జనసత్తా మీడియా సంస్థ కథనానికి సంబంధించిన ఓ స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ తన కెరీర్‌లో మద్దతు ఇచ్చినందుకు ముస్లిం అభిమానులకు మాత్రమే ధన్యవాదాలు తెలిపినట్లు ఆ ఆర్టికల్ లో ఉంది. ముస్లిం అభిమానులకు మాత్రమే రుణపడి ఉన్నానని షారుఖ్ ఖాన్ చెప్పారంటూ పలువురు ఆ స్క్రీన్ షాట్ ను షేర్ చేస్తూ ఉన్నారు.
"నేను ఈరోజు సూపర్‌స్టార్ అయ్యానంటే అందుకు కారణం ముస్లిం సోదరులు.. పేదరికంలో ఉన్నా కూడా నా సినిమాలను చూసారు. ఖాన్ సినిమాలను మాత్రమే చూసిన మా ముస్లిం సోదరులకు కృతజ్ఞతలు" అని పోస్ట్ లో ఉంది.
నిజ నిర్ధారణ :
వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.
"జనసత్తా" లో ఇప్పటి వరకూ ఇలాంటి కథనం రాలేదు. వైరల్ అవుతున్న స్క్రీన్ షాట్ ను ఎడిట్ చేశారు.
హెడ్‌లైన్‌లో పేర్కొన్న కీలకపదాలను ఉపయోగించి వార్తా కథనాల కోసం మా టీమ్ ఆన్‌లైన్‌లో వెతికింది. కానీ ఏదీ కనుగొనబడలేదు.
మా బృందం వైరల్ ఇమేజ్‌ని జనసత్తా యొక్క అధికారిక కథనంతో పోల్చింది. నిజమైన వెబ్ సైట్ లోని ఆర్టికల్, వైరల్ అవుతున్న స్క్రీన్ షాట్ లోని ఫాంట్‌లు మరియు లేఅవుట్ పరంగా కొన్ని వ్యత్యాసాలను కనుగొంది.
వైరల్ అవుతున్న స్క్రీన్ షాట్ కు ఒరిజినల్ ఆర్టికల్ కు తేడాలను చూడొచ్చు.
ఇక ముఖ్యమైన విషయమేమిటంటే.. వైరల్ అవుతున్న హిందీ ఆర్టికల్ లో ఎన్నో వ్యాకరణ దోషాలు ఉన్నాయని తేలింది.
ఇక జనసత్తా కూడా వైరల్ అవుతున్న స్క్రీన్ షాట్ ఫేక్ అంటూ సెప్టెంబర్ 29న సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది. ఈ స్క్రీన్ షాట్ పూర్తిగా ఫేక్ అంటూ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా జనసత్తా తెలిపింది.
షారూఖ్ ఖాన్ తన విజయానికి ముస్లిం అభిమానులు మాత్రమే కారణమంటూ కృతజ్ఞతలు తెలిపినట్లు జనసత్తా నివేదించలేదు. అదొక మార్ఫింగ్ ఫోటో..!