కరోనా కట్టడికి ప్రభుత్వం పకడ్బందీ చర్యలు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 9 Sept 2020 2:04 PM ISTకరోనా వైరస్‌ను నిలువరించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు తీసుకుంటుందని.. మహమ్మారి కట్టడిలో భాగంగా ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నదని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. కరోనా వైరస్‌పై శాసనసభలో చర్చను మంత్రి ఈటల ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరోనా వ్యాపించకుండా మార్చి 14న పాక్షిక లాక్‌డౌన్‌ను ప్రకటించామన్నారు. ఇండోనేషియా నుంచి కరీంనగర్ వచ్చిన వారిని వెంటనే ఐసోలేషన్ చేశామని తెలిపారు. మొదటి నుండి కరోనా పరిస్థితిని సీఎం కేసీఆర్ నిత్యం పర్యవేక్షిస్తున్నారని.. రాష్ట్రంలోనే కరోనా నిర్ధారణ పరీక్షల కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రస్తుతం రోజుకు 60 వేల కరోనా పరీక్షలు చేస్తున్నామని పేర్కొన్నారు.
అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని.. వ్యాధి తీవ్రత తక్కువ ఉన్నవారికి హోం ఐసోలేషన్‌లోనే చికిత్స అందిస్తున్నామని ఈటెల తెలిపారు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నవారికి ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నామని చెప్పారు. కరోనా మరణాల్లో దేశంలో తెలంగాణ 12వ స్థానంలో ఉందని.. కరోనా పట్ల ప్రజలను అప్రమత్తం చేస్తూ నివారణ చర్యలు తీసుకుంటున్నామని ఈటెల అన్నారు.