నిజమెంత: పాలస్తీనాను బ్రిక్స్‌లో చేర్చడాన్ని భారత్ వ్యతిరేకించలేదు
రష్యాలో జరగనున్న శిఖరాగ్ర సమావేశం తర్వాత బ్రిక్స్ సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకోవాలని పాలస్తీనా యోచిస్తోంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 29 Aug 2024 11:00 AM ISTనిజమెంత: పాలస్తీనాను బ్రిక్స్‌లో చేర్చడాన్ని భారత్ వ్యతిరేకించలేదు
ఆగస్టు 26న మాస్కోలో జరిగిన ఓ సమావేశంలో రష్యాలోని పాలస్తీనా రాయబారి అబ్దెల్ హఫీజ్ నోఫాల్.. ఈ అక్టోబర్‌లో రష్యాలో జరగనున్న శిఖరాగ్ర సమావేశం తర్వాత బ్రిక్స్ సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకోవాలని పాలస్తీనా యోచిస్తోందని ప్రకటించారు.
ఈ నేపథ్యంలో బ్రిక్స్‌లో చేరేందుకు పాలస్తీనా చేస్తున్న ప్రయత్నానికి చైనా, రష్యాలు మద్దతు ఇస్తుండగా, వ్యవస్థాపక సభ్యదేశాల్లో భాగమైన భారత్ మాత్రం వ్యతిరేకిస్తోందని పలువురు సోషల్ మీడియా వినియోగదారులు పేర్కొన్నారు.
ఒక X వినియోగదారు క్లెయిమ్ చేస్తూ.. "పాలస్తీనాను బ్రిక్స్‌లో చేర్చవద్దని భారతదేశం బ్రిక్స్‌ను కోరింది, అయితే రష్యా, చైనా భారతదేశ వైఖరిని తిరస్కరించాయి." (ఆర్కైవ్) అంటూ పోస్టులు పెట్టారు.
నిజ నిర్ధారణ:
బ్రిక్స్‌లో పాలస్తీనాను చేరనివ్వకుండా భారత ప్రభుత్వం అడ్డుకుందనే వాదన తప్పు అని NewsMeter కనుగొంది.
మేము సంబంధిత కీవర్డ్ సెర్చ్ ను అమలు చేసాము. కానీ బ్రిక్స్‌లో చేరడానికి పాలస్తీనా బిడ్‌ను వ్యతిరేకిస్తూ భారత ప్రభుత్వం చేసిన మీడియా నివేదిక, ప్రకటన ఏదీ కనుగొనలేకపోయాం.
ఏది ఏమైనప్పటికీ, జూన్ 12, 2024న ప్రచురించిన ది ఎకనామిక్స్ టైమ్స్ నివేదిక ప్రకారం ఇతర బ్రిక్స్ సభ్య దేశాలతో పాటు భారతదేశం, గాజాలో ఇజ్రాయెల్ సైనిక చర్యలను ఉమ్మడి ప్రకటనలో ఖండించింది.
ఈ ప్రకటన అంతర్జాతీయ మానవతా సూత్రాలకు కట్టుబడి, వివాదాన్ని పరిష్కరించడానికి ఇజ్రాయెల్-పాలస్తీనా ముందుకు రావాలని పిలుపుని ఇచ్చారు. చర్చల ద్వారా శాంతియుత పరిష్కారం వైపు మొగ్గు చూపాలని బ్రిక్స్ దేశాలు సూచించాయి.
మేము జూన్ 10, 2024న భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో ప్రచురించిన బ్రిక్స్ సంయుక్త ప్రకటనను కూడా తనిఖీ చేసాము. ఆక్రమిత పాలస్తీనా భూభాగంలో అధ్వాన్నంగా ఉన్న పరిస్థితి, ముఖ్యంగా ఇజ్రాయెల్ సైనిక కార్యకలాపాల కారణంగా గాజా స్ట్రిప్‌లో హింసాత్మక ఘటనలపై ఈ ప్రకటనలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. అదనంగా, ఐక్యరాజ్యసమితిలో పాలస్తీనా పూర్తి సభ్యత్వానికి సమూహం మద్దతును పునరుద్ఘాటించింది.
పాలస్తీనాపై భారత ప్రభుత్వ వైఖరి, ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదం గురించి మేము లోక్‌సభలో ఒక ప్రశ్నోత్తరాన్ని కూడా కనుగొన్నాము. ఇది ఫిబ్రవరి 2, 2024న విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో అప్లోడ్ చేశారు.
'ఇటీవల ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధంలో భారత్ పాలస్తీనాపై తన వైఖరిని మార్చుకుని, ఇజ్రాయెల్‌కు తన మద్దతును అందించిందా' అని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగారు.
ఈ ప్రశ్నకు సమాధానమిస్తూ, పాలస్తీనా పట్ల భారతదేశం విధానం చాలా కాలంగా, స్థిరంగా ఉందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుండి సమాధానం వచ్చింది. ‘అక్టోబర్ 7, 2023న ఇజ్రాయెల్‌పై జరిగిన ఉగ్రదాడులను, కొనసాగుతున్న ఇజ్రాయెల్-హమాస్ వివాదంలో పౌరుల ప్రాణాలు కోల్పోవడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది.. సరిహద్దులలో, ఇజ్రాయెల్‌తో శాంతియుతంగా ఉండాలని, పాలస్తీనా రాజ్య స్థాపన దిశగా ముందుకు సాగాలి. చర్చల ద్వారా రెండు-దేశాల మధ్య గొడవల పరిష్కారానికి మద్దతు ఇచ్చాము" అని కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది.
ఈ వివాదంలో భారతదేశం స్పష్టంగా ఇజ్రాయెల్ పక్షం వహించిందని లేదా పాలస్తీనాకు మద్దతును వ్యతిరేకించిందనే ప్రస్తావన లేదు.
బ్రిక్స్‌లో చేర్చడానికి పాలస్తీనా బిడ్‌కు చైనా, రష్యా మద్దతు ఇస్తుండగా, భారతదేశం పాలస్తీనాను వ్యతిరేకించిందనే ప్రకటన లేదా నివేదిక కూడా లేదు. కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు అని మేము నిర్ధారించాము.
బ్రిక్స్ అంటే ఏమిటి?
2006లో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనాలు BRIC గ్రూప్‌ను స్థాపించాయి. దక్షిణాఫ్రికా 2010లో చేరింది, దానిని బ్రిక్స్‌కు విస్తరించారు. ఉత్తర అమెరికా, పశ్చిమ ఐరోపాలోని సంపన్న దేశాల రాజకీయ, ఆర్థిక ఆధిపత్యాన్ని సవాలు చేయడానికి ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన, అభివృద్ధి చెందుతున్న దేశాలలో కొన్నింటిని ఏకం చేయడానికి ఈ సంస్థను సృష్టించారు.
BRICS వార్షిక శిఖరాగ్ర సమావేశాలను నిర్వహిస్తుంది. వాణిజ్యం, పెట్టుబడులు, రాజకీయ సమన్వయం వంటి రంగాలలో సహకారాన్ని ఈ సదస్సులో ప్రోత్సహిస్తారు. జనవరి 1, 2024న, నాలుగు కొత్త సభ్య దేశాలు-ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ బ్రిక్స్ లో భాగమయ్యాయి.