నిజమెంత: పాక్ మళ్లీ దాడులు చేస్తే భారత్ అమెరికాకు ఫిర్యాదు చేస్తుందని నేవీ వైస్ అడ్మిరల్ చెప్పారా?

ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ కు చెందిన ఆరు విమానాలు- ఐదు ఫైటర్ జెట్‌లు, ఒక పెద్ద విమానం కూలిపోయాయని ఎయిర్ చీఫ్ మార్షల్ AP సింగ్ వెల్లడించినప్పటి..

By న్యూస్‌మీటర్ తెలుగు
Published on : 15 Aug 2025 12:29 PM IST

NewsMeterFactCheck, Navy Vice Admiral, India, USA, Pakistan attacks

నిజమెంత: పాక్ మళ్లీ దాడులు చేస్తే భారత్ అమెరికాకు ఫిర్యాదు చేస్తుందని నేవీ వైస్ అడ్మిరల్ చెప్పారా? 

ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ కు చెందిన ఆరు విమానాలు- ఐదు ఫైటర్ జెట్‌లు, ఒక పెద్ద విమానం కూలిపోయాయని ఎయిర్ చీఫ్ మార్షల్ AP సింగ్ వెల్లడించినప్పటి నుండి, భారత ఆర్మీ అధికారులకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్నాయి. వాటన్నింటినీ డిజిటల్ గా ఎడిట్ చేశారు.

భారత నావికాదళానికి చెందిన వైస్ అడ్మిరల్ AN ప్రమోద్ వీడియో కూడా వైరల్ అవుతోంది. అందులో పాకిస్తాన్ మళ్ళీ భారతదేశంపై దాడి చేయడానికి ధైర్యం చేస్తే భారతదేశం అమెరికా, ఆ అధ్యక్షుడు ట్రంప్‌కు ఫిర్యాదు చేస్తుందని ఆయన చెబుతున్నారు. ఈ వీడియోను షేర్ చేస్తున్న వారు భారతదేశాన్ని ఎగతాళి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. భారతదేశం పోరాడటానికి బదులుగా, ఫిర్యాదు చేసి అమెరికా నుండి సహాయం కోరుతుందని పోస్టులు పెడుతున్నారు.

ఈ వీడియోలో, ప్రమోద్ మాట్లాడుతూ “ఈసారి పాకిస్తాన్ ఏదైనా చర్య తీసుకోవడానికి ధైర్యం చేస్తే, మేము ఏమి చేయబోతున్నామో పాకిస్తాన్‌కు అది తెలుసు. ఆపరేషన్ సిందూర్‌ సమయంలో మేము గతంలో చేసినట్లుగా, మేము పాకిస్తాన్‌పై యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్‌కు ఫిర్యాదు చేస్తాము.” అని అన్నారు.

"భారతదేశం తనను తాను ప్రాంతీయ సూపర్ పవర్‌గా అమ్ముకుంటోంది, కానీ దాని నేవీ చీఫ్ మాటలు అసలు ఇమేజ్‌ను చూపిస్తాయి. పాకిస్తాన్ దాడి చేస్తే, వారి ప్రణాళిక ట్రంప్‌ తో మాట్లాడడం, తిరిగి పోరాడటం కాదు. ఇది వ్యూహాత్మక భాగస్వామ్యం కాదు. ఇది ఇతర దేశాలపై ఆధారపడటం" అనే శీర్షికతో వీడియోను షేర్ చేసిన పోస్టులను మేము చూశాం. (ఆర్కైవ్)

నిజ నిర్ధారణ:

న్యూస్‌మీటర్ వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని కనుగొంది. వైరల్ వీడియోను ఎడిట్ చేశారు.

మేము కీవర్డ్ సెర్చ్ ను నిర్వహించాము. పాకిస్తాన్ భారతదేశంపై మళ్లీ దాడి చేస్తే భారతదేశం అమెరికాకు ఫిర్యాదు చేస్తుందని వైస్ అడ్మిరల్ ఎఎన్ ప్రమోద్ పేర్కొన్నట్లు ఎటువంటి నివేదికలు కనుగొనలేకపోయాం.

