మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు బెయిల్‌ మంజూరు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Aug 2020 12:23 PM GMT
మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు బెయిల్‌ మంజూరు

మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్రకు కృష్ణా జిల్లా కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. మచిలీపట్నానికి చెందిన వైసీపీ నేత, మంత్రి షేర్ని నాని ప్రధాని అనుచరుడు మోకా భాస్కరరావు హత్య కేసులో అరెస్టు అయి రిమాండ్‌లో ఉన్న రవీంద్రకు కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. 14 షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది కోర్టు. అంతేకాదు లక్ష రూపాయాల పూచీకత్తును కూడ ఇవ్వాలని.. 28 రోజుల పాటు విజయవాడలోనే ఉండాలని కోర్టు ఆదేశించింది.

మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ మోకా భాస్కరరావు జూన్‌ 29న హత్యకు గురయ్యారు. పట్టణంలోని చేపల మార్కెట్‌కు వెళ్లారు. అక్కడ జరుగుతున్న మరమ్మతు పనులను పరిశీలించారు. ఉదయం 11 గంటల సమయంలో తన ద్విచక్రవాహనంపై వెనుదిరిగారు. అదే సమయంలో ఆయనపై దుండగులు కత్తులతో దాడి చేశారు. గుండెల్లో పొడవడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. స్థానికులు ఆయనను ఆటోలో ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. భాస్కరరావు హత్య కేసులో సహకారం అందించారనే ఆరోపణతో మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు తూర్పుగోదావరి జిల్లా తుని మండలం సీతాపురం వద్ద జూలై 3న అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్నారు.

Next Story
Share it