తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ ను అమలు చేయబోతున్నారంటూ ఓ లెటర్ వైరల్ అవుతూ ఉంది. జెనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ నుండి ఈ లెటర్ వచ్చిందని చెబుతూ ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని షాపులను సాయంత్రం 6 గంటల నుండి ఉదయం 8 గంటల వరకూ మూసి ఉంచాలని.. ఏప్రిల్ 30 వరకూ ఈ నిబంధనలు అమలులో ఉంటాయని తెలుపుతూ ఆ లెటర్ లో ఉంది.
తెలంగాణ రాష్ట్రంలో పెరిగిపోతున్న కరోనా కేసులను కట్టడి చేయాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని సామాజిక మాధ్యమాల్లో చెబుతూ ఉన్నారు. ఈ లెటర్ ను షేర్ చేస్తూ వచ్చారు.
పలువురు సామాజిక మాధ్యమాల్లో ఈ లెటర్ ను షేర్ చేస్తూ ఉన్నారు. తెలంగాణలో పాక్షిక లాక్ డౌన్ ను అమలు చేయబోతున్నారని తెలిపారు.
నిజ నిర్ధారణ:
ఈ లెటర్ లో చీఫ్ సెక్రెటరీ సోమేశ్ కుమార్ పేరు ఉంది.. కానీ అందులో ఎటువంటి సంతకం కూడా లేదు. న్యూస్ మీటర్ సోమేశ్ కుమార్ తో మాట్లాడగా.. ఈ లెటర్ లో ఎటువంటి నిజం లేదని.. మొత్తం ఫేక్ అని తేల్చేశారు.
ఎటువంటి సంతకం లేకుండా ఓ లెటర్ వైరల్ అవుతోందని.. ప్రభుత్వ జీవో గా చెప్పబడుతున్న ఓ లెటర్ ఏప్రిల్1, 2021 నుండి వైరల్ అవుతోందని అందులో ఎటువంటి నిజం లేదని సోమేశ్ కుమార్ తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో షాపులు మూసి వేయాలంటూ వైరల్ అవుతున్న సదరు లెటర్ ఫేక్ అని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం నుండి ఇలాంటి ఆర్డర్ బయటకు రాలేదని తేల్చి చెప్పారు. ఇంకా ప్రభుత్వం లాక్ డౌన్ నిర్వహించాలని అనుకోవడం లేదని చెప్పుకొచ్చారు.
తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ ఇప్పట్లో ఉండదని కేసీఆర్ అసెంబ్లీలోని తేల్చి చెప్పారు. లాక్ డౌన్లు ఉండవని, ఇండస్ట్రీలు మూసి వేయరని కేసీఆర్ చెప్పారు. కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటూ ఉన్నామని.. ప్రస్తుతానికైతే రాష్ట్రంలో లాక్ డౌన్ విధించే ఆలోచన లేదని అన్నారు. అందుకు సంబంధించిన వీడియోలను కూడా చూడొచ్చు.
కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ ను అమలు చేయబోతున్నారంటూ వైరల్ అవుతున్న లెటర్ లో ఎటువంటి నిజం లేదు.