ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం సంభ‌వించింది. ఓ క‌ర్మాగారంలో పేలుడు సంభవించడంతో ఏడుగురు మృతిచెందగా.. మరో నలుగురు  గాయాలపాల‌య్యారు. ఆదివారం ఘ‌జియాబాద్‌లోని కొవ్వ‌త్తి త‌యారీ కర్మాగారంలో కార్మికులు పనిచేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభ‌వించింది. దీంతో ఘ‌ట‌న‌లో గాయపడిన వారిని వెంటనే.. సమీపంలోని ఆస్పత్రికి తర‌లించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని స‌మాచారం.

ఘ‌జియాబాద్‌లోని మోదీ న‌గ‌ర్.. త‌హ‌సీల్ ప‌రిధిలో బాక‌ర్వా గ్రామంలోని కొవ్వ‌త్తి క‌ర్మాగారంలో ఆదివారం మ‌ధ్యాహ్నం పేలుళ్లు సంభ‌వించాయి. పేలుళ్లు సంభ‌వించిన స‌మ‌యంలో ఫ్యాక్టరీలో మొత్తం 30 మంది కార్మికులు విధులు నిర్వ‌ర్తిస్తున్నార‌ని పోలీసులు తెలిపారు.


పేలుళ్ల ధాటికి ఒక్క‌సారిగా మంట‌లు ఎగిసిప‌డ‌టంతో.. కార్మికులు బ‌య‌ట‌కు పారిపోయేందుకు ప్ర‌య‌త్నించారు. కానీ, అప్ప‌టికే మంట‌లు వ్యాపించ‌డంతో కొంద‌రు స‌జీవ‌ద‌హ‌నం అయ్యారని పోలీసులు తెలిపారు. మంట‌ల వ్యాప్తి నేప‌థ్యంలో చుట్టుప‌క్క‌ల గ్రామాల ప్ర‌జ‌లు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. స‌మాచారం అందుకున్న‌ అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసి మృతదేహాలను వెలికితీశారు. మృత‌దేహాల‌ను పోస్ట్ మార్టం నిమిత్తం ప్ర‌భుత్వాసుప‌త్రికి త‌ర‌లించారు.

పేలుళ్ల ఘటనపై సీఎం యోగి ఆదిత్యానాథ్ స్పందించారు. ఘటనలో గాయపడిన వారికి అత్యవసర వైద్య చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరిపి.. వెంట‌నే నివేదిక సమర్పించాలని జిల్లా ఎస్పీని కోరారు.

సామ్రాట్ మేడి

మేడి. సామ్రాట్ .. నేను న్యూస్ మీట‌ర్ లో జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేస్తున్నాను. గ‌తంలో ఆంధ్ర‌ప్ర‌భ‌, భార‌త్ టుడే, న్యూస్ హ‌బ్, ఏపీ హెరాల్డ్ ల‌లో 3 సంవ‌త్స‌రాల పాటు ప‌నిచేశాను. జ‌ర్న‌లిజం ప‌ట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.