కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్రకు చెందిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాహుల్ గాంధీ ఒక అమ్మాయిని కౌగిలించుకున్న ఫోటో అది. ఆ అమ్మాయి అమూల్య లియోనా అని, భారతీయ శిక్షాస్మృతిలోని ఇతర ఆరోపణలతో పాటు దేశద్రోహ నేరం కింద కేసు నమోదు చేయబడిందనే వాదనతో షేర్ చేయబడుతోంది.
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త నిరసనలో భాగంగా జర్నలిజం విద్యార్థి అమూల్య చురుకుగా పాల్గొన్నారు. బెంగుళూరులో ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ సమక్షంలో జరిగిన ఒక కార్యక్రమంలో 'పాకిస్తాన్ జిందాబాద్' నినాదం చేసినందుకు ఆమెను అరెస్టు చేశారు. ఒవైసీ, వేదికపై ఉన్న ఇతర వ్యక్తులు ఆమె మైక్రోఫోన్‌ను లాక్కొని ఆమెను మాట్లాడకుండా ఆపడానికి ప్రయత్నించారు.
రాహుల్ గాంధీని హత్తుకున్న అమ్మాయి అమూల్య అంటూ బీజేపీ కార్యకర్త ప్రీతి గాంధీ ఫోటోలను పోస్టు చేశారు. భారత్ జోడో యాత్రపై విమర్శలు గుప్పించారు. అందుకు సంబంధించి రెండు ఫోటోలను పంచుకున్నారు-ఒకటి రాహుల్ గాంధీ యువతితో ఉండగా.. ఇంకొక్క ఫోటో అమూల్య లియోనా. ఆమె "ఇది భారత్ జోడో కాదు, ఇది భారత్ తోడో!!" అని పోస్టు పెట్టారు.
ట్విటర్ యూజర్ కూడా ఇదే వాదనను వినిపించారు.
పోస్ట్‌ను వీక్షించడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
నిజ నిర్ధారణ:
కాంగ్రెస్ సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ఛైర్‌పర్సన్ సుప్రియా శ్రీనాథ్ చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన తర్వాత ప్రీతి గాంధీ పోస్ట్‌ను తొలగించినట్లు న్యూస్‌మీటర్ కనుగొంది. రాహుల్ గాంధీతో ఉన్న ఫోటోలో ఉన్న అమ్మాయి అమూల్య లియోనా కాదని, మీవా ఆండ్రెలియో అని సుప్రియా అన్నారు.
మేము Miva Andreleo కోసం Instagramలో శోధించాము. ఆమె పోస్ట్ చేసిన భారత్ జోడో యాత్రకు సంబంధించిన చాలా ఫోటోలు, వీడియోలను కనుగొన్నాము. "హ్యాపీస్ట్ మూమెంట్" అనే క్యాప్షన్‌తో రాహుల్ గాంధీ ఆమెను కౌగిలించుకున్న వైరల్ ఫోటో కూడా మాకు కనిపించింది.
భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో కలిసి నడుస్తూ ఉన్న వీడియోను కూడా ఆమె పోస్ట్ చేసింది.
వైరల్ ఫోటోలో ఉన్న అమ్మాయి 'మివా ఆండ్రెలియో' అని అమూల్య లియోనా కాదని స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి, వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.