ఖలిస్తానీ నాయకుడు అమృత్ పాల్ సింగ్ గత కొద్దిరోజులుగా పోలీసులకు దొరక్కుండా తప్పించుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. పరారీలో ఉన్న అతడు పోలీసుల నుండి తప్పించుకోవడానికి తన గెటప్ లను మార్చుకుంటూ ఉన్నాడు. అమృత్ పాల్ సింగ్‌ను గుర్తించడంలో సహాయపడతారనే ఆశతో పోలీసులు అతడికి సంబంధించి ఏడు వేర్వేరు చిత్రాలను విడుదల చేశారు. అమృత్ పాల్ సింగ్ వివిధ వేషధారణలతో ఉన్న అనేక చిత్రాలను విడుదల చేశామని, అతన్ని అరెస్టు చేయడానికి ప్రజలు తమకు సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నామని పంజాబ్ ఐజిపి సుఖ్‌చైన్ సింగ్ గిల్ అన్నారు.
పొడవాటి జుట్టుతో మహిళగా వేషధారణలో ఉన్న అమృత్ పాల్ సింగ్ ఫోటోను కూడా సోషల్ మీడియా వినియోగదారులు షేర్ చేస్తున్నారు. పోలీసులు విడుదల చేసిన ఫొటోల్లో ఇదొకటి అంటూ ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.
నిజ నిర్ధారణ :
అమృతపాల్ సింగ్ పొడవాటి జుట్టుతో ఉన్న ఫోటోను పంజాబ్ పోలీసులు విడుదల చేయలేదని NewsMeter కనుగొంది. వైరల్ అయిన ఫోటో మార్ఫింగ్ చేశారని గుర్తించాం.
మేము కీవర్డ్ సెర్చ్ ను నిర్వహించాము. వార్తా సంస్థ ANI ద్వారా ట్వీట్ చేసిన అమృతపాల్ సింగ్ ఏడు ఫోటోలను కనుగొన్నాము. పంజాబ్ ఐజిపి సుఖ్‌చైన్ సింగ్ గిల్‌ను ఉటంకిస్తూ సింగ్‌ను అరెస్టు చేసే ప్రయత్నంలో ప్రజల సహాయం కోరేందుకు పంజాబ్ పోలీసులు ఫోటోలను విడుదల చేశారని వార్తా సంస్థ తెలిపింది.
మేము ANI ట్వీట్ చేసిన ఏడు ఫోటోల సెట్‌లో రెండు మిర్రర్ సెల్ఫీలు కనుగొన్నాం.
పొడవాటి జుట్టుతో ఉన్న అమృతపాల్ సింగ్ వైరల్ ఫోటో FaceApp లోగోను కలిగి ఉందని మేము గమనించాము. మేము FaceApp కోసం శోధించాము. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి మనుషుల ముఖాలను మార్చే యాప్. పంజాబ్ పోలీసులు విడుదల చేసిన సింగ్ ఫోటోలలో ఒకదాన్ని ఉపయోగించి పొడవాటి జుట్టుతో వైరల్ ఫోటోను ఫేస్‌యాప్‌తో రూపొందించినట్లు న్యూస్ మీటర్ బృందం ధృవీకరించింది.
FaceApp ద్వారా రూపొందించిన వైరల్ ఫోటో, అసలు ఫోటోకు సంబంధించిన పోలిక ఇక్కడ గమనించవచ్చు.
వైరల్ ఫోటోను ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారని మేము ధృవీకరించాం.
Credits : Md Mahfooz Alam