రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ చాలా రోజులుగా రెజ్లర్లు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. రెండు రోజుల కిందట పార్లమెంటుకు ర్యాలీ తీసేందుకు ప్రయత్నించడం, పోలీసులు అడ్డుకుని అరెస్టు చేయడం, కేసులు పెట్టడం తెలిసిందే.
ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత రెజ్లర్లు వినేష్ ఫోగట్, సంగీతా ఫోగట్ నవ్వుతున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫోటోను షేర్ చేస్తున్న వారు రెజ్లర్లు తమ నిరసనపై సీరియస్‌గా లేరని ప్రచారం చేస్తున్నారు.
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్ ఫెడరేషన్ (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా భారత అగ్రశ్రేణి రెజ్లర్లు వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్, బజరంగ్ పునియా దాదాపు 35 రోజులుగా న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నారు. మే 28న, కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా అక్కడకు వెళ్లేందుకు ప్రయత్నించగా భద్రతా సిబ్బంది వారిని అదుపులోకి తీసుకున్నారు.
నిజ నిర్ధారణ :
వైరల్ అవుతున్న ఫోటోను మార్ఫింగ్ చేశారని న్యూస్ మీటర్ గుర్తించింది.
రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో, జర్నలిస్ట్ మన్‌దీప్ పునియా ట్వీట్ ను కూడా మేము గుర్తించాం. రెజ్లర్లను నిర్బంధించిన ఫోటోను కూడా మేము కనుగొన్నాము. ఈ ఫోటోలో వాళ్ళెవరూ నవ్వుతున్నట్లు కనిపించదు.
రెజ్లర్ బజరంగ్ పునియా మార్ఫింగ్ చేసిన, ఒరిజినల్ ఫోటోలను కూడా ట్వీట్ చేశాడు. నకిలీ చిత్రాన్ని పోస్ట్ చేసిన వారిపై ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.
మేము వినేష్ ఫోగట్, సంగీతా ఫోగట్ లకు సంబంధించిన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో వారు నవ్వుతున్న చిత్రాల కోసం వెతికాము. వైరల్ ఫోటోలో చూసినట్లుగా ఇద్దరి ముఖాల్లో సొట్ట బుగ్గలు లేవని మేము కనుగొన్నాము.
FaceApp అనే AI అప్లికేషన్‌ని ఉపయోగించి వైరల్ ఫోటో మార్ఫింగ్ చేశారని పలువురు ట్విట్టర్ వినియోగదారులు చూపించారు. మేము స్మైల్ ఫిల్టర్‌ని ఉపయోగించి కూడా ప్రయత్నించాము.. వైరల్ చిత్రంలో చూసిన అదే ఇమేజ్ ను పొందగలిగాం.
కాబట్టి, రెజ్లర్లు నవ్వుతున్నట్లుగా ఫోటో మార్ఫింగ్ చేశారని మేము నిర్ధారించాము.
Credits : Md Mahfooz Alam