నిజమెంత: టోల్ ప్లాజాను కొందరు వ్యక్తులు ధ్వంసం చేసిన వీడియో భారత్ లో చోటు చేసుకుందా?

కుర్తా పైజామా, ముస్లిం స్కల్ క్యాప్‌లు ధరించిన వ్యక్తులు టోల్ ప్లాజా వద్ద విధ్వంసం సృష్టించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  24 Sep 2024 3:00 AM GMT
NewsMeterFactCheck, Bangaldesh, India, Toll Plaza

నిజమెంత: టోల్ ప్లాజాను కొందరు వ్యక్తులు ధ్వంసం చేసిన వీడియో భారత్ లో చోటు చేసుకుందా? 

కుర్తా పైజామా, ముస్లిం స్కల్ క్యాప్‌లు ధరించిన వ్యక్తులు టోల్ ప్లాజా వద్ద విధ్వంసం సృష్టించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. అక్కడ ఒక పికప్ లారీ లో నుండి కొందరు వ్యక్తులు దిగి గొడవ చేస్తూ ఉండడం మనం చూడొచ్చు. కొందరు వ్యక్తులు, టోల్ ప్లాజా ఉద్యోగుల మధ్య మాటల యుద్ధం జరిగింది. తర్వాత వారిలో ఒకరు బారికేడ్‌ను ధ్వంసం చేశారు. ఈ వీడియో భారతదేశానికి చెందినదని చెబుతూ ఉన్నారు. డబ్బులు చెల్లించే మానసిక స్థితిలో ఆ వ్యక్తులు లేరని సోషల్ మీడియా వినియోగదారులు ఆరోపిస్తున్నారు.

ఒక X వినియోగదారు వీడియోను పంచుకుంటూ “ఇప్పుడు భారతదేశంలో ముస్లింలకు టోల్ పన్ను విధిస్తారా? 'సబ్కా సాథ్, సబ్కా వికాస్,' @narendramodi జీ ఇదేనా? కేంద్ర ప్రభుత్వం, @nitin_gadkari మంత్రిత్వ శాఖ ముస్లింల కోసం టోల్ మినహాయింపు ఇస్తూ ప్రత్యేక పథకం ప్రారంభించాలి!" అంటూ పోస్టులు పెట్టారు. (ఆర్కైవ్)

ముస్లిం జనాభాపై ఫేస్‌బుక్ వినియోగదారు పరోక్షంగా విమర్శలు చేస్తూ వీడియోను షేర్ చేశారు. “డెమోగ్రఫీ ఈజ్ డెస్టినీ! స్కల్ క్యాప్ అనేది సెక్యులర్ ప్రభుత్వం అందించే టోల్ ఫ్రీ పాస్ అని టోల్ బూత్ వ్యక్తికి అర్థం కాలేదు. గజ్వా ఇ హింద్‌ వైపు అడుగులు వేస్తున్నాము....." అంటూ మరో పోస్టు పెట్టారు.

నిజ నిర్ధారణ:

ఈ వీడియో బంగ్లాదేశ్‌కు చెందినది. కాబట్టి, వైరల్ అవుతున్న పోస్టుల్లో నిజం లేదని న్యూస్‌మీటర్ గుర్తించింది.

వీడియో కీఫ్రేమ్‌లను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ ను నిర్వహించాం. సెప్టెంబర్ 18న ఢాకా ట్రిబ్యూన్ నివేదికను మేము కనుగొన్నాము. అందులో వైరల్ వీడియోకు సంబంధించిన స్క్రీన్‌గ్రాబ్‌ను మనం చూడొచ్చు.

ఈ సంఘటన సెప్టెంబర్ 18న ఢాకా ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్‌వేలోని కురిల్ టోల్ ప్లాజా వద్ద జరిగింది. ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్ట్ డైరెక్టర్ AHM అక్తర్ ఈ ఘటనపై స్పందిస్తూ భద్రతా కారణాల దృష్ట్యా పికప్ వ్యాన్‌లు, మోటార్‌సైకిళ్లు, సిఎన్‌జిలు, రిక్షాలు ఎక్స్‌ప్రెస్‌వేపై ఉపయోగించకుండా నిషేధించారు. అయితే, పికప్ వ్యాన్‌లోని వ్యక్తులు ఈ నిబంధనను పాటించడానికి ఒప్పుకోలేదు. టోల్ ప్లాజా దగ్గర ఉన్న బారికేడ్‌ను ధ్వంసం చేశారు.

ఢాకా ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్‌వేలోని కురిల్ టోల్ ప్లాజా వద్ద సెప్టెంబర్ 18న ఈ సంఘటన జరిగిందని ప్రోథోమ్ అలో, డైలీ నయా దిగంత, జూమ్ బంగ్లా న్యూస్‌లతో సహా అనేక బంగ్లాదేశ్ మీడియా అవుట్ లెట్లు నివేదించాయి. ఈ మీడియా కథనాల ప్రకారం, పికప్ వ్యాన్ భద్రతా కారణాల దృష్ట్యా ఆపివేశారు. ప్రయాణీకులు నిలబడి, దాని సామర్థ్యం కంటే ఎక్కువ మందిని తీసుకువెళుతున్నారు. అందుకే ఆపారు.

జమున టీవీ, డైలీ ఇత్తెఫాక్ సెప్టెంబర్ 18న ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఢాకాలోని కురిల్ ప్లాజాలో జరిగిన సంఘటనకు సంబంధించిన వీడియోను ప్రచురించాయి.

కాబట్టి, ఈ సంఘటన భారతదేశంలో జరగలేదని నిర్ధారించాము. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.

Credit: Md Mahfooz Alam

Claim Review:టోల్ ప్లాజాను కొందరు వ్యక్తులు ధ్వంసం చేసిన వీడియో భారత్ లో చోటు చేసుకుందా?
Claimed By:X and Facebook users
Claim Reviewed By:Newsmeter
Claim Source:X and Facebook
Claim Fact Check:False
Next Story