నిజమెంత: దీపాలు, క్రొవ్వొత్తుల ద్వారా వచ్చే వేడితో కరోనాను జయించొచ్చా..?
By సుభాష్ Published on 4 April 2020 10:45 AM ISTఏప్రిల్ 3న దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ వీడియో సందేశం ఇచ్చారు. ఏప్రిల్ 5న దేశ ప్రజలంతా జాగరణ చేయాలని పిలుపునిచ్చారు. రాత్రి 9 గంటలకు దేశ ప్రజలంతా తొమ్మిది నిమిషాల పాటు జ్యోతులు వెలిగించాలన్నారు. ఇళ్లలోని విద్యుత్ దీపాలు బంద్ చేసి బాల్కానీలోకి రావాలని ప్రధాని మోదీ అన్నారు. ఈ ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు జ్యోతులు వెలగించాలని ప్రధాని మోదీ ప్రజలను పిలుపునిచ్చారు. కొవ్వొత్తి, దీపం లేదా మొబైల్ ఫ్లాష్ లైట్లు ఆన్ చేయాలన్నారు. కరోనా చీకట్లను తరిమేయాలని ప్రధాని మోదీ అన్నారు. ఎవరు, ఎక్కడ ఉన్నా రాత్రి తొమ్మిది గంటలకు లైట్లు ఆపేయాలన్నారు. అయితే ఈ కార్యక్రమంలో అందరూ కూడా సోషల్ డిస్టెన్స్ పాటించాలని ప్రధాని మోదీ కోరారు. రాబోయే 11 రోజులు అత్యంత కీలకమైనవన్నారు. 130 కోట్ల మంది ప్రజలు తమ సంకల్ప శక్తి చాటాలన్నారు.
ఆ మాటలు ఆయన అలా అన్నారో లేదో.. అప్పుడే కొన్ని మెసేజీలు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లు అయిన వాట్సప్, ట్విట్టర్ లో తెగ వైరల్ అవుతూ ఉన్నాయి. మోదీ అలా చేయమనడానికి ముఖ్య కారణం ఉందని.. కరోనా వైరస్ అత్యధిక ఉష్ణోగ్రతలో బతకలేదని నాసా తెలిపిందని.. అందుకే మన ప్రధానమంత్రి దీపాలను వెలిగించాలని కోరాడని అన్నారు.
“Coronavirus doesn’t survive hot temperature as per research by NASA. If 130 candles are lit together, temperature will increase by 9 degrees- as per IIT professor. So Corona will die at 09:09 pm on Sunday. Masterstroke by Modi. It is believed that Coronavirus cannot survive in high temperatures. Imagine the amount of heat produced when 130 crore Indians will be burning candles together. Temperature will be increased in atmosphere and hence Coronavirus will die,” అని వాట్సప్ లో మెసేజ్ విపరీతంగా వైరల్ అవుతోంది.
ఈ మెసేజీ సారాంశం ఏమిటంటే "కరోనా వైరస్ ఎక్కువ ఉష్ణోగ్రతలో బతకలేదని నాసా తెలిపింది. 130 కోట్ల దీపాలు ఒకేసారి వెలిగించడం వలన ఉష్ణోగ్రత అన్నది ఒక్కసారిగా 9 డిగ్రీలు పెరుగుతుందని ఐఐటీ ప్రొఫెసర్ చెప్పాడు. దీంతో రాత్రి 09:09 కి కరోనా వైరస్ అన్నది మరణిస్తుంది. ఇది నరేంద్ర మోదీ మాస్టర్ స్ట్రోక్. కరోనా వైరస్ అత్యధిక ఉషోగ్రతలో బతకలేదు. 130 కోట్ల మంది ఒక్కసారిగా దీపాలను వెలిగిస్తే.. వాతావరణంలో వేడి పెరుగుతుంది.. అప్పుడు కరోనా వైరస్ చనిపోతుంది".. దీన్ని వాట్సప్ లో తెగ వైరల్ చేస్తూ ఉన్నారు.
మరో మెసేజీ కూడా వైరల్ అవుతోంది.. “April 5th is Vamana Dwadashi. On that day, the earth gets maximum light from Sun and this empowers disease causing viruses. The virus is a evil entity and it thrives in darkness. According to Adiyogi Purana, one way to destroy such evil entities is to focus light on it, like we do with magnifying glass and sun’s rays. It’s towards this that the Prime Minister has asked for us to switch off all lights in our house (too bright), and use a focused, small light to show our support. The small focus of all our candles, diyas etc will focus into a powerful beam and strike at the heart of the coronavirus so that we can all celebrate the true Ram Navami a few days later to the scheduled date. Unlike earlier attempts, this is not a masterstroke from our PM. This is a masterbeam!”
ఈ మెసేజీ సారాంశం ఏమిటంటే..
