నిజమెంత: ఏపీలో జరిగిన ఘటనను ఢిల్లీలో చోటు చేసుకుందంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు
ఓ వ్యక్తి పదునైన ఆయుధంతో మరో వ్యక్తిపై దారుణంగా దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
By న్యూస్‌మీటర్ తెలుగు
నిజమెంత: ఏపీలో జరిగిన ఘటనను ఢిల్లీలో చోటు చేసుకుందంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు
ఓ వ్యక్తి పదునైన ఆయుధంతో మరో వ్యక్తిపై దారుణంగా దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఢిల్లీలోని సరాయ్ కాలే ఖాన్ ప్రాంతంలో జావేద్ అనే వ్యక్తి రోహిత్ అనే హిందూ యువకుడిని చంపాడంటూ పోస్టులు పెడుతున్నారు.
“ఢిల్లీలోని సరాయ్ కాలే ఖాన్‌లో జరిగిన ఘటనలో రోహిత్ అనే హిందూ యువకుడిని దారుణంగా జావేద్ అనే జిహాదీ హతమార్చాడు. ఈ మృగం ఎటువంటి కారణం లేకుండా, కేవలం మతం ఆధారంగా అలాంటి పనికి పాల్పడితే ఇలాంటి వ్యక్తిని ఎన్‌కౌంటర్ చేయాలి. దయచేసి చర్యలు తీసుకోండి.” అంటూ హిందీలో పోస్టులను వైరల్ చేస్తున్నారు.
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
కీఫ్రేమ్స్ ను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. NewsMeter లో జులై 18న ‘Monstrous Murder: YSRCP activist brutally axed to death in Palnadu, section 144 imposed.’ అనే వాదనతో కథనాన్ని మేము గుర్తించాం.
నివేదిక ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా, వినుకొండ పట్టణంలో టీడీపీ కార్యకర్త అయిన జిలానీ చేతిలో రషీద్ అనే యువకుడు దారుణంగా హతమయ్యాడు. దాడి చేసిన వ్యక్తి చేతులు కూడా తెగిపడగా, బాధితుడి మెడపై లోతైన గాయమవ్వడంతో రక్తస్రావమై చనిపోయాడు. జూలై 17వ తేదీ రాత్రి 8.30 గంటల ప్రాంతంలో వ్యక్తిగత కక్షల కారణంగానే జిలానీ రషీద్‌ను హత్య చేసినట్లు పల్నాడు ఎస్పీ కంచి శ్రీనివాస్‌రావు తెలిపారని నివేదికలో పేర్కొన్నారు.
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఈ సంఘటనను జూలై 19న నివేదించింది. వార్తాపత్రిక ప్రకారం.. మాండ్లమండి బస్ స్టేషన్ సమీపంలో రద్దీగా ఉండే రహదారిపై దాదాపు ఐదు నిమిషాల పాటు ఈ దాడి జరిగింది, ప్రజలు చూస్తూనే ఉన్నారు. రషీద్ కింద పడిపోయిన తర్వాత కూడా కొడవలితో దాడి చేస్తూనే ఉన్నాడు. పోలీసులు వచ్చే సమయానికి నిందితుడు పరారయ్యారు. రషీద్‌ను ఆసుపత్రికి తరలించగా, అతను చనిపోయినట్లు ప్రకటించారు.
పల్నాడు పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) కె. శ్రీనివాసరావు మాట్లాడుతూ.. నిందితులు ఇద్దరూ ఒకరికొకరు తెలుసునని, వ్యక్తిగత సమస్యల కారణంగా ఈ హత్య జరిగిందని అన్నారు. రాజకీయ కక్షలు లేవంటూ ఆయన తోసిపుచ్చారని కూడా వార్తాపత్రిక ప్రస్తావించింది.
ఇండియా టుడే, టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా అదే వాదనతో ఈ సంఘటనను నివేదించాయి.
కాబట్టి, వైరల్ వీడియో ఆంధ్రప్రదేశ్‌కి చెందినదని, ఢిల్లీకి సంబంధించినది కాదని మేము నిర్ధారించాము. రోహిత్ అనే హిందూ వ్యక్తిని జావేద్ అనే వ్యక్తి చంపినట్లు జరుగుతున్న వాదన అబద్ధం.
Credit: Md Mahfooz Alam