Fact Check : హనుమంతుడి స్టికర్ ఉందని కేరళలో అంబులెన్స్ ను నిరాకరించారా..?

Fact check of Kerala couple refuses ambulance with Hanuman sticker. అంబులెన్స్ మీద హనుమంతుడి స్టికర్ ఉందని కేరళకు చెందిన జంట నిరాకరించారా.

By Medi Samrat  Published on  21 May 2021 3:50 AM GMT
fact check of  ambulance

అంబులెన్స్ మీద హనుమంతుడి స్టికర్ ఉందని కేరళకు చెందిన జంట దానిలో ఎక్కడానికి నిరాకరించారని.. అలా ఎక్కకపోవడం వలన వారి ప్రాణాలు పోయాయని సోషల్ మీడియాలో పలువురు పోస్టులు పెడుతూ ఉన్నారు.

సోషల్ మీడియా యూజర్లు పోస్టు చేసిన ఫోటో ప్రకారం. 'ఎం.స్టాలిన్ అతడి భార్య జెస్సి లకు ఆక్సిజన్ తక్కువైంది. వారిని ఆసుపత్రికి తీసుకుని వెళ్ళడానికి అంబులెన్స్ రాగా దానిపై రుద్రముఖి ఆంజనేయ స్వామి ఉన్న స్టికర్ ఉంది. ఆంజనేయస్వామి స్టికర్ ఉందని వాళ్లు ఆ అంబులెన్స్ ఎక్కడానికి నిరాకరించారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ప్రాణాలు వదిలారని ప్రత్యక్ష సాక్షులు చూసారు' అంటూ ఓ ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది.

ఈ ఫోటోను పలువురు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. మతపరమైన కోణాల్లో ఈ ఫోటోను వైరల్ చేస్తూ ఉన్నారు.

నిజ నిర్ధారణ:

కేరళకు చెందిన జంట హనుమంతుడి స్టికర్ ఉందని అంబులెన్స్ ను నిరాకరించారంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు. ఇలాంటి ఘటన కేరళలో చోటు చేసుకుందంటూ ఏ మీడియా సంస్థ కూడా చెప్పలేదు.

వైరల్ అవుతున్న ఫోటోను న్యూస్ మీటర్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. ఆ ఫోటో కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకు చెందినదిగా స్పష్టం అవుతోంది. హిందుస్థాన్ టైమ్స్ మే 10, 2021న ఈ అంబులెన్స్ కు చెందిన ఫోటోను ఆర్టికల్ లో పోస్టు చేయడం జరిగింది.


బెంగళూరు నగరంలో కోవిద్-19 కారణంగా మరణించిన వారిని ఊరి బయట ఉన్న స్మశానవాటికకు తరలిస్తూ ఉన్నారని అందులో చెప్పారు. అది కూడా మే 8, 2021న తీసిన ఫోటో. అందులో పీపీఈ కిట్లు ధరించి పలువురు ఉన్నారు. చుట్టూ కట్టెలు కూడా ఉండడాన్ని గుర్తించవచ్చు.


వైరల్ అవుతున్న ఫోటో ఇన్ షార్ట్స్ కు చెందినదిగా గుర్తించవచ్చు. సాధారణంగా ఇన్ షార్ట్స్ యాప్ లో వచ్చే ఆర్టికల్ కు చెందిన ఫార్మాట్ కు.. వైరల్ అవుతున్న ఫార్మాట్ కు చాలా తేడా ఉంది. కాబట్టి పక్కాగా ఎడిట్ చేసినదిగా తెలుస్తోంది.

కాబట్టి, కేరళకు చెందిన జంట హనుమంతుడి స్టికర్ ఉన్న అంబులెన్స్ ను ఎక్కడానికి నిరాకరించారని.. అందువలన చనిపోయారంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.


Next Story