భారతదేశంలో ఇటీవలి కాలంలో ఇంధన ధరలు పెరిగిపోతూ ఉన్న సంగతి తెలిసిందే..! కొన్ని ప్రాంతాల్లో ఏకంగా 100 రూపాయలను తాకింది. గ్లోబల్ మార్కెట్లో చమురు ధరల పెరుగుదల కారణంగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా తొమ్మిదో రోజు కూడా పెరిగాయి. ఈ రోజు ఢిల్లీలో పెట్రోల్‌పై 25 పైసలు పెరగడంతో లీటర్ ధర రూ.89.54కు చేరింది. జిల్‌పై 25 పైసలు పెరగడంతో లీటర్ ధర రూ.79.95గా ఉంది. ముంబైలో పెట్రోల్ ధర లీటరుకు రూ.96కు చేరింది. లీటరు డీజిల్ ధర రూ.86.98 కి పెరిగింది.
హైదరాబాద్‌లోనూ పెట్రోల్ ధర లీటరు రూ.93.10కి చేరగా, డీజిల్ ధర లీటరుకు రూ.87.20కి పెరిగింది. బెంగళూరులో లీటరు పెట్రోలు ధర రూ.92.54గా ఉండగా, డీజిల్ ధర రూ.84.75గా ఉంది. దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు ప్రతి రోజు పెరిగిపోతుండడంతో వాహనదారులు, మధ్య తరగతి ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఇక వరుసగా కార్లు, వాహనాలు ఉన్న ఫోటో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతూ ఉంది. ఆ ఫోటో కింద జర్మనీలో ఇంధన ధరలు పెంచడంతో ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేయడానికి ఇలా ప్రజలు రోడ్డు మీద వారి వాహనాలను వదిలేసి వెళ్లారని చెప్పుకొంటూ వచ్చారు.
హిందీలో టెక్స్ట్ ఆ టెక్స్ట్ ఉంది. 'జర్మనీలో ప్రజలు తమ కార్లను రోడ్డు మీదనే వదిలేసి వెళ్లారు. అలా ఏకంగా 10 లక్షల కార్లను రోడ్డు మీదనే వదిలేయడంతప్ ప్రభుత్వం వెంటనే దిగి వచ్చిందని.. ప్రభుత్వం ఇంధన ధరలు తగ్గించడం జరిగిందని' సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు.
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.
న్యూస్ మీటర్ ఈ ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. ఈ ఫోటోను పలు మీడియా సంస్థలు తమ కథనాల్లో భాగంగా చూపించాయి.
ఇక ఈ ఫోటోకు జర్మనీకి ఎటువంటి సంబంధం లేదు. వైరల్ అవుతున్న ఫోటోను చైనా రాజధాని బీజింగ్ లో 2010న తీశారు. అతి పెద్ద ట్రాఫిక్ జామ్ అంటూ అప్పట్లో ప్రపంచ వ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. ఏకంగా 60 మైళ్ళ దూరం ఈ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ట్రాఫిక్ జామ్ ను క్లియర్ చేయడానికి 12 రోజుల సమయం పట్టింది.
బీజింగ్-టిబెట్ రూట్ లో ఆగష్టు 2010న ఈ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఎంతో మంది మోటారిస్టులు ఈ ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కు పోయారు. అప్పట్లో చాలా మీడియా సంస్థలు ఈ ఫోటోను ఉపయోగించాయి. ది టెలిగ్రాఫ్ పత్రిక కూడా అక్టోబర్ 1, 2012న ట్రాఫిక్ జామ్ కు సంబంధించిన ఆర్టికల్ ను ప్రచురించినప్పుడు కూడా ఈ ఫోటోను వాడారు.
అప్పట్లో చైనా ప్రభుత్వం ఫ్రీ రోడ్ ట్రావెల్ అంటూ ప్రకటించడంతో పెద్ద ఎత్తున రోడ్ల మీదకు కారులను వేసుకొని వచ్చేశారు. దీంతో ఈ రోడ్డు భారీ ట్రాఫిక్ జామ్ చోటు చేసుకుంది.
జర్మనీలో కూడా పలు మార్లు ఇంధన ధరలను పెంచడం జరిగింది. కానీ ఇలా రోడ్డు మీద కార్లను విడిచిపెట్టి వెళ్లిన ఘటనలు చోటు చేసుకోలేదు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఈ పోస్టుకు జర్మనీకి ఎటువంటి సంబంధం లేదు. చైనాలో ఏర్పడిన ట్రాఫిక్ జామ్ కు చెందిన ఫోటో ఇది.