ఆయన ఆర్నెళ్ల క్రితం వచ్చాడు.. మేం ఆయన చిన్న తనం నుంచే ఉద్యమిస్తున్నాం
By సుభాష్ Published on 27 Dec 2019 8:37 AM GMTఏపీలో సీఎం జగన్ మూడు రాజధానులు ప్రకటించడంపై చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రకటనతో ప్రతిపక్షాలు ఆందోళనబాట పట్టాయి. మూడు రాజధానుల ప్రకటనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఏపీలో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశంపై ఏపీ మాజీ హోంమంత్రి, మాజీ ఎంపీ మైసూరారెడ్డిని న్యూస్‌మీటర్ ఇంటర్వ్యూ చేయగా, పలు విషయాలను వెల్లడించారు. ఆయన మాటల్లోనే...
న్యూస్‌మీటర్ ప్రతినిధి :
ఏపీలో హట్ టాపిక్ గా మూడు రాజధానుల అంశం. అసలు మూడు రాజధానులపై మీ అభిప్రాయం ఏమిటీ..?
మైసూరారెడ్డి :
మేము రాజధానులను వ్యతిరేకించడం లేదు. ఏదైన ఆస్తుల పంపకాల విషయంలో మూడు సమాన భాగాలుగా ఉండాలి. విజయవాడలోని పొలిటికల్ క్యాప్టల్ అన్నారు. వైజాక్ లో అడ్మినిస్టేటల్ రాజధాని అన్నారు. ఇక రాయలసీమ వచ్చే సరికి న్యాయ రాజధాని అన్నారు. ఈ పంపకాల్లో సమానం కాదు కదా. ఇక న్యాయరాజధాని అన్నప్పుడు కోర్టులకు సంబంధించిన చిన్న విభాగం. అది రాజధాని ఎలా అవుతుంది. దాన్ని ఎలా అభివృద్ధి చేస్తారు. వెనుక బడిన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే బాగుంటుంది. ఇక విశాఖలో అయితే రాజధాని చేయాలని ఎవ్వరు కూడా అడగలేదు. ప్రకటించిన మూడు రాజధానులు కూడా సరైనవి కావన మా వాదన. సరైన న్యాయం జరగాలంటే రాజధానిని కర్నూలులో ఏర్పాటు చేయాలి. ఎందుకంటే గతంలో మద్రాస్ రాష్ట్రం నుంచి విడిపోయేటప్పుడు కూడా ఇక్కడికి మా పెద్దలు ఎవరు కూడా వస్తామని చెప్పలేదు. మద్రాస్‌లోనే ఉంటామని చెప్పారు. తర్వాత తెలుగు వారందరం కలిసిపోయాం. కానీ రెండుగా విడిపోయిన తర్వాత కర్నూలును రాజధానిగా ఏర్పాటు చేశారు. తర్వాత కర్నూలు నుంచి హైదరాబాద్‌ను రాజధానిగా చేశారు. అప్పుడు కర్నూలు రాజధానిని తీసేసి హైదరాబాద్ ను రాజధానిని చేశారు. అప్పుడు మేం త్యాగం చేసినట్లే కదా.. అందుకే ఇప్పుడు కర్నూలుకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఇక్కడే రాజధానిని ఏర్పాటు చేయాలని మేం డిమాండ్ చేస్తున్నాం.
న్యూస్‌మీటర్ ప్రతినిధి:
ప్రస్తుతం రాజధాని తమకు అనుకూలంగా ఉండాలని అంటున్నారు. అది సాధ్యపడుతుందంటారా..? ఇప్పుడు అమరావతిలో కూడా అలాంటి ఆందోళననే కొనసాగుతుంది కదా..?
మైసూరారెడ్డి :
అలాగే విశాఖలో రాజధాని కావాలని ఎవ్వరు కూడా అడగలేదు. అలాంటప్పుడు మీరు రాజధానిగా ఎందుకు ప్రకటిస్తారు. అడగని వాళ్లకు రాజధానిని ప్రకటిస్తున్నారు. అడగే వాళ్లకు ఇవ్వడం లేదు.
న్యూస్‌మీటర్ ప్రతినిధి:
వైసీపీకి అనుకూలంగా విశాఖలో రాజధానిని ప్రకటించారని ఓ వాదన ఉంది. దీనికి మీరేమంటారు..?
మైసూరారెడ్డి:
రాజకీయ పార్టీలు వేరు. ప్రజలు వేరు. ప్రభుత్వాన్ని ప్రజలే ఎన్నుకున్నారు కాబట్టి రాజధానిని అడిగి హక్కు ప్రజలకే ఉంటుంది. ముందుగా ప్రజలకే ప్రాధాన్యత ఇవ్వాలి గాని రాజకీయ నాయకులు కాదు. అప్పుడు మద్రాస్ రాష్ట్రం ఉన్నప్పుడు కూడా రాజధాని కావాలని అడిగాము.. తర్వాత రాజధానిని హైదరాబాద్‌కు తరలిస్తుంటే కూడా అప్పుడు కూడా మాకు రాజధాని కావాలని ప్రజలు అడిగారు. ఇప్పుడు కూడా మాకు రాజధాని కావాలని ప్రజలు అడుగుతున్నారు. అందుకే ప్రజలకే ప్రాధాన్యత ఇవ్వాలి.
