ఫేస్ 'బుక్కై' పోతారు జాగ్రత్త!!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 15 Nov 2019 12:56 PM IST
ముఖపుస్తక యోధుల్లారా...బహుపరాక్!! మీరు మీ ఫేస్ బుక్కులో పెట్టే పోస్టులను ప్రభుత్వ పెద్దన్న గమనిస్తున్నాడు. అంతే కాదు. చాలా సందర్భాల్లో మీరు బాగా నమ్మిన మీ ఫేస్ బుక్ మీ గురించి ప్రభుత్వం అడిగిన వివరాలను సమర్పించేసుకుంటోంది. ప్రభుత్వం వివరాలు అడగటం నానాటికీ పెరుగుతోంది. గతేడాది కన్నా ఈ ఏడాది ఎక్కువ మంది సమాచారాన్ని ప్రభుత్వం అడిగింది.
ఈ వివరాలను స్వయంగా ఫేస్ బుక్కే 'ట్రాన్స్పరెన్సీ రిపోర్టు' పేరిట జారీ చేసింది. ఈ ఏడాది ప్రథమార్థంలో అంటే జనవరి నుంచి జూన్ నెలాఖరు వరకు ప్రభుత్వం 22684 ఫేస్ బుక్ ఖాతాల వివరాలను అడిగింది. ఇది గతేడాది ఇదే వ్యవధిలో అడిగిన వివరాల కంటే 37 శాతం ఎక్కువ. గతేడాది ఇదే కాల వ్యవధిలో 16580 రిక్వెస్టులు, జులై నుంచి డిసెంబర్ మద్యలో 20656 రిక్వెస్టులు వచ్చాయి. అంతే కాదు. అమెరికా తరువాత ఇన్ని 'రిక్వెస్టులు' ఇండియా నుంచే వస్తున్నాయట. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో ప్రభుత్వం అడిగిన కేసుల్లో 54 శాతం కేసుల తాలూకు వివరాలను తన నియమనిబంధనలకు లోబడి, చట్టపరమైన, న్యాయపరమైన అంశాల పరిశీలన అనంతరమే ఇచ్చిందని నివేదిక చెబుతోంది.
ప్రపంచవ్యాప్తంగా 1,28,617 అభ్యర్థనలు వివిధ ప్రభుత్వాలనుంచి వచ్చాయి. వీటిలో ఫేస్ బుక్ 71.6 శాతం కేసుల్లో వివరాలను తెలియపరచింది. అందరికన్నా ఎక్కువ అభ్యర్థనలు అమెరికా నుంచి వచ్చాయి. అమెరికా 90,461 మంది ఫేస్ బుక్ వాడకందారులకు సంబంధించిన 50,714 వివరాల అభ్యర్థనలను పంపించింది. ఆ తరువాత 33,364 ఖాతాలకు సంబంధించి 22,684 అభ్యర్థనలను భారత్ పంపించింది. ఆ తరువాత యూకె 10,550 ఖాతాలకు సంబంధించిన 7,721 అభ్యర్థనలను పంపించింది. జర్మనీ 9,800 ఖాతాలకు సంబంధించి 7,802 అభ్యర్థనలను పంపించింది. ఫ్రాన్స్ 6,971 కేసుల్లో 5,782 అభ్యర్థనలు ఇవ్వడం జరిగింది.