పంజాబ్‌లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు ఎన్నో ప్రాంతాలు నీటమునిగాయి. ప్రధాన నదుల్లో నీటి మట్టాలు కూడా పెరిగిపోవడంతో వరదలు ముంచెత్తాయి. భాఖ్రా, పాంగ్, రంజిత్ సాగర్ ఆనకట్టల నుండి నీటిని విడుదల చేస్తూ ఉండడంతో దశాబ్దాలలో అత్యంత దారుణమైన వరదలకు దారితీసింది. ఈ పరిణామాల కారణంగా పంజాబ్ హై అలర్ట్‌లో ఉంది.
వరదలు 23 జిల్లాల్లోని 1,650 గ్రామాలను ప్రభావితం చేశాయి, 1.75 లక్షల ఎకరాల వ్యవసాయ భూములు మునిగిపోయాయి. వరి, ఇతర పంటలకు భారీ నష్టం కలిగించాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో బురదతో కూడిన వరద నీరు ఇంట్లోకి తీవ్రంగా ప్రవహిస్తున్నట్లు, మంచాలు, ఒక గేదె, సరిహద్దు గోడను తుడిచిపెట్టినట్లు చూపిస్తుంది, ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకోవడం కోసం పరిగెత్తుతున్నారు. ఈ ఫుటేజ్ పంజాబ్‌లో వరదలను చూపిస్తుందని వాదనతో విస్తృతంగా షేర్ చేస్తున్నారు.
"పంజాబ్‌లో పరిస్థితి హృదయ విదారకంగా ఉంది. దేశ ప్రధానమంత్రి విశ్రాంతి యాత్రలలో బిజీగా ఉన్నారు" అనే శీర్షికతో వీడియోను X యూజర్ షేర్ చేశారు. (ఆర్కైవ్)
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వైరల్ వీడియోను ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సృష్టించారు.
ఈ పోస్ట్ పై యూజర్ల కామెంట్స్ చూడగా, వీడియో AI ద్వారా రూపొందించారని మేము గమనించాము.
వీడియోలో పలు తేడాలను కూడా మేము గమనించాము. అంత ప్రమాదం జరిగినా కూడా ఆ వ్యక్తులు గాయపడకుండా బయటకు రావడం, గేదె అక్కడి నుండి అదృశ్యం కావడం వంటివి ఉన్నాయి.
మేము వీడియోను కీఫ్రేమ్‌లుగా విభజించి, AI డిటెక్షన్ టూల్ వాసిట్ AI ద్వారా ఒక ఫ్రేమ్‌ను విశ్లేషించాము. ఇది చిత్రం కృత్రిమంగా రూపొందించబడిందని నిర్ధారించింది.
మేము డీప్‌ఫేక్-ఓ-మీటర్‌ని ఉపయోగించి వీడియోను కూడా విశ్లేషించాము, ఇక్కడ ఒక డిటెక్టర్ దానిని 100 శాతం AI ద్వారా సృష్టించినట్లు తెలిపింది. మరొకటి 99.7 శాతం కృత్రిమ కంటెంట్ అని గుర్తించింది. మూడవది 57.1 శాతం AI-ఉత్పత్తిగా ఉండవచ్చని సూచించింది.
కాబట్టి, ఇంటిని ముంచెత్తిన వరదలకు సంబంధించిన వీడియో నిజమైన సంఘటనలను చూపించలేదని మేము నిర్ధారించాము. ఇది AI ద్వారా సృష్టించినది. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Credit: Mahfooz Alam