జమ్మూ కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి పలు చోట్ల పాకిస్తాన్ సైన్యం కాల్పులు జరుపుతూ కవ్వింపు చర్యలకు పాల్పడింది. పాకిస్తాన్ దళాలు వరుసగా ఆరో రోజు సరిహద్దులో కాల్పులు జరుపుతున్నాయి. పాకిస్థాన్ ఉగ్రవాదులు పహల్గామ్ లో 26 మందిని చంపిన తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రాజౌరి జిల్లాలోని నౌషేరా, సుందర్‌బానీ సెక్టార్‌లతో పాటు జమ్మూలోని అఖ్నూర్, పర్గ్వాల్ సెక్టార్‌లలో, బారాముల్లా, కుప్వారా జిల్లాల్లో తాజా రౌండ్ కాల్పులు జరిగాయని అధికారులు తెలిపారు.
ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో, సోషల్ మీడియాలో ఒక వీడియో విస్తృతంగా షేర్ అవుతోంది. ఓ మైదానంలో మంటలు చెలరేగుతున్నట్లు, దట్టమైన పొగ ఆకాశంలోకి ఎగసిపడుతున్నట్లు ఇది చూపిస్తుంది. ఈ క్లిప్‌ను షేర్ చేస్తున్న సోషల్ మీడియా అకౌంట్లు పాకిస్తాన్ సైన్యం భారత రాఫెల్ యుద్ధ విమానాన్ని కూల్చివేసిందని చెబుతున్నాయి.
ఒక X యూజర్ ఈ వీడియోను "ఎల్‌ఓసిలోని పూంచ్ సెక్టార్‌లో భారత రాఫెల్ జెట్‌లను పాకిస్తాన్ సైన్యం కూల్చివేసింది" అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేశారు. (ఆర్కైవ్)
పలు భాషల్లో ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దానికి సంబంధించిన వీడియోలు ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ ఉన్నాయి.
నిజ నిర్ధారణ:
న్యూస్‌మీటర్ వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని కనుగొంది. ఈ వీడియో 2024లో మహారాష్ట్రలో భారత వైమానిక దళానికి చెందిన సుఖోయ్ Su-30MKI ఫైటర్ జెట్ కూలిపోయిన ఘటనకు సంబంధించింది.
పాకిస్తాన్ సైన్యం భారత్ కు చెందిన రాఫెల్ ఫైటర్ జెట్‌లను కూల్చివేసిందని ధృవీకరించే విశ్వసనీయ నివేదికలు మాకు దొరకలేదు. అలాంటి సంఘటన జరిగి ఉంటే, అది జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థలు నివేదించి ఉండేవి.
తప్పుడు వాదనతో షేర్ చేస్తున్న పాత వీడియో:
వీడియో నుండి కీఫ్రేమ్‌లను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా జూన్ 4, 2024 నాటి ఫేస్‌బుక్ పోస్ట్‌కు మమ్మల్ని దారితీసింది, ఇది నిఫాడ్ సబ్-డివిజన్‌లోని శిరస్గావ్‌లో కూలిపోయిన విమానం Su-30MKIగా గుర్తించాం.
జూన్ 4, 2024న లోక్‌మత్ టైమ్స్ యొక్క X హ్యాండిల్ పోస్ట్ చేసిన అదే వీడియో నిడివి ఎక్కువ ఉన్న వెర్షన్‌ను, అదే రోజు ప్రచురించిన నివేదికలను కూడా మేము కనుగొన్నాము.
నివేదిక ప్రకారం, నాసిక్ జిల్లాలోని శిరస్గావ్ సమీపంలో భారత వైమానిక దళానికి చెందిన సుఖోయ్ Su-30MKI విమానం టెస్ట్ ఫ్లైట్ సమయంలో కూలిపోయింది. ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.
మా కీవర్డ్ సెర్చ్ లో జూన్ 4, 2024 నాటి ది హిందూ, NDTV నివేదికలు కనిపించాయి. హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) మరమ్మతులు చేసిన తర్వాత విమానం మహారాష్ట్రలోని ఓజార్ నుండి బయలుదేరిందని, సాంకేతిక లోపం కారణంగా కూలిపోయిందని నిర్ధారించారు. పైలట్, కో-పైలట్ ఇద్దరికీ స్వల్ప గాయాలయ్యాయి.
వైరల్ వీడియో ప్రస్తుత భారతదేశం-పాకిస్తాన్ ఉద్రిక్తతలకు సంబంధం లేదని, రాఫెల్ జెట్లు కూల్చేసినట్లు చూపించలేదని స్పష్టంగా తెలుస్తుంది.
జూన్ 2024 లో మహారాష్ట్రలో జరిగిన సుఖోయ్ క్రాష్ కు సంబంధించింది. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Credit: Mahfooz Alam