ఎలాన్ మస్క్.. టెస్లా కంపెనీ అధినేత. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఈయన కూడా ఒకరు. టెస్లా మోటార్స్ సిఈఓగా ఆయన ప్రపంచానికి తెలుసు.. అంతేకాకుండా ఎన్నో విప్లవాత్మకమైన ఆవిష్కరణలకు తన వంతు సహకారం అందిస్తూ వస్తున్నాడు.
ఇక ఇటీవల #RIPELON అంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు ట్రెండ్ అయ్యాయి. టెస్లా మోటార్స్ కంపెనీలో చోటు చేసుకున్న అగ్నిప్రమాదంలో ఎలాన్ మస్క్ చనిపోయాడంటూ పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు. అందుకు సంబంధించిన కొన్ని వార్తా పత్రికల స్క్రీన్ షాట్స్ కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఎలాన్ మస్క్ చనిపోయాడు. అతడి ఆత్మకు శాంతి చేకూరాలంటూ పలువురు పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు.
నిజ నిర్ధారణ:
ఎలాన్ మస్క్ చనిపోయాడంటూ వైరల్ అవుతున్న పోస్టులు 'పచ్చి అబద్ధం'.
సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఫొటోల్లో ఉన్నది నిజమైన వార్తా సంస్థలకు సంబంధించిన ఆర్టికల్స్ కానే కాదు. ఎటువంటి ప్రముఖ మీడియా సంస్థ కూడా ఇందుకు సంబంధించిన ఆర్టికల్ ను.. ఎలాన్ మస్క్ చనిపోయాడన్న వార్తను ప్రసారం చేయలేదు. కొందరు కావాలనే ప్రజలను తప్పుద్రోవ పట్టించడానికి ఈ పోస్టులను షేర్ చేశారు.
Teslarati.com సమాచారం ప్రకారం కొందరు కావాలనే ఎలాన్ మస్క్ చనిపోయాడంటూ వార్తలను పోస్టు చేశారని.. ఇలా ఎందుకు ప్రచారం చేస్తున్నారో తెలియడం లేదని అన్నారు. ఇలా చేయడం వలన టెస్లా షేర్ల ధరలు తగ్గుతాయని కొందరు భావిస్తున్నారని సంస్థ వివరణ ఇచ్చింది. ఎలాన్ మస్క్ చనిపోయాడంటూ సోషల్ మీడియాలో తప్పుడు వార్త ట్రెండ్ అయిన గంటలో దాదాపు 6 శాతం వరకూ షేర్ల ధరలు తగ్గిపోయాయి.
పలు మీడియా సంస్థలు కూడా ఈ వైరల్ పోస్టుల్లో ఎటువంటి నిజం లేదని తేల్చాయి. ఎలాన్ మస్క్ చనిపోయారంటూ ఎవరు కూడా అధికారిక ప్రకటన చేయలేదు. Tesla, SpaceX, Musk సోషల్ మీడియా అకౌంట్లలో కూడా ఎటువంటి ప్రకటన కూడా రాలేదు.
ఇక టెస్లా కంపెనీలో పేలుడు, అగ్ని ప్రమాదం లాంటి కథనాలు కూడా రాలేదు. ఇక సామజిక మాధ్యమాల్లో ఎలాన్ చనిపోయాడంటూ హ్యాష్ ట్యాగ్ వైరల్ అవుతున్నప్పుడు ఎలాన్ మస్క్ కూడా ఏంటిది అన్నట్లుగా ఓ ఈమోజీని ట్వీట్ గా వేశారు.
కాబట్టి ఎలాన్ మస్క్ చనిపోయాడంటూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'. ఇదొక తప్పుడు ప్రచారం.