పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను భారతీయ జనతా పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి అసలు పడడం లేదు. మరో వైపు మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని ఎలాగైనా కూల్చివేయాలంటూ ప్రణాళికలను రచిస్తూ ఉంది. ఇప్పటికే పలువురు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకులను బీజేపీ తమ వైపు తిప్పుకుంటూ ఉంది. ఇక ఎంఐఎం పార్టీ కూడా అక్కడ ఈసారి సత్తా చాటాలని అనుకుంటూ ఉంది. అసదుద్దీన్ ఒవైసీ ఇప్పటికే చర్చలు జరుపుతూ ఉన్నారు.
ఇలాంటి సమయంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీని హోంమంత్రి అమిత్ షా నమస్కరిస్తున్న ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి.
అమిత్ షా అసదుద్దీన్ ను అడుగుతూ ఉన్నట్లుగా 'బీహార్ ను మాకు ఇచ్చినట్లుగా బెంగాల్ ను కూడా ఇవ్వండి. అందుకు మీకు ఏమి కావాలో కోరుకోండి.. అది ధన రూపంలో అయినా కూడా ఇచ్చుకోగలం' అంటూ బెంగాలీలో ఉంది.
వైరల్ అవుతున్న ఫోటోను ఇక్కడ చూడొచ్చు.
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు. ఈ ఫోటోను మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేశారు.
ఈ ఫోటోను గూగుల్ లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. ఒరిజినల్ ఫోటో 2014 సంవత్సరానికి సంబంధించినది. భారతప్రధాని నరేంద్ర మోదీని అమిత్ షా సత్కరిస్తున్న సమయంలో తీసిన ఫోటో. "Prime Minister Narendra Modi is felicitated by BJP president Amit Shah in New Delhi." అంటూ Daily Mail లో ఈ ఫోటోను పోస్టు చేశారు.
2017లోనే వైరల్ అవుతున్న ఫోటో మార్ఫింగ్ చేశారని హిందీ న్యూస్ ఛానల్ ఏబీపీ న్యూస్ తెలిపింది. అందుకు సంబంధించిన వీడియోను కూడా పోస్టు చేశారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ పార్టీ ఆఫీసులోకి విచ్చేయడం.. అమిత్ షా ఆయన్ను ఆహ్వానించడం వీడియోలో చూడొచ్చు.
వైరల్ అవుతున్న ఫోటో పూర్తిగా ఫేక్. అమిత్ షా, నరేంద్ర మోదీ ఉన్న ఫోటోను మార్ఫింగ్ చేసి అసదుద్దీన్ ఒవైసీ తలను ఉంచారు. వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.