నిజమెంత: బుద్ధుడి విగ్రహాలను ధ్వంసం చేసిన వీడియోలు, ఫోటోలు.. ఇటీవల బంగ్లాదేశ్ లో చోటు చేసుకున్న విధ్వంసానికి సాక్ష్యాలా?
బంగ్లాదేశ్‌లో మైనారిటీ కమ్యూనిటీపై అనేక దారుణాలు చోటు చేసుకుంటున్నాయని పోస్టులను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 11 Aug 2024 2:00 PM ISTనిజమెంత: బుద్ధుడి విగ్రహాలను ధ్వంసం చేసిన వీడియోలు, ఫోటోలు.. ఇటీవల బంగ్లాదేశ్ లో చోటు చేసుకున్న విధ్వంసానికి సాక్ష్యాలా?
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి పారిపోయిన తర్వాత, బంగ్లాదేశ్‌లో మైనారిటీ కమ్యూనిటీ అయిన హిందువులపై అనేక దారుణాలు చోటు చేసుకుంటున్నాయని కొందరు పలు పోస్టులను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
దేశంలో కొనసాగుతున్న అల్లకల్లోలాల మధ్య బౌద్ధ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారనే వాదనతో మూడు చిత్రాలు వైరల్ అవుతూ ఉన్నాయి.
మొదటి చిత్రం బుద్ధుని విగ్రహంపై దాడి చేస్తున్న వ్యక్తిని చూపిస్తుంది, రెండవది బౌద్ధ సన్యాసుల వలె దుస్తులు ధరించిన పిల్లలు విధ్వంసాన్ని చూస్తున్నట్లు, మూడవది శిరచ్ఛేదం చేసిన బౌద్ధ విగ్రహాలను చూపుతుంది.
బంగ్లాదేశ్ హిందువుల విషయంలో జరిగిన దారుణాలు ఇవని.. వైరల్ చిత్రాలను పలువురు పంచుకున్నారు. బంగ్లాదేశ్ లో మైనారిటీలపై చోటు చేసుకున్న దారుణాలకు ఇవి సాక్ష్యాలు అని చెబుతున్నారు.
నిజ నిర్ధారణ:
ఈ చిత్రాలు ఇటీవలివి కావని న్యూస్ మీటర్ గుర్తించింది. ఈ చిత్రాలు 2012 నాటివి.
కాబట్టి వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నట్లు న్యూస్‌మీటర్ కనుగొంది.
మొదటి ఫోటో:
రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ను నిర్వహించగా.. అక్టోబర్ 2023లో Facebook ఖాతా 'బుద్ధిజం' లో పోస్ట్ చేసిన మొదటి చిత్రంతో సహా అనేక చిత్రాలను మేము కనుగొన్నాము. పోస్ట్ ప్రకారం.. చిత్రాలు 2012 సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌లోని బౌద్ధుల ఇళ్లు, మఠాలపై దాడిని చూపుతున్నాయి. (ఆర్కైవ్)
అక్టోబర్ 2019లో Facebook ఖాతా ద్వారా పోస్ట్ చేసిన మొదటి చిత్రాన్ని కూడా మేము కనుగొన్నాము. (ఆర్కైవ్)
బంగ్లాదేశ్‌లో బౌద్ధమతం పరిస్థితిని చూపుతుందని పేర్కొంటూ, ఒక X ఖాతా జూలై 2020లో మూడు చిత్రాలను పోస్ట్ చేసింది. (ఆర్కైవ్)
రెండవ ఫోటో:
రెండవ చిత్రం రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. నవంబర్ 5, 2012న ప్రచురించిన బ్లాగ్ పోస్ట్‌కు దారితీసింది. బ్లాగ్ ప్రకారం.. చిత్రం బంగ్లాదేశ్‌లోని కాక్స్ బజార్ జిల్లాలో కాల్చేసిన దేవాలయాన్ని చూపుతుంది. (ఆర్కైవ్)
11 సంవత్సరాల క్రితం ధర్మ బౌద్ధ సంఘం వెబ్‌సైట్‌లో ప్రచురించిన రెండవ చిత్రాన్ని కూడా మేము కనుగొన్నాము. ఈ వెబ్‌సైట్ బంగ్లాదేశ్‌లోని కాక్స్ బజార్ జిల్లాలో అగ్నికి ఆహుతైన ఆలయాన్ని చూపుతుందని కూడా ఈ వెబ్‌సైట్ పేర్కొంది.
