గాంధీ ఆసుపత్రిలో నాలుగు గంటల పాటు ఈటెల ఏం చేశారు?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  11 Jun 2020 7:44 AM GMT
గాంధీ ఆసుపత్రిలో నాలుగు గంటల పాటు ఈటెల ఏం చేశారు?

తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో ఫైర్ బ్రాండ్ గా వ్యవహరించటమే కాదు.. కీలక సమయాల్లో ఆయన చేసే వ్యాఖ్యలు.. ప్రసంగాలు విపరీతంగా ఆకట్టుకునేవి. కేసీఆర్ తొలి సర్కారులో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన ఆయన.. రెండో టర్మ్ లో మాత్రం వైద్య ఆరోగ్య శాఖామంత్రికి పరిమితమయ్యారు. గడిచిన కొన్ని దశాబ్దాల్లో ఏ రాష్ట్ర ఆరోగ్య మంత్రి ఎదుర్కోనంత ఒత్తిడిని ఈటెల తాజాగా ఎదుర్కొంటున్నారు.

రాష్ట్ర మంత్రి హోదాలో ఏదైనా ప్రభుత్వ ఆసుపత్రికి వెళితే.. మహా అయితే పావుగంట లేదంటే గంటలోపే తిరిగి వెళ్లిపోయేవారు. అత్యవసరం అనుకుంటే కాస్త ఎక్కువగా ఉండేవారు. ఈటెల సన్నిహితుల లెక్క ప్రకారం ప్రభుత్వ దవాఖానాలో అట్టే సమయం ఉండటం ఈటెలకు మొదట్నించి అలవాటు లేదు. అందుకు భిన్నంగా తాజాగా కోవిడ్ ఆసుపత్రికి ఫేమస్ అయిన గాంధీ ఆసుపత్రికి వచ్చిన మంత్రి ఈటెల.. గంటల తరబడి అక్కడే ఉండిపోవటం ఆసక్తికరంగా మారింది.

రెండు రోజుల క్రితం గాంధీ ఆసుపత్రిలో ఒకరు మరణిస్తే.. మరొకరి పేరు మీద వారి కుటుంబ సభ్యులకు అందించటం.. పాజిటివ్ చికిత్స తీసుకుంటున్న వారికి సరైన వైద్యం చేయలేదంటూ ఆగ్రహంతో గాంధీ వైద్యుల మీద దాడికి దిగిన వైనం తెలిసిందే. పెను సంచలనంగా మారిన ఈ ఉదంతంపై జూనియర్ డాక్టర్లు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రాణాల్ని పణంగా పెట్టి వైద్యం చేస్తుంటే.. తప్పులు జరిగాయని వైద్యుల మీద దాడి చేయటం ఏమిటంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గాంధీలో ఎవరి కారణంగా తప్పు జరిగినా.. అంతిమంగా అదంతా వైద్యుల మీదకు వెళ్లటం.. వారిని టార్గెట్ చేయటాన్ని తప్పు పడుతున్నారు. తమపై జరిగిన దాడి విషయంలో ప్రభుత్వం సరిగా స్పందించలేదన్న ఆగ్రహంతో ఉన్న జూనియర్ డాక్టర్లు.. గాంధీ ఆసుపత్రి ఎదుట ఆందోళనను నిర్వహించారు. తమ సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రే స్వయంగా కదలి రావాలన్న డిమాండ్ తో ధర్నా నిర్వహించారు. దీంతో.. ప్రభుత్వం ఒక్కసారిగా ఇరుకున పడినట్లైంది. కొవిడ్ ఆసుపత్రిగా గాంధీలో చికిత్స చేస్తున్న వేళ.. విధుల్ని బహిష్కరించి ధర్నా చేయటంతో ప్రభుత్వం డిపెన్సులో పడింది.

దీంతో.. మంత్రి ఈటెల హుటాహుటిన గాంధీకి వెళ్లారు. ఎప్పుడూ లేని రీతిలో నాలుగు గంటలకు పైనే గడిపారు. జూనియర్ డాక్టర్లతో విడతల వారీగా సమావేశాల్ని నిర్వహించారు. వారిని బుజ్జగించారు. దాడిని తీవ్రంగా ఖండించటంతోపాటు.. ప్రభుత్వం సైతం ఈ విషయం మీద సీరియస్ గా ఉందన్న సందేశాన్ని వారికి అర్థమయ్యేలా చేశారు. రాష్ట్రంలోని నాలుగు కోట్ల మందికి ఒకే ఆసుపత్రి ఏమిటని? దాని కారణంగా పెరుగుతున్న ఒత్తిడిని ఈటెలకు అర్థమయ్యేలా వైద్యులు వివరించినట్లు చెబుతున్నారు.

వారి ఇబ్బందులపై సానుకూలంగా స్పందించిన ఈటెల.. వారికో ఆఫర్ ఇచ్చారు. ఇప్పటివరకూ లేని రీతిలో.. వైద్యులకు క్వారంటైన్ కల్పించేందుకు కావాలంటే స్టార్ హోటళ్లను బుక్ చేస్తామన్న మాటను చెప్పినట్లు తెలుస్తోంది. మీకెలాంటి వసతులు కావాలంటే వాటిని కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న ఈటెల.. ధర్నాను విడిచిపెట్టాలని.. విధుల్లోకి చేరాలని బుజ్జగించినట్లు తెలుస్తోంది. ఉద్యమ నాయకుడిగా.. ఉద్యమ సమయాల్లో ఉండే మైండ్ సెట్.. వాటిని ఎలా సెట్ చేయాలన్న విషయంలో ఈటెల సక్సెస్ అయ్యారని చెప్పాలి. తన అలవాటుకు భిన్నంగా నాలుగు గంటల పాటు గాంధీలో గడిపిన ఆయన.. ఎట్టకేలకు తాను అనుకున్నట్లే.. ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్లను బుజ్జగించటంలో సక్సెస్ అయ్యారని చెబుతున్నారు.

Next Story