న్యూస్‌మీటర్ ప్రతినిధి:
కర్నూలును పరిపాలన రాజధానిగా అడగడంలో ఏదైన రాజకీయ కోణాలున్నాయా..?
మైసూరారెడ్డి:
ఇందులో రాజకీయ కోణాలేమి లేవు. పరిపాలన రాజధాని కానివ్వండి.. ఇంకేదైన కాని ఇక్కడ రాజధానిని ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. అందుకే పరిపాలన రాజధానిని ఏర్పాటు చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం.
న్యూస్‌మీటర్ ప్రతినిధి:
మీరు చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఉన్నట్టుండి రాజధానుల అంశం తెరపైకి తీసుకువచ్చారు. ఇందులో ఏదో రాజకీయం ఉందని ఆరోపణలు ఉన్నాయి. దీనికి మీరేమంటారు.
మైసూరారెడ్డి :
ఇందులో ఎలాంటి రాజకీయం లేదు. చంద్రబాబు ఉన్నప్పుడైనా, అంతకు ముందైనా, ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రి ఉన్న సమయంలోనైనా రాజధాని కావాలని కోరుతున్నాము. ఎందుకంటే అభివృద్ధే కాకుండా ప్రజల శ్రేయస్సు కోసమే అడుగుతున్నాం.
న్యూస్‌మీటర్ ప్రతినిధి:
గతంలో వైసీపీలో ఉన్నమీరు.. తర్వాత టీడీపీలో చేరారు. ఇప్పుడు రాజధాని విషయంలో స్పందిస్తున్నారు. కానీ జగన్‌ను ఇబ్బంది పెట్టడానికేనంటున్నారు కొందరు రాజకీయ నేతలు. దీనికి మీ సమాధానం.
మైసూరారెడ్డి:
జగన్‌ను ఇబ్బంది పెట్టే అవసరం నాకు ఉండదు. జగన్ విద్యార్థిగా ఉన్న సమయంలోనే రాయసీమ శ్రేయస్సు కోసం పోరాటం చేశాను. అప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా ఉన్నారు. ఆ సమయంలో కొన్ని కార్యక్రమాలు కూడా సాధించాము. కాని అప్పుడున్న సమస్య వేరు. ఇప్పుడున్న సమస్య వేరు వాటిని దృష్టిలో ఉంచుకునే రాజధాని ప్రాంతం కావాలని కోరుతున్నాం. జగన్ ఇప్పుడు మాత్రమే అధికారంలో ఉన్నారు. కాని మేము ఎప్పటి నుంచో ఈ సమస్యలపై పోరాటం చేస్తూనే ఉన్నాం. ఇది ఇప్పుడు కొత్తేమి కాదు.
న్యూస్‌మీటర్ ప్రతినిధి:
గ్రేటర్ రాయలసీమ నాయకుల తదుపరి కార్యాచరణ ఏముంటుంది..?
మైసూరారెడ్డి:
ఈ విషయంపై మేము త్వరలో చెబుతాం. ఎందుకంటే రాజధాని గురించి ఏం నిర్ణయం తీసుకుంటారో దానిపై మేము కార్యాచరణ నిర్ణయిస్తాం. మాకు కావల్సింది ఇచ్చిన తర్వాత కార్యాచరణ చేసే అవసరం ఉండదు. జగన్‌మోహన్‌రెడ్డిని ఇరుకున పెట్టే అవసరం ఏముంటుంది. దీనిపై జగన్‌కు గాని, చంద్రబాబుకు గాని బాధ్యత లేదా. ఈ ప్రాంతాన్ని రాజధాని చేయాలనే బాధ్యత వారిపై కూడా ఉంది.
న్యూస్ మీటర్ ప్రతినిధి:
అప్పట్లో చంద్రబాబు అమరావతి ప్రాంతాన్నిరాజధాని ప్రకటించిన సమయంలో ఆ ప్రాంతంలోని భూములన్ని టీడీపీ నేతలు కొనుగోలు చేశారని, అందుకే ఆ ప్రాంతాన్ని రాజధాని ప్రకటించారనే వైసీపీ ఆరోపణలు చేసింది. ఇప్పుడు కూడా విశాఖ చుట్టు పక్కల ప్రాంతాల్లో 39వేల ఎకరాలు వైసీపీ నేతలు కొనుగోలు చేశారని, అందుకే విశాఖను రాజధాని ప్రకటించారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనికి మీరేమంటారు.?
మైసూరారెడ్డి :
అధికారంలో ఏ పార్టీ ఉన్నా.. ఆ నేతలు భూములు కొనుగోలు చేయడం అనేది సర్వసాధారణం. నేను వైసీపీ నేతలపై గానీ, టీడీపీ నేతలపైగా ఎలాంటి అంశం మాట్లాడటం లేదు. కానీ విశాఖను రాజధానిగా ప్రకటించాలని ఎవ్వరు కూడా అడగలేదు. ఎక్కడ ప్రచారం కూడా ఏమీ జరగలేదు. అలాంటిది అడగని వారి ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించి, అడిగిన వారికి ఇవ్వకుంగా ముఖ్యమైన విభాగాన్ని విశాఖలో ఏర్పాటు చేస్తామన్నారు. అడగని వాళ్లకు ఇచ్చి, అడిగేవాళ్లకు వద్దనడంలో అర్థం ఏంటో వారే ఆలోచించాలి.