"ఏప్రిల్ 5 వామన ద్వాదశి.. ఆరోజున భూమి మీదకు సూర్యుడి నుండి అత్యధికంగా ఎండ తగులుతుంది.. అది వైరస్ లు బతకడానికి కారణం అవుతుంది.. చీకట్లో కూడా వైరస్ ఎక్కువగా బతుకుతుంది. ఆది యోగి పురాణంలో వైరస్ లాంటి చెడు అస్థిత్వాన్ని చంపాలంటే.. దాని మీద ఫోకస్ గా వెలుతురును ప్రసరించాలట. అందుకే మోదీ ఇంట్లో లైట్స్ ను ఆపివేసి.. వెలుతురు చిన్నగా.. ఫోకస్ గా వచ్చే క్యాండిల్, దీపం.. మొదలైన వాటిని తీసుకుని బాగా వెలుతురు వచ్చే కాంతి పుంజాన్ని కరోనా వైరస్ మీద ప్రసారం అయ్యేలా చేయాలట.. అలా చేస్తే వైరస్ చావడం ఖాయం. దీంతో శ్రీరామ నవమిని కొన్ని రోజుల తర్వాత భారతీయులంతా ఘనంగా జరుపుకున్నట్లే..! ముందు లాగ ఇది భారత ప్రధాని నరేంద్ర మోదీ మాస్టర్ స్ట్రోక్ కాదిది.. మాస్టర్ బీమ్" అన్నది వైరల్ చేస్తూ ఉన్నారు.
నిజమెంత:
కోవిద్-19 వైరస్ ఇంతే ఉష్ణోగ్రతలో బతుకుతుందని తాము ఖచ్చితంగా చెప్పలేమని నిపుణులు అంటున్నారు.
హైదరాబాద్ లోని సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (CCMB) డైరెక్టర్ రాకేష్ మిశ్రా మాట్లాడుతూ "ఈ వైరస్ అన్నది ఎనిమిది నుండి తొమ్మిది రోజుల పాటూ పొడి ఉపరితలంపై జీవించగలదని ఆయన అన్నారు. మనిషి శరీరంలో 37 డిగ్రీల ఉష్ణోగ్రతలో కూడా బతకగలవు. కొన్ని వైరస్ లు అత్యధిక ఉష్ణోగ్రతలో బతకలేవు.. వేడి కారణంగా కొన్ని వైరస్ లు చనిపోతాయి. కానీ కోవిద్-19 ఎటువంటి ఉష్ణోగ్రత వరకూ బతకగలదు అన్నదానిపై ఇంకా క్లారిటీ లేదు" అని అన్నారు.
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇప్పటికే మిత్ బస్టర్స్ పేజీలో "కరోనా వైరస్ ఈ ఉష్ణోగ్రతలో చనిపోతుంది అన్నదానికి ఆధారాలు లేవని" చెప్పుకొచ్చింది. అత్యధిక ఉష్ణోగ్రతలో వైరస్ బతకదు అన్నదానికి సాక్ష్యాలు లేవని అన్నారు. ఇప్పటి వరకూ ఎటువంటి ఆధారం లేదని.. కరోనా వైరస్ ప్రతి ఒక్క ప్రాంతంలోనూ బతుకుతోందని.. వేడిగా, గాలిలో తేమ ఉన్న ప్రాంతాల్లో కూడా బతుకుతోందని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది.
కొందరు నిపుణులు మాత్రం సూర్యరశ్మి కారణంగా కరోనా వైరస్ వ్యాప్తి అన్నది కొంచెం వరకే పరిమితం అవుతుందని అంటున్నారు. సూర్యరశ్మి, అధిక ఉష్ణోగ్రత, గాల్లో తేమ లాంటి మూడు విషయాల్లో కరోనా వైరస్ కాస్త సెన్సిటివ్ అని అంటున్నారు.
లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రోపికల్ మెడిసిన్ కు చెందిన డేవిడ్ హేమన్ మాత్రం ఈ విషయాన్ని తప్పుబడుతున్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యాగజైన్ న్యూ సైంటిస్ట్స్ కోట్స్ కు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో MERS కరోనా వైరస్ సౌదీ అరేబియాలో ఆగస్టు నెలలో విపరీతంగా ప్రబలిందని ఆయన అన్నారు. ఈ వైరస్ లు అత్యధిక టెంపరేచర్లలో కూడా బతకగలవని ఆయన అంటున్నారు. కానీ ఈ వైరస్ లు మనిషి శరీరంలో కాకుండా బయటి వాతావరణంలో అంత ఉష్ణోగ్రతలో బతకగలవా అన్నది కూడా ఎవరికీ తెలీదు. కరోనా వైరస్ ల మీద చేసిన ఇతర రీసెర్చుల్లో తెలిసిందేమిటంటే సార్స్, మీర్స్ లాంటివి మెటల్, ప్లాస్టిక్, గ్లాస్ ల మీద దాదాపు తొమ్మిది రోజుల పాటూ బతకగలవు.
NIH స్టడీ ప్రకారం Sars-CoV-2 వైరస్ కార్డు బోర్డు మీద ఎక్కువ సేపు బతకగలవు, 24 గంటల నుండి 2-3 రోజుల వరకూ ప్లాస్టిక్, స్టీల్ ఉపరితలాల మీద బతకగలవు.
సార్స్ వ్యాధికి కారణమయ్యే కరోనా వైరస్ ను 56 డిగ్రీల ఉష్ణోగ్రతలో చంపేయొచ్చట.. కానీ నావల్ కరోనా వైరస్ ను ఏ టెంపరేచర్ లో చంపేయొచ్చు అన్నదానిపై శాస్త్రవేత్తలు ఇంకా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు.
రిజల్ట్:
కాబట్టి సామాజిక మాధ్యమాల్లో.. కరోనా వైరస్ ను అత్యధిక ఉష్ణోగ్రత లో చంపేయొచ్చు అని వైరల్ అవుతున్న మెసేజీలు పచ్చి అబద్ధం.