నిజమెంత: అఖిలేష్ యాదవ్ కుంభమేళాకు హాజరై స్నానం చేశారా?
ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన సమావేశంగా పేరొందిన మహా కుంభమేళా ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతోంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 17 Jan 2025 4:29 PM ISTనిజమెంత: అఖిలేష్ యాదవ్ కుంభమేళాకు హాజరై స్నానం చేశారా?
ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన సమావేశంగా పేరొందిన మహా కుంభమేళా ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతోంది. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ గొప్ప కార్యక్రమంలో కోట్లాది మంది పాల్గొంటారు. 45 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవానికి 40 కోట్ల మందికి పైగా భక్తులు హాజరవుతారని అంచనా వేశారు.
ఈ నేపథ్యంలో సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ రాత్రిపూట ఒంటరిగా నీటిలో ఉన్న చిత్రాలు వైరల్‌గా మారాయి. ఈ చిత్రాలను షేర్ చేస్తున్న వారు అఖిలేష్ యాదవ్ మహా కుంభమేళాలో పాల్గొన్నారని, పవిత్ర సంగమంలో స్నానం చేశారని తెలిపారు.
పలువురు సోషల్ మీడియా వినియోగదారు ఈ చిత్రాలను షేర్ చేస్తున్నారు.
మహా కుంభమేళా వేడుకల్లో అఖిలేష్ యాదవ్ భాగమయ్యాడనే వాదనతో Xలో కూడా ఇలాంటి పోస్టులు వైరల్ అయ్యాయి.
నిజ నిర్ధారణ:
న్యూస్‌మీటర్ వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని కనుగొంది. ఈ చిత్రాలు ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్ నుండి కాదని, ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ లో తీసినవని గుర్తించాం. అఖిలేష్ యాదవ్ 2025లో మకర సంక్రాంతి సంబరాలలో పాల్గొన్న సమయంలో ఈ ఫోటోలు తీశారు.
రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా అఖిలేష్ యాదవ్ అధికారిక X ఖాతాలో పెట్టిన పోస్టులు చూశాం. వైరల్ ఫోటోలు జనవరి 14, 2025న "పవిత్రమైన మకర సంక్రాంతి సందర్భంగా గంగామాత ఆశీస్సులు తీసుకున్నాను" అనే శీర్షికతో షేర్ చేశారు.
मकर संक्रांति के पावन पर्व पर लिया माँ गंगा का आशीर्वाद। pic.twitter.com/Rx1ZRHsH7m
— Akhilesh Yadav (@yadavakhilesh) January 14, 2025
కీవర్డ్ సెర్చ్ చేయగా మేము జనవరి 14, 2025 నాటి NDTV నివేదికను కనుగొన్నాము. ‘అఖిలేష్ యాదవ్ మకర సంక్రాంతి నాడు గంగా నదిలో పవిత్ర స్నానం చేశారు' అంటూ కథనాన్ని పోస్టు చేశారు.
వైరల్ ఫోటోలలో ఒకదానిని కలిగి ఉన్న నివేదిక ప్రకారం.. ఈ చిత్రం ఉన్న ప్రదేశం ప్రయాగ్‌రాజ్ కాకుండా హరిద్వార్ అని నిర్ధారించింది. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి హరిద్వార్‌లో స్నానం చేసినట్లు పార్టీ వర్గాలు ధృవీకరించాయని నివేదిక పేర్కొంది.
కుంభమేళా సందర్శనపై అఖిలేష్ యాదవ్ ఏమన్నారు?
ఎన్‌డిటివి కథనం ప్రకారం, అఖిలేష్ మేళాకు హాజరవుతున్నారా లేదా అనే దానిపై సరైన వివరాలు ఇవ్వలేదు. కుంభమేళాకు హాజరవడం గురించి ఎస్పీ నాయకుడు ఏమి చెప్పాడనే దాని గురించి మరింత తెలుసుకోవడానికి దైనిక్ భాస్కర్ నివేదికను కనుగొన్నాము. ప్రయాగ్‌రాజ్ పర్యటన గురించి అడిగినప్పుడు, అఖిలేష్ యాదవ్ 'మా గంగ నన్ను పిలిచినప్పుడు నేను సంగమ్‌కి వెళ్తాను' అని చెప్పారు.
“ఇన్ని వనరులు ఉన్నా, మహా కుంభమేళాలో లోటుపాట్లు ఉంటే ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి. ప్రభుత్వం ఆ లోపాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వాటిని అధిగమిస్తుందని ఆశిస్తున్నాం" అంటూ అఖిలేష్ యాదవ్ తెలిపారు.
"జనవరి 14న, మకర సంక్రాంతి సందర్భంగా, అఖిలేష్ హరిద్వార్‌లోని గంగాస్నానం చేసాడు" అనే శీర్షికతో ఉన్న అఖిలేష్ యాదవ్ అదే వైరల్ ఫోటోలు ఈ నివేదికలో ఉన్నాయి. ది టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందుస్థాన్ టైమ్స్ వంటి ఇతర మీడియా సంస్థల నుండి వచ్చిన నివేదికలు కూడా అఖిలేష్ యాదవ్ మకర సంక్రాంతి సందర్భంగా హరిద్వార్‌లోని గంగా నదిలో స్నానం చేసినట్లు ధృవీకరించాయి.
మకర సంక్రాంతి అనేది ఒక ముఖ్యమైన హిందూ పండుగ. ఆ సమయంలో పవిత్ర నదులలో స్నానాలు చేయడం గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ సంవత్సరం, జనవరి 14, 2025 న మకరసంక్రాంతి వచ్చింది.
ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహా కుంభమేళా 2025లో అఖిలేష్ యాదవ్ పవిత్ర స్నానం చేస్తున్నట్లు వైరల్ అవుతున్న వాదన తప్పు. ఈ చిత్రాలు హరిద్వార్ నుండి వచ్చాయి, జనవరి 14, 2025న మకర సంక్రాంతి రోజున ఆయన స్నానమాచరించారు.
Credit: Sibahathulla Sakib