నిజమెంత: గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గర భారీ వరదకు సంబంధించిన విజువల్స్ ఇటీవలివా?
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 26 July 2024 6:00 AM GMTనిజమెంత: గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గర భారీ వరదకు సంబంధించిన విజువల్స్ ఇటీవలివా?
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే రోజుల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. మహారాష్ట్రలోని ముంబై, పుణెలు నీటి మునిగాయి. దాంతో.. ప్రజలకు అధికారులు పలు సూచనలు చేస్తున్నారు. శుక్రవారం కూడా భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే ముంబై, పుణెలో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు అధికారులు. ఇళ్ల నుంచి బయటకు ఎవరూ రావొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
భారీ వర్షాల కారణంగా ముంబైకు పలు విమాన సర్వీసులు రద్దు అయినట్టు తెలుస్తోంది. మహారాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది.దాంతో.. ఆయా ప్రాంతాలకు ఆరెంజ్, రెడ్ అలర్ట్ ప్రకటించారు. ముంబైలో శాంటాక్రూజ్ ప్రాంతంలో జూలైలోనే అత్యధికంగా 150 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నగర చరిత్రలో జూలైలో రెండో అత్యంత భారీ వర్షపాతం ఇదే.
ఇలాంటి పరిస్థితుల్లో సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతూ ఉంది. గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గర భారీ వరద వచ్చినట్లుగా ఆ విజువల్స్ చూపిస్తూ ఉన్నాయి.
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదోవ పట్టించేదిగా ఉందని న్యూస్‌మీటర్ కనుగొంది. వైరల్ వీడియో 2021 నాటిది.
రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా “Gateway of India Thrashed by Waves amid Cyclone Tauktae in Viral Video Leave Netizens Stunned” అనే టైటిల్ తో న్యూస్ 18 వెబ్ సైట్ లో మే 18, 2021న కథనాన్ని ప్రచురించడం గమనించాం. తుఫాను కారణంగా గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గర ఇలాంటి పరిస్థితి ఎదురైందని అందులో నివేదించారు.
టౌక్టే తుఫాను సమయంలో అరేబియా సముద్రం నుండి వచ్చిన బలమైన అలల వల్ల గేట్‌వే ఆఫ్ ఇండియా దగ్గర వరదలు వచ్చాయని.. దీని వల్ల భారీ నష్టం వాటిల్లిందని, ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని నివేదికలో ఉంది.
నివేదికలోని విజువల్స్ వైరల్ వీడియోతో సరిపోలుతున్నాయి.
కీవర్డ్ సెర్చ్ చేయగా “Maharashtra: Water Flooding Around Gateway Of India & Hotel Taj As Cyclone Tauktae Wrecks Havoc.” అనే టైటిల్ తో CNN-News18 తన యూట్యూబ్ ఛానల్ లో వీడియోను అప్లోడ్ చేసింది.
గంటకు 185 కిమీ వేగంతో గాలులు వీస్తున్న తుఫాను వల్ల ఈ వరదలు సంభవించాయని ఈ వీడియో ద్వారా తెలుస్తోంది.
ముంబై వరదలకు సంబంధించిన పాత వీడియోలను ఇటీవలి వర్షాల ఫుటేజ్‌గా షేర్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి తప్పుదారి పట్టించే వాదనలను న్యూస్‌మీటర్ గతంలో కూడా నిజ నిర్ధారణ చేసింది.
కాబట్టి, ఇటీవల ముంబైలో భారీ వర్షం కురుస్తున్న వీడియో అంటూ వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది. ఈ వీడియో 2021 నాటిది. టౌక్టే తుఫాను కారణంగా జరిగిన విధ్వంసం ఇది.