సుప్రీంకోర్టు విచారణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదనను వినిపిస్తుండగా, భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డివై చంద్రచూడ్ విచారణను మధ్యలోనే వదిలేశారనే వాదనతో వీడియో షేర్ చేస్తున్నారు. న్యాయమూర్తుల తీరును తప్పుబడుతూ వీడియోను షేర్ చేస్తున్న వ్యక్తులు ఆరోపిస్తున్నారు.
“వావ్! న్యాయవాది మాట్లాడుతూ ఉంటే జస్టిస్ చంద్రచూడ్ ఏమీ పట్టించుకోకుండా లేచి వెళ్ళిపోయారు. న్యాయమూర్తుల అహంకారం ఈ వీడియో చూపిస్తుంది. ఇది సుప్రీంకోర్టు.. అత్యున్నత న్యాయస్థానం!" అంటూ వీడియోను షేర్ చేసిన వినియోగదారులు తెలిపారు.
చాలా మంది ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులు అదే వాదనతో పోస్ట్‌ను షేర్ చేశారు.
నిజ నిర్ధారణ :
వీడియో క్లిప్ ఎడిట్ చేశారని.. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని NewsMeter కనుగొంది.
వైరల్ వీడియోలో లా టుడే లోగోను మేము గమనించాము. దాన్ని క్యూగా తీసుకొని, మేము నిడివి ఎక్కువ ఉన్న వీడియో కోసం వెతికాము. లా టుడే YouTube ఛానెల్‌లో ‘Supreme Court Hearing on Electoral Bonds | CJI Chandrachud Led Bench.’ అనే టైటిల్ తో లైవ్ స్ట్రీమ్ అయిందని గుర్తించాం.
న్యాయవాది హరీష్ సాల్వే తన వాదనను ముగించిన తర్వాత, తుషార్ మెహతా వాదనలు వైరల్ క్లిప్ 21:50 నిమిషాల టైమ్‌స్టాంప్‌లో కనిపిస్తాయి.
సీజేఐ విచారణను మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయినట్లుగా మాకు కనిపించలేదు. 25:53 నిమిషాల టైమ్‌స్టాంప్ వద్ద, ఆయన తన ఎడమ, కుడి వైపున కూర్చున్న న్యాయనిర్ణేతలను పరిశీలించారు. కుర్చీని సర్దుబాటుకుని కనిపించారు. దాదాపు 26:09 నిమిషాల టైమ్‌స్టాంప్ వద్ద, తుషార్ మెహతా కూర్చుని, న్యాయవాది ముకుల్ రోహ్తగి మాట్లాడటం ప్రారంభించారు. విచారణ కొనసాగింది. 46:00 నిమిషాల టైమ్‌స్టాంప్‌లో విచారణ పూర్తయిన తర్వాత CJI మరియు ఇతర న్యాయమూర్తులు వెళ్లిపోతారు.
లైవ్ లా ధృవీకరించబడిన YouTube ఛానెల్‌లో హియరింగ్ ను ప్రత్యక్ష ప్రసారం చేసినట్లు కూడా మేము కనుగొన్నాము. CJI తన ఎడమ, కుడి వైపున ఉన్న న్యాయమూర్తులను పరిశీలించడం.. 33:48 నిమిషాల టైమ్‌స్టాంప్ వద్ద తనకు తాను సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోవడం లాంటివి మేము చూశాం. అంతేకానీ ఎక్కడా ఆయన విచారణను మధ్యలోనే వదిలేసి వెళ్లిపోలేదు.
అందువల్ల, వైరల్ క్లిప్ ఎడిట్ చేశారని.. CJI విచారణను మధ్యలోనే వదిలివేయలేదని మేము నిర్ధారించాము.
Credits : Md Mahfooz Alam