ఫేస్‌బుక్‌ ఉద్యోగులకు 'కరోనా' బోనస్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 March 2020 6:05 PM IST
ఫేస్‌బుక్‌ ఉద్యోగులకు కరోనా బోనస్‌

కరోనా(కొవిడ్‌-19) వైరస్‌ ప్రపంచ దేశాలని వణికిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. తమ ఉద్యోగులకు కరోనా వైరస్ బోనస్ అందించనున్నట్లు సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్‌ ప్రకటించారు. 45 వేల మంది ఉద్యోగులకు 1,000 డాలర్లు (రూ. 74,037) నగదును బోనస్‌గా అందించనుంది. అమెరికాకు చెందిన వర్క్ డే అనే ఫైనాన్షియల్ సంస్థ రెండు వారాల వేతనాన్ని కంపెనీ ఉద్యోగులకు బోనస్ ప్రకటించిన నేపథ్యంలో ఫేస్‌బుక్ భారీగా బోనస్ ప్రకటించడం గమనార్హం.

కరోనా వైరస్ మహమ్మారి విస్తరిస్తున్న​ నేపథ్యంలో ఇంటి వద్ద నుంచే పని చేస్తున్న(వర్క్‌ ఫ్రమ్‌ హోం) ఉద్యోగుల శ్రమను గుర్తించి జుకర్ బర్గ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. నిత్యం పిల్లలకు దూరంగా ఉంటూ ఆఫీస్ కోసం ఎంతో శ్రమిస్తున్న ఉద్యోగులకు ఇలాంటి సమాయాల్లో బోనస్ ప్రకటించడం వారిలో నూతనోత్సాహాన్ని నింపుతుందని భావిస్తున్నట్లు సీఈఓ జుకర్ బర్గ్ ఉద్యోగులకు రాసిన లేఖలో వెల్లడించారు. ఇంట్లో కాస్త ఆఫీసు వాతావరణం కల్పించుకోవడంలో ఉద్యోగుల ఇబ్బందులు తొలగించడానికి బోనస్ ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుల్‌ టైం ఉద్యోగులకు ఈ బోనస్‌ వర్తించనుంది. ఇదిలా ఉంటే.. కరోనా వైరస్‌తో ఇప్పటికే 7,987 మంది మృత్యువాత పడగా.. లక్ష మందికి పైగా దీని బాధితులు ఉన్నారు.

Next Story