నిజమెంత: జైలు నుండి విడుదలయ్యాక ఆప్ నేత సంజయ్ సింగ్ పోలీసులతో గొడవ పెట్టుకున్నారా?ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నాయకుడు సంజయ్ సింగ్ ఏప్రిల్ 2న తీహార్ జైలు నుండి బెయిల్‌పై విడుదలయ్యారు. ఢిల్లీ మద్యం పాలసీ స్కామ్ కి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో దాదాపు ఆరు నెలల పాటు జైలులో ఉన్నారు.
ఈ నేపథ్యంలో.. ఒక వ్యక్తితో దురుసుగా ప్రవర్తించినందుకు సంజయ్ సింగ్ పోలీసులతో వాగ్వాదానికి దిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. వీడియోను షేర్ చేస్తున్న వారు జైలు నుంచి విడుదలైన తర్వాత సంజయ్ సింగ్ ఇలాంటి పనులు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. (Archive)
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న వాదన 2021 నాటిదని మేము గుర్తించాం. కాబట్టి వైరల్ పోస్టులు ప్రజలను తప్పుదారి పట్టించేలా ఉన్నాయని NewsMeter కనుగొంది.
వీడియో కీఫ్రేమ్స్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో.. మేము ఈ వీడియోను Xలో కనుగొన్నాము. అక్టోబర్ 21, 2021న AAP ఉత్తరప్రదేశ్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో వీడియోను పోస్టు చేశారని గుర్తించాం. క్యాప్షన్ ప్రకారం.. తిరంగ యాత్రలో భాగంగా వెళుతున్నప్పుడు సంజయ్ సింగ్‌ని అడ్డుకోవడం వీడియోలో చూడొచ్చు. (Archive)
నవభారత్ టైమ్స్ అక్టోబర్ 21, 2021న “Sanjay Singh Detained In Varanasi” అనే టైటిల్ తో ప్రచురించిన వీడియోను కూడా మేము కనుగొన్నాము.
ఆ వీడియో కింద వివరణ ప్రకారం, ఆమ్ ఆద్మీ పార్టీ తిరంగ యాత్రలో భాగమవ్వడానికి.. వారణాసి నగరంలోకి ప్రవేశిస్తున్న సమయంలో సింగ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో సంజయ్ సింగ్, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
అక్టోబరు 22, 2021న టైమ్స్ ఆఫ్ ఇండియా (Archive) ప్రచురించిన నివేదికలో.. అధికారుల అనుమతి లేకుండా తిరంగా యాత్రను చేపట్టాలని ప్రయత్నించారు. వారణాసిలోకి ప్రవేశించనివ్వకుండా సంజయ్ సింగ్‌ను పోలీసులు ఆపివేసినట్లు కూడా టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది.
పోలీసులతో సంజయ్ సింగ్ వాగ్వాదానికి దిగిన వైరల్ వీడియో పాతదేనని మేము నిర్ధారించాము. వైరల్ పోస్టుల్లో ఎలాంటి నిజం లేదు.