ఆంధ్రప్రదేశ్‌లోని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) వైద్య విద్యార్థులు, అధ్యాపకులకు కొత్త డ్రెస్ కోడ్‌ను ప్రకటించినట్లు పలు తెలుగు మీడియా సంస్థలు డిసెంబర్ 2న కథనాలు ప్రచురించాయి.
వైద్య విద్యార్థులు, అధ్యాపకులు జీన్స్ మరియు టీ-షర్టులు ధరించకుండా నిషేధించారని నివేదికలు పేర్కొన్నాయి. కొత్త డ్రెస్ కోడ్ ప్రకారం విద్యార్థినులు చీరలు, చురీదార్లు మాత్రమే ధరించాలి, జుట్టు వదులుగా ఉండకూడదు. మగ విద్యార్థులు తప్పనిసరిగా క్లీన్ షేవ్ తో.. చక్కగా దుస్తులు ధరించాలని కథనాల్లో ఉన్నాయి. "ఎంబీబీఎస్, పీజీ వైద్య విద్యార్థులు నీట్‌గా డ్రెస్ చేసుకోవాలని, క్లీన్ షేవ్‌తో రావాలని, మహిళలైతే జుట్టును వదులుగా వదిలేయవద్దని సూచించింది.తప్పనిసరిగా స్టెతస్కోప్, యాప్రాన్ ధరించాలని ఆ ఆదేశాల్లో పేర్కొంది. ఇప్పటికే నిర్దేశించిన డ్రెస్ కోడ్‌కు కొందరు విద్యార్థినులు, వైద్యులు, పారామెడికల్ సిబ్బంది పట్టించుకోకపోవడంతో గుర్తించిన అధికారులు ఈ మేరకు తాజాగా ఆదేశాలు జారీ చేశారు." అంటూ కథనాలు వచ్చాయి.
నిజ నిర్ధారణ :
NewsMeter బృందం కీవర్డ్ సెర్చ్ ను నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ మెడికల్ స్టూడెంట్స్ డ్రెస్ కోడ్ గురించి ఎలాంటి మార్గదర్శకాలను జారీ చేయలేదని కనుగొంది.
వైద్య విద్యార్థులకు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ ట్విట్టర్ హ్యాండిల్ స్పష్టం చేసింది. మెడికల్ కాలేజీల్లో డ్రెస్ కోడ్‌కు సంబంధించి కొన్ని మీడియా విభాగాల్లో ప్రచురితమైన వార్తలను AP మెడికల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఖండించింది. మెడికల్ స్టూడెంట్స్ కోసం అలాంటి ఉత్తర్వులేవీ జారీ చేయలేదని.. వ్యాప్తి చెందుతున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని తెలిపింది.
మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ వినోద్ కుమార్ రాసిన లేఖ కూడా చూడవచ్చు. కొత్త డ్రెస్ కోడ్ గురించిన వార్తలు అధికారికం కాదని లేఖలో పేర్కొన్నారు.నకిలీ వార్తలను ప్రచురించినందుకు సూర్య న్యూస్, TV9 న్యూస్‌లపై స్పందించింది. "వైద్య విద్యార్థుల కోసం అలాంటి సర్క్యులర్‌లు లేదా ఆదేశాలు జారీ చేయలేదు" అని పేర్కొంది. వివిధ ఉద్యోగుల సంఘాలు, సంస్థలతో సంప్రదించి ఉద్యోగులు, అధ్యాపకుల కోసం ఒక కోడ్‌ను రూపొందిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. సంప్రదింపులు, చర్చల తర్వాత వివరణాత్మక సర్క్యులర్ జారీ చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో వైద్య విద్యార్థుల కోసం కొత్త డ్రెస్ కోడ్ తీసుకుని వచ్చినట్లు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. మీడియా సంస్థల కథనాల్లో నిజం లేదని మేము నిర్ధారించాము.