నిజమెంత: బంగ్లాదేశ్ చొరబాటుదారుడు భారతదేశంలోని హిందూ వ్యాపారవేత్త ఇంట్లో దొంగతనం చేశాడా?

ముళ్ల కంచెను దాటి ఒక యువకుడు సైకిల్ దొంగిలించిన సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.

By -  అంజి
Published on : 25 Oct 2025 5:11 PM IST

NewsMeterFactCheck, india, Peraguay, Bangladeshi infiltrator, Hindu businessman, India

నిజమెంత: బంగ్లాదేశ్ చొరబాటుదారుడు భారతదేశంలోని హిందూ వ్యాపారవేత్త ఇంట్లో దొంగతనం చేశాడా? 

ముళ్ల కంచెను దాటి ఒక యువకుడు సైకిల్ దొంగిలించిన సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఈ వీడియోను షేర్ చేస్తున్న వ్యక్తులు, వైరల్ వీడియోలో ఉన్న వ్యక్తి బంగ్లాదేశ్ చొరబాటుదారుడని ఆరోపిస్తూ ఉన్నారు. భారతదేశంలోని ఒక హిందూ వ్యాపారవేత్త ఇంటి నుండి దొంగతనం చేస్తున్నట్లు వైరల్ అవుతున్న వాదన చెబుతోంది.

బాబా బనారస్ అనే X హ్యాండిల్ లో, "అక్రమ బంగ్లాదేశ్ చొరబాటుదారుడు మొహమ్మద్ జుబైర్ ఒక హిందూ వ్యాపారవేత్త ఇంటి నుండి దొంగతనం చేస్తూ CCTVలో దొరికిపోయాడు. తరువాత పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ఇటువంటి అక్రమ రోహింగ్యాలు, బంగ్లాదేశ్ కు చెందిన వ్యక్తులు భారతదేశ అంతర్గత భద్రతకు ముప్పు. దొంగతనం నుండి ఉగ్రవాదం వరకు వెళ్లే అవకాశం ఉంది. అలాంటి వారందరినీ బహిష్కరించండి." అంటూ పోస్టులు పెట్టారు. (ఆర్కైవ్)

నిజ నిర్ధారణ:

ఈ వీడియో భారతదేశంలో రికార్డు అయింది కాదు. వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేదిగా ఉందని న్యూస్‌మీటర్ కనుగొంది.

సీసీటీవీ ఫుటేజ్‌లో వీడియో ఏప్రిల్ 26న రికార్డ్ చేసినట్లుగా సూచించే టైమ్‌స్టాంప్‌ను మేము గుర్తించాము. రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా మే 1న పరాగ్వే కు చెందిన ఫేస్‌బుక్ ఖాతాలో అప్‌లోడ్ చేయబడిన అదే ఫుటేజ్ మాకు కనిపించింది. పరాగ్వేలోని అసున్సియోన్‌లోని బారియో జారాలోని ఒక నివాసం నుండి ఒక దొంగ ముళ్ల కంచెలు ఉన్న గోడను ఎక్కి మరీ సైకిల్‌ను దొంగిలించాడని ఆ శీర్షికలో ఉంది.

పరాగ్వేలోని రేడియో కారిటాస్ 680 AM అనే మీడియా సంస్థతో సహా 2025 ఏప్రిల్-మేలో అనేక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలు (లింక్‌లు ఇక్కడ, ఇక్కడ) షేర్ చేసిన వీడియోను కూడా మేము కనుగొన్నాము. అన్ని ఖాతాలు, మీడియా సంస్థలు ఈ వీడియో పరాగ్వేలోని బెల్లా విస్టా, బారియో జారా, అసున్సియోన్ లో చోటు చేసుకుందని నివేదించాయి.

పరాగ్వేలోని మరొక మీడియా సంస్థ అయిన సిస్టెమా నేషనల్ డి టెలివిజన్ (SNT) ధృవీకరించబడిన ఖాతా ఏప్రిల్ 30న ఈ సంఘటనపై ఒక వీడియో నివేదికను ప్రచురించింది.

నివేదిక ప్రకారం, అసున్సియోన్‌లోని ఒక నివాసం డాబా నుండి ఒక వ్యక్తి రెండు సైకిళ్లను దొంగిలించాడు. సెక్యూరిటీ కెమెరాలలో ఇదంతా రికార్డు అయింది. పొరుగువారు ఈ ప్రాంతంలో పెరుగుతున్న అభద్రతను నివేదించారు. పోలీసుల పహారా పెంచాలని కోరారు.

కాబట్టి, దొంగతనానికి సంబంధించిన వీడియో భారతదేశంలో చోటు చేసుకుంది కాదు. పరాగ్వే నుండి వచ్చిందని మేము నిర్ధారించాము. కాబట్టి, భారతదేశంలోని ఒక హిందూ వ్యాపారవేత్త ఇంట్లో బంగ్లాదేశ్ చొరబాటుదారుడు చోరీకి పాల్పడ్డాడనే వాదనలో ఎలాంటి నిజం లేదు.

Credit: Mahfooz Alam

Claim Review:బంగ్లాదేశ్ చొరబాటుదారుడు భారతదేశంలోని హిందూ వ్యాపారవేత్త ఇంట్లో దొంగతనం చేశాడా?
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter
Claim Source:X
Claim Fact Check:False
Next Story