మూడో ఫోటో:
రివర్స్ ఇమేజ్ చేయగా.. మే 2013లో బంగ్లాదేశ్‌లోని బౌద్ధ దేవాలయాలను ముస్లింలు తగలబెట్టారని పేర్కొంటూ ఫేస్‌బుక్ ఖాతా ద్వారా పోస్ట్ చేసిన మూడవ చిత్రాన్ని మేము చూశాం.
శ్రీలంక న్యూస్ వెబ్ పోర్టల్ అయిన Onlanka అనే వెబ్‌సైట్‌లో అక్టోబర్ 13, 2012న ప్రచురించిన నివేదికలో మేము మూడవ చిత్రాన్ని కూడా కనుగొన్నాము. బంగ్లాదేశ్‌తో సహా వివిధ ప్రాంతాలలో బౌద్ధులు ఎదుర్కొంటున్న సవాళ్లను నివేదికలో చర్చించారు.
మేము 2013, 2014లో గెట్టి ఇమేజెస్, ఐస్టాక్.. శిరచ్ఛేదం చేసిన బుద్ధ విగ్రహాలకు సంబంధించిన ఇలాంటి చిత్రాలను అప్లోడ్ చేసినట్లు కూడా మేము కనుగొన్నాము. 2012లో బంగ్లాదేశ్‌లోని రామూలోని బౌద్ధుల ఇళ్లు, దేవాలయాలపై ముస్లిం గుంపులు దాడి చేయడంతో విగ్రహాలు దెబ్బతిన్నాయని జెట్టి ఇమేజెస్ పేర్కొంది. బంగ్లాదేశ్‌లోని కాక్స్ బజార్‌కు దగ్గరగా ఉన్న ఒక చిన్న గ్రామంలో అతివాద ముస్లింలు దేవాలయాలపై దాడి చేశారు, బుద్ధుని విగ్రహాలను ధ్వంసం చేశారన్నారు.
సెప్టెంబరు 30, 2012 నుండి వచ్చిన CNN నివేదిక ప్రకారం.. బంగ్లాదేశ్‌లోని ముస్లిం నిరసనకారులు బౌద్ధ పుణ్యక్షేత్రాలు, గృహాలపై దాడి చేశారు. వాటిలో కొన్నింటికి నిప్పంటించారు.
బౌద్ధ బాలుడు ఖురాన్‌ను తగులబెట్టాడంటూ నిరసనకారులు బౌద్ధ వ్యతిరేక నినాదాలు చేశారు. ఢాకాకు దక్షిణంగా ఉన్న కాక్స్ బజార్‌లోని రామూ అనే పట్టణంలో హింస ప్రారంభమైంది, త్వరగా సమీప ప్రాంతాలకు కూడా వ్యాపించింది.
NewsMeter మొదటి చిత్రం ఖచ్చితమైన సంవత్సరాన్ని ధృవీకరించలేకపోయింది. అయినప్పటికీ, మూడు చిత్రాలు పాతవి.. రెండు, మూడో చిత్రాలు 2012 నుండి ఇంటర్నెట్‌లో ఉన్నాయని మేము ధృవీకరిస్తున్నాము.
ఈ చిత్రాలు బంగ్లాదేశ్‌కు చెందినవి కావొచ్చు.. కానీ బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న విధ్వంసానికి సంబంధించినవి కావని మేము నిర్ధారించాము.
అందువల్ల, వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేవని ధృవీకరించాం.