జియోలో 9.99 శాతం వాటా సొంతం చేసుకున్న ఫేస్‌బుక్‌

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  22 April 2020 5:09 AM GMT
జియోలో 9.99 శాతం వాటా సొంతం చేసుకున్న ఫేస్‌బుక్‌

రిలయన్స్ జియోలో ఫేస్ బుక్ వాటాను సొంతం చేసుకుంది. రూ.4.62 లక్షల కోట్ల విలువ ఉన్న జియోలో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ 9.99 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఈ డీల్ ద్వారా జియోలో అతిపెద్ద మైనారిటీ షేర్ హోల్డర్‌గా ఫేస్‌బుక్ నిలవనుంది. మైనారిటీ వాటా కోసం ఒక టెక్ కంపెనీ ఈ స్థాయిలో ఇన్వెస్ట్ చేయడం కూడా ప్రపంచంలో ఇదే తొలిసారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) ఈ డీల్ పై మాట్లాడుతూ రిలయన్స్ రిటైల్, ఫేస్‌బుక్ కు చెందిన వాట్సాప్‌ను కూడా ఈ కామర్స్ బిజినెస్ కోసం వినియోగించుకోనున్నామని తెలిపింది. జియో ప్లాట్‌ఫామ్స్, రిలయన్స్ రిటైల్, వాట్సాప్ మధ్య కూడా వ్యూహాత్మక భాగస్వామ్యం కుదిరినట్లేనని సంస్థ ప్రతినిధులు తెలిపారు. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ స్థాయికి రిలయన్స్ కు చెందిన జియోమార్ట్‌ను తీసుకువెళ్లాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎప్పటి నుండో ప్రయత్నిస్తోంది.. ఫేస్ బుక్ తో కుదిరిన భాగస్వామ్యం ద్వారా ఇకపై జియోమార్ట్ మరింత ముందుకు వెళ్లబోతోంది.

ముఖేశ్ అంబానీ ఈ డీల్ పై స్పందించారు. ఇండియా డిజిటల్ సర్వోదయ లక్ష్యంతో 2016లో జియోను ప్రారంభించాం. దేశంలోని ప్రతీ ఒక్కరి జీవితంలో నాణ్యత పెంచేలా, భారత్‌ను ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ సమాజంగా నిలిపేలా జియోను తీసుకొచ్చామన్నారు. జియోలోకి ఫేస్‌‌బుక్‌ను ఆహ్వానించడం గౌరవప్రదమైనదని.. ఈ డీల్ ద్వారా ప్రతి భారతీయుడు డిజిటల్ రంగంలో మరింత లబ్ధి పొందుతారని ఆశిస్తున్నామని అన్నారు. ఎలాంటి హద్దులు లేకుండా ఈజ్ ఆఫ్ లివింగ్, ఈజ్ ఆఫ్ డుయింగ్ బిజినెస్ లక్ష్యాలను చేరుకుంటుందని ఆశిస్తున్నామన్నారు.

మార్క్ జూకర్ బర్గ్ ఈ డీల్ పై తన అకౌంట్ లో పోస్టు పెట్టారు. భారతదేశంలో జియోతో ఫేస్‌బుక్ జత కట్టిందని.. ప్రజలు, వ్యాపారం కోసం జియో, ఫేస్‌బుక్ కలిసి సరికొత్త మార్గాలను అన్వేషిస్తాయని అన్నారు. డిజిటల్ ఎకనామీ అభివృద్ధికి తమ బంధం దోహదం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్‌ లో డిజిటల్ దిశగా ప్రయాణం మొదలైందని. చిన్న వ్యాపారాలు ఆన్‌లైన్ దిశగా అడుగులు వేస్తున్నాయన్నారు. ఈ మార్పులో జియో పాత్ర అత్యంత కీలకమని తెలిపారు. భారత్‌లో 6 కోట్ల చిన్న వ్యాపారాలు ఉన్నాయని.. లక్షలాది మంది వాటిపై ఆధారాపడి బతుకుతున్నారని చెప్పుకొచ్చారు. లాక్‌డౌన్ లో చాలా మంది డిజిటల్ వ్యవహారాలపై దృష్టి సారిస్తున్నారని.. వారికి జియో సహాయం చేస్తోందని తెలిపారు. ఈ డీల్ కు కారణమైన ముఖేశ్ అంబానీకి, జియో టీమ్‌కు థాంక్స్ చెప్పారు మార్క్.

భారత్ లో 38.8 కోట్ల మంది వినియోగదారులకు టెలికం సేవలను అందిస్తోంది జియో ఇన్ఫోకామ్. ఈ డీల్ తరువాత కూడా జియో ప్లాట్ ఫామ్ అనుబంధ సంస్థగానే కొనసాగుతుందని రిలయన్స్ స్పష్టం చేసింది. ఫేస్ బుక్ తో డీల్ ద్వారా భారత్ లో వాణిజ్యం, ముఖ్యంగా సూక్ష్మ చిన్న తరహా వ్యాపారులకు, రైతులకు మేలు కలుగుతుందని జియో చెబుతోంది.

Next Story
Share it