మేము వీడియోను విశ్లేషించాము. 0:13 నిమిషాల టైమ్‌స్టాంప్ నుండి ప్రారంభమయ్యే వీడియోలో ఎన్నో తేడాలను కనుగొన్నాము. ఈ పాయింట్ నుండి ఆడియో ప్రమోద్ స్వరానికి విరుద్ధంగా టోనల్ వైవిధ్యాన్ని ప్రదర్శిస్తుంది. 0:13 నిమిషాల మార్క్‌కు ముందు సెగ్మెంట్‌తో పోల్చినప్పుడు చాలా తేడాలను మేము గమనించాము. ఇది లిప్-సింక్ లో తేడాలను సూచిస్తుంది.

మే 11న భారత సాయుధ దళాల త్రివిధ దళాల అధికారులు ప్రసంగించిన ఆపరేషన్ సిందూర్ పై జరిగిన విలేకరుల సమావేశాన్ని మేము సమీక్షించాము. వైరల్ క్లిప్ ఈ వీడియో నుండి తీసుకోబడింది. 59:19 నిమిషాల టైమ్‌స్టాంప్‌లో, వైస్ అడ్మిరల్ మీడియా ప్రశ్నకు సమాధానంగా ఒక సంక్షిప్త ప్రకటన చేశారు.

ఆయన మాట్లాడుతూ “నేను కొన్ని వ్యాఖ్యలు చేసి, వాటిని మీ ఊహకే వదిలేస్తాము. ముందుగా, నేను చెప్పినట్లుగా, మన ప్రత్యర్థిని భారీ దెబ్బ కొట్టడానికి మనకు పరిమాణాత్మక, గుణాత్మక సామర్థ్యం ఉంది. భారత్ సముద్ర రంగంలో పూర్తిగా ఆధిపత్యం చెలాయిస్తుంది. భారత నావికాదళ చర్య ఎస్కలేషన్ లో భాగంగా మేము మూడు దళాలలో ప్రతిఘటనను రూపొందించాము. ఈసారి, పాకిస్తాన్ ఏదైనా చర్య తీసుకునే ధైర్యం చేస్తే పాకిస్తాన్‌ మీద ఎలాంటి చర్యలైనా తీసుకోగలం” అని అన్నారు.

వైస్ అడ్మిరల్ చేసిన ఈ సంక్షిప్త ప్రకటన పాకిస్తాన్‌కు స్పష్టమైన హెచ్చరిక లాంటిది. వైస్ అడ్మిరల్ అమెరికా నుండి సహాయం తీసుకోవడం గురించి మాట్లాడినట్లు లేదా డోనాల్డ్ ట్రంప్ గురించి ప్రస్తావించినట్లు మాకు ఎటువంటి సాక్ష్యాలు కనిపించలేదు. వేరే ఆడియోతో వీడియోను ఎడిట్ చేశారని ఇది నిర్ధారిస్తుంది.

AI డిటెక్షన్ టూల్స్ ఉపయోగించి వైరల్ క్లిప్ విశ్లేషణ:

మేము డీప్‌ఫేక్-ఓ-మీటర్ ఉపయోగించి వీడియో, ఆడియోను విడివిడిగా విశ్లేషించాము.

రెండు డిటెక్టర్లు 50 శాతం కంటే ఎక్కువ AI ఉత్పత్తి అంటూ సూచించగా, మూడు డిటెక్టర్లు 90 శాతం కంటే ఎక్కువ ఏఐ వినియోగం స్థాయిలను నమోదు చేశాయి. ఆడియో కోసం, ఒక డిటెక్టర్ 100 శాతంతో AI ఉత్పత్తి సంభావ్యతను, రెండు 90 శాతం కంటే ఎక్కువ ఉన్నట్లు ఫ్లాగ్ చేశాయి.

హైవ్ మోడరేషన్ టూల్ ఈ వీడియోలో మొత్తం AI- జనరేటెడ్ లేదా డీప్‌ఫేక్ కంటెంట్ ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది, దీనికి మొత్తం స్కోరు 96.1 శాతంగా ఉంది.

కాబట్టి, వైరల్ అవుతున్న వీడియోను డిజిటల్ గా ఎడిట్ చేశారు.

Credit: Mahfooz Alam

Claim Review:పాక్ మళ్లీ దాడులు చేస్తే భారత్ అమెరికాకు ఫిర్యాదు చేస్తుందని నేవీ వైస్ అడ్మిరల్ చెప్పారా?
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter
Claim Source:X
Claim Fact Check:False
Next Story