నిజమెంత: యునైటెడ్ కింగ్డమ్ లో పోలీసులు ముస్లిం మత పెద్దల ముందు మోకరిల్లారా?యునైటెడ్ కింగ్డమ్ లో ముస్లింల వలసల గురించి తీవ్ర చర్చ జరుగుతూ ఉంది. ఇటీవల కొన్ని ప్రాంతాల్లో ముస్లింలపైనా.. మసీదులపైనా దాడులు జరిగాయి.యునైటెడ్ కింగ్‌డమ్‌లోని సముద్రతీర పట్టణమైన సౌత్‌పోర్ట్‌లో మసీదుపై దాడి చేయడానికి వందలాది మంది ప్రజలు గుమిగూడారు. ముగ్గురు యూకే బాలికలను కత్తితో దాడి చేసిన నిందితుడు ముస్లిం అని తప్పుడు ప్రచారం జరగడంతో ఈ దాడి జరిగింది. మసీదుపైకి వస్తువులను విసిరారు. దుర్భాషలాడుతూ ఇస్లామోఫోబిక్ నినాదాలు చేశారు. దాడిని అడ్డుకునే ప్రయత్నంలో 50 మంది పోలీసులు గాయపడ్డారు.
ఈ నేపథ్యంలో, ఇస్లామిక్ దుస్తులు ధరించిన వ్యక్తుల ముందు పోలీసులు మోకరిల్లిన ఫోటో ఒకటి వైరల్ అవుతూ ఉంది. మోకాళ్ల మీద కూర్చొని ముస్లిం వ్యక్తులకు పోలీసు అధికారులు నమస్కరిస్తున్న చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. UKలోని ముస్లింల ముందు పోలీసులు 'లొంగిపోతున్నారని' వాదనతో ఈ ఫోటోను వైరల్ చేస్తున్నారు.
ఫేస్‌బుక్ వినియోగదారు ఈ చిత్రాన్ని షేర్ చేస్తూ “ఈ చిత్రం ప్రస్తుత UK పోలీసింగ్ ను ప్రతిబింబిస్తుంది. బోన్ చిల్లింగ్....” అంటూ పోస్టు పెట్టారు.
ట్విట్టర్ లో కూడా ఈ ఫోటోను వైరల్ చేశారు.
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న ఫోటో ఒరిజినల్ ఫోటో కాదని న్యూస్ మీటర్ గుర్తించింది.
చిత్రాన్ని నిశితంగా పరిశీలించిన తర్వాత తలలు, కాళ్లు, ముఖాలకు సంబంధించి చాలా తేడాలు గమనించాం. అనేక వ్యత్యాసాలను మేము గుర్తించాము.
మేము హైవ్ మోడరేషన్, హగ్గింగ్ ఫేస్‌తో సహా AI గుర్తింపు సాధనాలను ఉపయోగించి చిత్రాన్ని మరింత విశ్లేషించాము. హైవ్ మోడరేషన్ చిత్రం 99.2 శాతం AI ద్వారా ఉత్పత్తి చేసిన కంటెంట్‌ను కలిగి ఉంటుందని సూచించింది. అయితే హగ్గింగ్ ఫేస్ 81 శాతం కృత్రిమ, 19 శాతం మనుషులకు సంబంధించినదని ధృవీకరించింది.
అందువల్ల, వైరల్ చిత్రం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రూపొందించారని మేము నిర్ధారించాము.
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని గుర్తించాం.