నిజమెంత: ముఖ్యమంత్రి పదవి చేపట్టాక చంద్రబాబు నాయుడు ఆగ్రహంతో ఊగిపోయారా?

చంద్రబాబు నాయుడు ఆవేశంతో మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  13 Jun 2024 8:15 AM GMT
NewsMeterFactCheck, NDA, TDP, Chandrababu

నిజమెంత: ముఖ్యమంత్రి పదవి చేపట్టాక చంద్రబాబు నాయుడు ఆగ్రహంతో ఊగిపోయారా?

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్‌ సీఎంగా నారా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేశారు. ఆయన చేత గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. ఏపీ సీఎంగా నాలుగోసారి చంద్రబాబు ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. అనంతరం చంద్రబాబును ప్రధాని మోదీ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. జనసేన అధినేత, నటుడు పవన్ కళ్యాణ్ నాయుడు మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన మంత్రివర్గ సహచరులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, పలువురు నేతలు, ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు.

ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు ఆవేశంతో మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు చంద్రబాబు నాయుడు తన నిగ్రహాన్ని కోల్పోయారనే వాదనతో వీడియోను షేర్ చేస్తున్నారు.

చంద్రబాబు నాయుడుకు కోపం వచ్చిందని క్యాప్షన్‌లో పేర్కొంటూ ఫేస్‌బుక్ యూజర్ వీడియోను షేర్ చేశారు. “ఎన్‌డిఏ కూటమి ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు” అని వీడియోలో టెక్స్ట్ ఉంది. (ఆర్కైవ్‌)

నిజ నిర్ధారణ:

వైరల్ వీడియో 2021 నాటిది. కాబట్టి వైరల్ అవుతున్న వాదన తప్పుదారి పట్టించేలా ఉందని NewsMeter కనుగొంది.

వీడియో కీఫ్రేమ్స్ ను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. నవంబర్ 19, 2021న ‘ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం’ శీర్షికన V6 న్యూస్ తెలుగు ప్రచురించిన కథనాన్ని మేము కనుగొన్నాము. చంద్రబాబు నాయుడు కోపంగా మాట్లాడుతున్నట్లు, అసెంబ్లీ నుండి వాకౌట్ చేస్తున్నట్లు వీడియోలో మనం చూడొచ్చు.

నవంబర్ 19, 2021న NDTV నివేదిక ప్రకారం, చంద్రబాబు నాయుడు తన భార్య భువనేశ్వరిపై అభ్యంతకరమైన వ్యాఖ్యలు చేశారని AP అసెంబ్లీ నుండి వాకౌట్ చేశారు. అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌, టీడీపీ సహా ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోవడంతో ఈ ఘటన జరిగింది. తనకు మాట్లాడేందుకు కనీసం అవకాశం ఇవ్వలేదని చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉండడం మనం చూడొచ్చు.

2024లో ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి అధికారంలోకి రాగా.. NDAలోని బీజేపీకి అతిపెద్ద మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ (TDP)కి పౌర విమానయాన మంత్రిత్వ శాఖను కేటాయించారు. ఈ మంత్రిత్వ శాఖను సీనియర్ టీడీపీ నేత ఎర్రంనాయుడు కుమారుడు కె.రామ్మోహన్ నాయుడు పర్యవేక్షిస్తున్నారు. గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ కూడా మంత్రిగా నియమితులయ్యారు.

ఇక చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేసి ఉంటే అది ఖచ్చితంగా వార్తల్లో ప్రముఖంగా ప్రచురించి ఉండేవారు. అలాంటి వార్తల కోసం కూడా మేము వెతికాం. కానీ కథనాలు ఏవీ మాకు కనిపించలేదు.

అందువల్ల, చంద్రబాబు నాయుడుకు సంబంధించిన వైరల్ వీడియో 2021 నాటిదని మేము నిర్ధారించాము. వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేదని మేము నిర్ధారించాం.

Credits: Md Mahfooz Alam

Claim Review:ముఖ్యమంత్రి పదవి చేపట్టాక చంద్రబాబు నాయుడు ఆగ్రహంతో ఊగిపోయారా?
Claimed By:X Users
Claim Reviewed By:Newsmeter
Claim Source:X
Claim Fact Check:Misleading
Next Story