అమెరికా ప్రెసిడెంట్ గా జో బిడెన్ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం బిడెన్ ఎన్నో నిర్ణయాలను తీసుకుంటూ అమెరికాను తిరిగి గాడిన పెట్టే పనిలో ఉన్నారు. అయితే భారత్ లో ఢిల్లీ బోర్డర్ లో రైతులు చేస్తున్న నిరసనలపై జో బిడెన్ కామెంట్లు చేశారంటూ ఓ పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి.
"రైతులు గత 50 రోజులుగా వర్షానికి, చలికి ఢిల్లీ సరిహద్దుల్లో కూర్చుని నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు. ఈ సమస్యను శాంతియుతంగా వీలైనంత త్వరగా పరిష్కరించండి. మోదీ ప్రభుత్వం రైతుల డిమాండ్లను నెరవేర్చడమే కాకుండా వారిని సగౌరవంగా ఇళ్లకు పంపించాలి"- జో బిడెన్, అమెరికా ప్రెసిడెంట్
ఇలా ఓ పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది. అందులో జో బిడెన్ మాట్లాడుతున్నట్లుగా ఫోటో ఉంది.
నిజ నిర్ధారణ:
జో బిడెన్ భారత్ లో రైతుల నిరసనలకు మద్దతుగా ప్రకటన చేశారంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు. జో బిడెన్ రైతులకు మద్దతుగా ఎటువంటి ప్రకటన కూడా చేయలేదు.
వైరల్ అవుతున్న పోస్టులో ఉన్న ఫోటోను గూగుల్ లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. Fox 10 News, C-SPAN మీడియా సంస్థలు ఫిలడెల్ఫియా, పెన్సిల్వేనియాలో తన ఎన్నికల ప్రచారం నిర్వహించినటువంటి వీడియో.
అమెరికాలో పోలింగ్ జరగడానికి రెండు రోజుల ముందు జో బిడెన్ ఫిలడెల్ఫియాలో పర్యటించి అక్కడి సమస్యల గురించి మాట్లాడారు. ఆఫ్రికన్ అమెరికన్ల మీద కరోనా వైరస్ ప్రభావం ఎలా ఉందో ఆయన చెప్పుకొచ్చారు. జాత్యహంకారాన్ని అమెరికా నుండి పారద్రోలడానికి ప్రయత్నించాలని.. అధికారం అప్పగిస్తే అలాంటిది లేకుండా చేస్తానని అన్నారు.
ఇక మరో వీడియోను డిడి న్యూస్ పోస్టు చేసింది. "US Presidential Election: The war of words between Donald Trump-Joe Biden intensifies." అంటూ 31 అక్టోబర్ 2020న ఈ వీడియోను పోస్టు చేశారు. వైరల్ అవుతున్న పోస్టుల్లో ఉన్నది కూడా ఈ వీడియోకు చెందిన ఫోటోనే..! వీడియోను అక్టోబర్ 2020న అప్లోడ్ చేయగా.. రైతుల ఉద్యమం నవంబర్ 2020న మొదలైంది. ఇక భారత్ లో రైతుల ఉద్యమంపై జో బిడెన్ వ్యాఖ్యలు చేసినట్లుగా ఏ మీడియా సంస్థ కూడా కథనాలను వెల్లడించలేదు.
కాబట్టి జో బిడెన్ భారత్ లో రైతుల డిమాండ్లను పరిష్కరించాలంటూ వ్యాఖ్యలు చేశారంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.