ఒడిశాలో ఇటీవల జరిగిన ట్రైన్ యాక్సిడెంట్ బాధితులకు భారత క్రికెటర్లు భారీగా విరాళం ప్రకటించారంటూ పలువురు పోస్టులు పెట్టారు.
పలువురు సోషల్ మీడియా వినియోగదారులు క్రికెటర్లు ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ విరాళాలు ఇచ్చారంటూ పోస్ట్ చేశారు. ఒడిశాలోని బాలాసోర్ జిల్లా బహనాగ బజార్ వద్ద జరిగిన రైలు ప్రమాదం అనేక కుటుంబాలలో విషాదం నింపింది. ఈ నేపథ్యంలో సెలబ్రెటీలు, క్రికెటర్లు భారీ మొత్తంలో విరాళం ఇచ్చినట్లు ప్రమాదంలో పలువురు వార్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
వైరల్ అవుతున్న రీల్ ప్రకారం, క్రికెట్ దిగ్గజాలు ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ ఒడిశా రైలు దుర్ఘటన బాధితులకు రూ. 60 కోట్లు, రూ. 30 కోట్లు విరాళంగా ఇచ్చారు.
నిజ నిర్ధారణ :
న్యూస్‌మీటర్ బృందం ఈ వైరల్ క్లెయిమ్ బూటకమని గుర్తించింది.
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ MS ధోనీకి సంబంధించి కీవర్డ్ సెర్చ్ చేయగా.. పలు మీడియా సంస్థలు ఈ వార్తలు బూటకమని తెలిపాయి. ప్రమాదానికి సంబంధించిన విరాళాల గురించి MS ధోని లేదా అతని బృందం నుండి అధికారిక ప్రకటన చేయలేదు.
క్రికెటర్ విరాట్ కోహ్లి బాధితులకు రూ. 30 కోట్లు విరాళంగా ఇచ్చినట్లు విశ్వసనీయమైన మీడియా నివేదికలు ఏవీ మేము కనుగొనలేదు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ కోసం కోహ్లీ ప్రస్తుతం UKలో ఉన్నట్లు మేము కనుగొన్నాము.
కోహ్లీ ట్విట్టర్ హ్యాండిల్‌లో ఈ ఘటనకు సంబంధించి ఒక ట్వీట్‌ని కనుగొన్నాము, “ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం గురించి విన్నప్పుడు చాలా బాధగా ఉంది. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను." అంటూ కోహ్లీ ట్వీట్ చేశాడు.
అయితే టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తన గొప్ప మనసు చాటుకున్నారు. కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాద బాధిత కుటుంబాలకు అండగా నిలబడాలని నిర్ణయించుకున్నారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి పిల్లలకు సెహ్వాగ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఉచిత విద్యతో పాటు ఫ్రీ బోర్డింగ్ సదుపాయాలు కల్పిస్తానని సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. సెహ్వాగ్ తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ధోని, కోహ్లీ కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చారనే వైరల్ పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.
Credits : Sunanda Naik