రెండు గ్రూపుల మధ్య గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఆ వీడియోలో కొందరు వ్యక్తులు కుర్చీలు విసరడం.. కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం వంటివి చూడవచ్చు. పాకిస్తానీలు, ఖలిస్తానీ అనుకూల వ్యక్తుల మధ్య ఘర్షణను ఇది చూపుతుందని సోషల్ మీడియా వినియోగదారులు చెబుతున్నారు.
“పాకిస్తానీలు ఖలిస్తానీలతో కలిసి నిరసన తెలిపారు. పాకిస్థాన్‌లోని పంజాబ్ కూడా ఖలిస్తాన్‌లో భాగమేనని, పాకిస్థానీలు సర్దార్‌లను కొట్టడం మొదలుపెట్టారని ఒక ఖలిస్తానీ చెప్పాడు… ఇదీ ఖలిస్తానీ-పాకిస్తానీ ప్రేమ, ”అని వీడియోను షేర్ చేసిన ఒక X వినియోగదారు రాశారు.
ఫేస్‌బుక్ యూజర్ కూడా ఇదే విషయాన్ని పేర్కొంటూ వీడియోను షేర్ చేశాడు.
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదోవ పట్టించేదిగా ఉందని న్యూస్‌మీటర్ కనుగొంది. రెండు ఖలిస్థానీ అనుకూల గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణ ఈ వీడియోలో ఉంది.
వీడియో కీఫ్రేమ్‌లను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా నవంబర్ 7న Parvasi TV అనే యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేసిన వీడియోలో మేము ఒరిజినల్ వీడియోను కనుగొన్నాము. అమెరికాలోని యుబా సిటీలో నగర్ కీర్తన సమయంలో జరిగిన ఘర్షణకు సంబంధించినది వీడియో క్యాప్షన్ చెబుతుంది.
వెరిఫైడ్ యూట్యూబ్ ఛానల్ News18 Punjab/Haryana/Himachal కూడా వీడియోను నవంబర్ 6, 2023న అప్లోడ్ చేసింది. యుబా సిటీలో నగర్ కీర్తన్ సందర్భంగా జరిగిన ఘర్షణకు సంబంధించినదని అందులో తెలిపారు.
ఈ క్లూస్ ను బట్టి.. మేము సంబంధిత కీవర్డ్ సెర్చ్ ను అమలు చేసాము. నవంబర్ 7న న్యూస్ 18 ఇంగ్లీష్ అప్లోడ్ చేసిన ఒక వీడియోను కనుగొన్నాము.
కాలిఫోర్నియాలోని యుబా సిటీలో వార్షిక సిక్కు నగర్ కీర్తన సందర్భంగా సిక్కులు గుమిగూడిన సమయంలో ఖలిస్తానీ అనుకూల గ్రూపుల మధ్య ఘర్షణ చెలరేగిందని ఛానెల్ నివేదించింది. ఆరోజు గొడవకు సంబంధించిన విభేదాలకు కారణం ఇంకా తెలియలేదని కూడా వార్తల్లో నివేదించారు.
ఈ సమయంలో ‘ఢిల్లీ విల్ బి ఖలిస్తాన్’ అనే బ్యానర్‌తో కూడిన హెలికాప్టర్ కూడా కనిపించిందని న్యూస్18 పేర్కొంది.
మేము యుబా సిటీలోని నాగర్ కీర్తన కోసం వెతికాము. నవంబర్ 6న ABC10 లో ప్రచురించిన నివేదికను మేము కనుగొన్నాము. భారతదేశం వెలుపల అతిపెద్ద సిక్కు పండుగ అయిన 44వ వార్షిక నగర్ కీర్తన కోసం యుబా సిటీలో పదివేల మంది ప్రజలు గుమిగూడారని అందులో పేర్కొంది.
వైరల్ వీడియోలో చెబుతున్నట్లుగా.. పాకిస్తానీలు, ఖలిస్తాన్ అనుకూల మద్దతుదారుల మధ్య గొడవ కాదని స్పష్టంగా తెలుస్తూ ఉంది. వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేదిగా ఉంది.