నిజమెంత: వైరల్ వీడియోలో ఉన్నది జమ్మూ కశ్మీర్ లో చోటు చేసుకున్న ప్రకృతి విధ్వంసమా?
ఇటీవలి కాలంలో జమ్మూ కశ్మీర్‌లో భారీ వర్షాలు సంభవించాయి. పలు ప్రాంతాలు దారుణంగా దెబ్బతిన్నాయి.
By న్యూస్‌మీటర్ తెలుగు
నిజమెంత: వైరల్ వీడియోలో ఉన్నది జమ్మూ కశ్మీర్ లో చోటు చేసుకున్న ప్రకృతి విధ్వంసమా?
ఇటీవలి కాలంలో జమ్మూ కశ్మీర్‌లో భారీ వర్షాలు సంభవించాయి. పలు ప్రాంతాలు దారుణంగా దెబ్బతిన్నాయి. రికార్డు స్థాయిలో కురుస్తున్న వర్షాలకు కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు, పలు పనులకు విస్తృత అంతరాయం, ఎన్నో నష్టాలు చోటు చేసుకున్నాయి.
ఈ సందర్భంలో, ఇళ్ళు, చెట్లతో ఉన్న భూమి జారిపడి నీటితో కలిసిపోతున్నట్లు చూపించే వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోను షేర్ చేసిన వారు ఇటీవలి వర్షాల సమయంలో జమ్మూ కాశ్మీర్‌కు చెందినదని పేర్కొన్నారు.
ఒక X యూజర్ ఈ వీడియోను "మీరు ఎప్పుడైనా పర్వతం కదులుతున్నట్లు చూశారా? ఈరోజే చూడండి..! ఈ దృశ్యం జమ్మూకు చెందినది" అనే శీర్షికతో షేర్ చేశారు.
ఇలాంటి వాదనలను ఇక్కడ , ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు .
నిజ నిర్ధారణ:
2020లో నార్వేలో కొండచరియలు విరిగిపడిన వీడియోను జమ్మూ కశ్మీర్ కు చెందినదిగా ప్రచారం చేస్తున్నారు. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని న్యూస్‌మీటర్ కనుగొంది.
క్లిప్ కు సంబంధించిన కీఫ్రేమ్‌ల రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, జూన్ 4, 2020న AGU Blogosphere లో ప్రచురించబడిన బ్లాగ్‌లో ఫీచర్ చేసిన వీడియోకు సంబంధించిన పొడవైన వెర్షన్‌కు దారితీసింది. ఈ బ్లాగును ప్రపంచవ్యాప్తంగా కొండచరియలు విరిగిపడటం, విశ్లేషించడం కోసం ప్రసిద్ధి చెందిన భూవిజ్ఞాన శాస్త్రవేత్త డేవ్ పెట్లీ చూసుకుంటారు.
బ్లాగ్ ప్రకారం, జూన్ 3, 2020న నార్వేలో జరిగిన ఆల్టా క్విక్ క్లే కొండచరియలు విరిగిపడటం ఈ వీడియోలో ఉంది. భారీ వర్షం, పగుళ్ల తర్వాత అనేక ఇళ్లను సముద్రంలోకి నెట్టివేసింది. ఈ సంఘటనను ఒక ఇంటి యజమాని జాన్ ఎగిల్ బక్కెడాల్ రికార్డ్ చేశారని బ్లాగ్ పేర్కొంది. అతను తన క్యాబిన్ నుండి వాలులోని పగుళ్లను గమనించాడు.
జూన్ 5, 2020న ది టెలిగ్రాఫ్ ‘Landslide sweeps Norway homes into the sea’ అనే టైటిల్ తో ప్రచురించిన వీడియోలో కూడా మేము ఇలాంటి దృశ్యాలను కనుగొన్నాము.
మీడియా సంస్థ ప్రకారం, నార్వేజియన్ ఆర్కిటిక్‌లో ఆల్టా పట్టణానికి సమీపంలో కొండచరియలు విరిగిపడటంతో ఎనిమిది ఇళ్ళు సముద్రంలోకి కొట్టుకుపోయాయి.
స్థానిక నివాసి జాన్ ఎగిల్ బక్కెడాల్ ఈ వీడియోను చిత్రీకరించాడని నివేదిక పేర్కొంది, ఏమి జరుగుతుందో గ్రహించిన తర్వాత ప్రాణాల కోసం పరిగెత్తానని అతను చెప్పాడు. కోల్పోయిన ఇళ్లలో ఒకటి అతనిది. క్రాక్నెసెట్ గ్రామంలో కొండచరియ 650 నుండి 800 మీటర్ల వెడల్పు (2,145-2,640 అడుగులు), 40 మీటర్ల (132 అడుగులు) ఎత్తు వరకు ఉందని పోలీసులు తెలిపారు.
2020లో ఇండియా టీవీ, అమర్ ఉజాలాతో సహా భారతీయ మీడియా సంస్థలు ప్రచురించిన అదే వీడియోను కూడా మేము కనుగొన్నాము, ఈ కథనాలు నార్వేలో కొండచరియలు విరిగిపడటం గురించి నివేదించాయి.
కాబట్టి, ఈ వీడియో 2020లో నార్వేలో కొండచరియలు విరిగిపడడాన్ని చూపిస్తుందని మేము నిర్ధారించాము.
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Credit: Mahfooz Alam