జమ్మూకశ్మీర్‌కు అంతర్జాతీయ బృందం రానుంది. యూరోపియన్ యూనియన్‌కు చెందిన ప్రతినిధులు కశ్మీర్‌లో పర్యటించనున్నారు. మంగళవారం ఈ పర్య టన కొనసాగనుంది. ఈయూకు చెందిన 25 మంది ఎంపీలతో కూడిన బృందం కశ్మీర్‌కు రానుంది. జమ్మూ కశ్మీర్‌లో తాజా పరిణామాలు, క్షేత్ర స్థాయి పరిస్థితులను పరిశీలించనుంది. టూర్‌లో భాగంగా స్థానిక ప్రజలు, నాయకులతో కూడా ఈయూ టీం సమావేశమయ్యే అవకాశముంది. ఉన్నతాధికారులు, ప్రభుత్వ ప్రతి నిధులను కలిసే అవకాశాలున్నాయి. ఈయూ టీం కశ్మీర్ టూర్‌ను ప్రధానమంత్రి కార్యాలయం కూడా ధ్రువీకరించింది. యూరోపియన్ యూనియన్‌ పార్లమెంట్ సభ్యులు మంగళవారం కశ్మీర్‌లో పర్యటించి అక్కడి వాస్తవ పరిస్థితులను పరిశీలిస్తారని అధికారవర్గాలు పేర్కొన్నాయి.

యూరోపియన్ యూనియన్ పార్లమెంట్‌కు చెందిన 25మంది సభ్యుల బృందం జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో సమావేశమైంది. అనంతరం ఈయూ ప్రతినిధులు సమావేశమయ్యారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిశారు. ఈ సందర్భంగా కశ్మీర్‌ అంశం చర్చకు వచ్చినట్లు సమాచారం. జమ్మూకశ్మీర్‌లో ప్రస్తుత పరిస్థితిని, సరిహద్దు వద్ద సిచ్యువేషన్‌ను ఈయూ ప్రతినిధులకు మోదీ వివరించినట్లు సమాచారం. ఉగ్రవాద నిర్మూలనపై కఠినంగా వ్యవహరించాలని ఈయూ సభ్యులకు మోదీ సూచించారు. టెర్రరిజాన్ని పెంచి పోషించే దేశాలకు గట్టి గుణపాఠం చెప్పాలని కోరారు.

కశ్మీర్‌లో విదేశీ బృందం పర్యటనకు మోదీ సర్కారు అనుమతి ఇవ్వడం సంచలనం రేపింది. ఆర్టికల్-370 రద్దు తర్వాత అంతర్జాతీయ టీం కశ్మీర్‌లో పర్యటించనుండడం ఇదే మొదటిసారి. ఆగస్టు 5న, కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్-370ని మోదీ సర్కారు రద్దు చేసింది. ఇది పాకిస్థాన్‌కు భయంకరమైన షాక్ కలిగించింది. కశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దుతో కుతకుతలాడిపోయిన పాక్, ఉగ్రవాదులను ప్రేరేపించి లోయలో చిచ్చు పెట్టాలని ప్రయత్నించింది. ఈ పన్నాగాన్ని భద్రతా బలగాలను ఎప్పటికప్పుడు భగ్నం చేశాయి. ఉగ్రవాదులను ఎక్కడికక్కడ ఏకిపారేశాయి. దాంతో అంతర్జాతీయంగా భారతదేశాన్ని అప్రతిష్టపాలు చేయడానికి పాక్ కుట్ర పన్నింది. కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, వేలాదిమంది ప్రజలను నిర్బంధించారంటూ ప్రచారం చేసింది. కొన్ని పశ్చిమ దేశాలు, వెస్ట్రన్ మీడియా కూడా కశ్మీర్‌పై అబద్దాలు, అసత్య కథనాలను ప్రచారం చేస్తున్నాయి. ఈ కుట్రలను తిప్పికొట్టడంలో భాగంగా మోదీ సర్కా రు వ్యూహత్మకంగా అడుగు ముందుకు వేసింది. అంతర్జాతీయ ప్రతినిధులు కశ్మీర్‌ను సందర్శించడానికి అనుమతి ఇచ్చింది. యూరోపియన్ యూనియన్ కశ్మీర్ పర్యటనకు జమ్మూకశ్మీర్ రాజకీయ పార్టీలు స్వాగతించాయి. స్థానిక ప్రజలు, మీడియా, వైద్యులతో ఈయూ ప్రతినిధులు మాట్లాడాలని మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ ఆకాంక్షించారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.