రతన్ టాటా అన్నట్లుగా టాటా గ్రూప్ అఫీషియల్ అకౌంట్లలో కూడా రాలేదు. ఆయన ట్విట్టర్ ఖాతాలో కూడా ఇందుకు సంబంధించి ఎలాంటి ట్వీట్ రాలేదు. ఒకవేళ ఆయన ఈ ప్రకటన చేసి ఉంటే మీడియా సంస్థల్లో ఇందుకు సంబంధించిన కథనాలు వచ్చి ఉండేవి.
టాటా గ్రూప్ మాత్రం భారత ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. కోవిద్-19 రిలీఫ్ ఫండ్ కోసం 1500 కోట్ల రూపాయలను ప్రకటించింది. ఆక్సిజన్ కొరతతో బాధపడుతున్న భారతదేశానికి తన సహాయాన్ని కూడా అందిస్తోంది. టాటా ట్రస్ట్ ద్వారా చేతనైనంత సహాయం చేస్తూ ఉంది. ఆక్సిజన్ లోటును తీర్చడానికి కూడా టాటా సంస్థ ముందుకు వచ్చింది.
టాటా స్టీల్ సంస్థ కోవిడ్‌తో చనిపోయిన తమ సంస్థ ఉద్యోగ కుటుంబీకులకు.. సదరు ఉద్యోగి రిటైర్మెంట్ వయసు వచ్చే వరకు ఆ ఉద్యోగి నెల జీతాన్ని కుటుంబసభ్యులకు ఇవ్వనున్నది. ఉద్యోగి 60 ఏళ్ల వయసు వరకు ఆ ఉద్యోగి కుటుంబసభ్యులకు నెల జీతం ఇవ్వనున్నారు. ఆ ఉద్యోగి చివరి సారి ఎంత జీతం తీసుకున్నాడో.. ఆ జీతాన్ని ప్రతి నెల వారి కుటుంబసభ్యులకు ఇవ్వనున్నట్లు టాటా స్టీల్ చెప్పింది. టాటా కంపెనీలో పనిచేస్తున్న ఫ్రంట్‌లైన్ వర్కర్‌కు కోవిడ్ సంక్రమించి, ఆ వ్యక్తి ఒకవేళ మరణిస్తే.. ఆ ఉద్యోగి పిల్లల చదువులను మొత్తం కంపెనీ భరించనున్నది. చనిపోయిన వ్యక్తి నెల జీతం కూడా ఇస్తూ ఉంటారు. పిల్లలు భారతదేశంలో గ్రాడ్యుయేషన్ పూర్తి అయ్యేంత వరకు ఆ మొత్తం ఖర్చును టాటా స్టీల్ కంపెనీ పెట్టుకోనుంది.
అంతేకానీ.. రతన్ టాటా తన పూర్తీ ఆస్థిని భారతదేశం కరోనా రిలీఫ్ కోసం చేస్తున్న పోరాటానికి ఇస్తున్నట్లుగా ఎప్పుడూ చెప్పలేదు. ఇలాంటి ప్రకటన అసలు చేయలేదు. కాబట్టి వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.