మహారాష్ట్ర, హర్యానాల్లో ఓటర్ నాడీ అంచనా వేయడంలో ఎగ్జిట్ పోల్స్ ఫెయిల్ అయ్యాయి. 2019 లోక్ సభ ఎన్నికల తరువాత దేశంలో జరిగిన ఎన్నికలు మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలు. ఒక రకంగా మోదీ ప్రభుత్వంపై రెఫరిండం. అయితే…మహారాష్ట్ర, హర్యానాల్లో ప్రజల నాడీ పట్టుకోవడంలో జాతీయ సర్వేలు అన్నీ ఫెయిల్ అయ్యాయనే చెప్పాలి. దాదాపు గా అన్ని జాతీయ ఎగ్జిట్ పోల్స్ మహారాష్ట్రలో బీజేపీ కూటమికి 200 సీట్లకు పైగా వస్తాయని చెప్పారు. అలానే ..హర్యానాలో కూడా స్వీప్‌ చేస్తుందని ..కాంగ్రెస్ 20 లోపు సీట్లకే పరిమితం అవుతుందని ఢంకా భజాయించారు.

కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మోదీ వేవ్ కొనసాగుతున్న మాట వాస్తవమే. కాని..అక్కడక్కడ కేంద్రంపై వ్యతిరేకత ఉందనే విషయాన్ని జాతీయ పాత్రికేయులు పసిగట్టలేకపోయారు. మహారాష్ట్ర, హర్యానా రెండింటిలోనూ
బీజేపీ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి. ఎంత చేసినా ప్రభుత్వాల మీద కాస్తాకూస్తో వ్యతిరేకత ఉంటుంది. వ్యతిరేకతను పట్టుకోవడంలో కూడా ఎగ్జిట్ పోల్స్ విఫలమయ్యాయి. కాంగ్రెస్ పుంజుకుంటుందని ఈ ఎన్నికల ద్వారా రుజువైంది. మరీ ..అనుకున్నంత దారుణంగా కాంగ్రెస్ పరిస్థితి లేదని ఈ ఎన్నికలు రుజువు చేశాయి. కాంగ్రెస్ ఓడిపోయినప్పటికీ..టెన్ జన్‌పథ్‌కు ఇది ఒక రకంగా శుభవార్తే.

మహారాష్ట్రలో తగ్గిన బీజేపీ బలం..పుంజుకున్న కాంగ్రెస్..!

2014లో జరిగిన ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీ -శివసేన కలిసి 217 సీట్లు గెలుచుకున్నాయి. బీజేపీ 142 సీట్లు  ..శివసేన 75 సీట్లు గెలుచుకుంది. గతంలో కంటే ఇప్పుడు బీజేపీ, శివసేన కూటమికి సీట్లు తగ్గే అవకాశముంది.అయినప్పటికీ అధికారం దక్కించుకుంటున్నారు. బీజేపీ కూటమి మైనస్‌లో పడితే, కాంగ్రెస్‌ ప్లస్‌లో పడుతుంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్‌సీపీ 68 సీట్లు గెల్చుకుంటే..ఈ ఎన్నికల్లో 100 సీట్లు దగ్గరగా గెలుచుకోబోతున్నారు. సో..కాంగ్రెస్ కూటమి చాలా వరకు కోలుకుందనే చెప్పాలి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ 27, ఎన్‌సీపీ 29 సీట్లు గెల్చుకుంటే.. ఈ ఎన్నికల్లో చెరి 40 సీట్లకుపైగా గెలుచుకుంటున్నారు. ఇది ఒకరకంగా కాంగ్రెస్‌కు మంచి పరిణామమే అని చెప్పాలి. ఇక..బీజేపీ – శివసేన కూటమి గెలిచినప్పటికీ..వారికి ఇది హెచ్చరికే .

హర్యానాలో హోరాహోరీ..!

ఇక..హర్యానాలో కూడా ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన విధంగా బీజేపీకి సీట్లు రాలేదు. ఠాకూర్లు కాంగ్రెస్ వైపు నిలిచారని ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. పంజాబ్ బ్రాహ్మణుడు ఖట్టర్‌కు సీఎం పగ్గాలు అప్పగించడంపై మొదటి నుంచి ఠాకూర్లు గుర్రుగా ఉన్నారు. హర్యానాలో మొత్తం 90 సీట్లు ఉన్నాయి. ఇక్కడ మేజిక్ మార్క్‌ 46 సీట్లు. గత ఎన్నికల్లో బీజేపీ 48 సీట్లు గెలుచుకుని స్పష్టమైన మెజార్టీ సాధించింది. ఇక..కాంగ్రెస్ గత ఎన్నికల్లో 17 సీట్లకు పరిమితమైతే.. ఈ ఎన్నికల్లో 30కి పైగా సీట్లకు పైగా గెలుచుకునే అవకాశం కనిపిస్తోంది. ఒక రకంగా హర్యానాలో బీజేపీకి కాంగ్రెస్ ముచ్చెమటలు పట్టించిందనే చెప్పాలి. హర్యానాలో హంగ్ వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరంలేదు. మొత్తానికి ప్రజల ఆలోచనలు, ప్రభుత్వ వ్యతిరేకతను అంచనా వేయడంలో ఎగ్జిట్ పోల్స్ మరోసారి దారి తప్పాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిచినప్పటికీ…ప్రజలు ఓ హెచ్చరిక పంపారనే చెప్పాలి. ఇక..ఐసీయూలో ఉన్న కాంగ్రెస్‌కు ప్రజలు ఆక్సిజన్ ఇచ్చారనే చెప్పాలి.

మహారాష్ట్ర, హర్యానాలపై ఎగ్జిట్ పోల్స్ చూద్దాం..!

1

2

 

3

4

వై.వి.రెడ్డి, న్యూస్ ఎడిటర్, న్యూస్ మీటర్

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.